న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ స్టార్ క్యాంపెయినర్, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత ఆర్పీఎన్ సింగ్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కేవలం పిరికిపందలే విరుద్ధమైన భావజాలం ఉన్న పార్టీల్లో చేరతారని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి సుప్రియ శ్రినాటె వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య సిద్ధాంత పోరాటం సాగుతుందని, ఈ పోరులో విజయం సాధించాలంటే మనం ధైర్యంగా అడుగువేయాలని, కేవలం పిరికిపందలే పూర్తి విరుద్ధమైన సిద్ధాంతాలున్న పార్టీల్లో చేరుతారని ఆమె పేర్కొన్నారు.
ఆర్పీఎన్ సింగ్‌ను యూపీ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ జాబితాలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచిన మరుసటి రోజే ఆయన ఆ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖను సింగ్ మంగళవారం ట్విటర్లో ప్రకటించారు. భారత గణతంత్ర దినోత్సవం జరుగుతున్న వేఉళ తన రాజకీయ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నానని ఆయన పేర్కొన్నారు.
ఆర్పీఎన్ సింగ్ కాషాయ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగ్ పార్టీకి రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.