(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);కేరళలో యూడీఎఫ్ కూటమికి బీటలువారనున్నాయా? కాంగ్రెస్ వైఖరిపై కూటమిలోని పార్టీలు ఆగ్రహంతో ఉన్నాయా? విశ్లేషకులు అవుననే అంటున్నారు. ఉమ్మడి పౌరస్మృతి ప్రైవేటు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే సమయంలో కాంగ్రెస్ ఎంపీలు గైర్హాజరవటంపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐయూఎంఎల్ ఎంపీ అబ్దుల్ వాహబ్ మిత్రపక్ష కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. సభలో కాంగ్రెస్ సభ్యులు లేకపోవటం నిరాశ కలిగించిందని అన్నారు. శుక్రవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ కిరోరీ లాల్ మీనా పౌరస్మృతిపై ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ, ఎండీఎంకే, సీపీఎం, ఐయూఎంఎల్ పార్టీలు బిల్లుకు వ్యతిరేకంగా నోటీసులిచ్చాయి. రాజ్యసభ చైర్మన్ ఓటింగ్ నిర్వహించగా మెజారిటీ సభ్యులు ఓకే చెప్పటంతో బిల్లు ప్రవేశపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులు సభలో లేరు. దీనిపైనే కాంగ్రెస్‌పై వాహబ్ విమర్శలు ఎక్కుపెట్టారు. సీపీఎం ఎంపీ జాన్ బ్రిటస్ కూడా.. ‘మిత్రపక్షం ఐయూఎంఎల్‌కు కాంగ్రెస్ మద్దతిచ్చే విధానం ఇదీ!’ అని చురక అంటించారు.