అరుణాచల్ మళ్లీ బీజేపీదే
అరుణాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. ఆదివారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 60 నియోజకవర్గాలకుగానూ 46 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది.
- 46 స్థానాల్లో కమలం పార్టీ ఘన విజయం
- వరుసగా 3వసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం
- కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన కాంగ్రెస్
- మరోసారి ముఖ్యమంత్రిగా పెమా ఖండూ?
ఈటానగర్/ముంబై, జూన్ 2: అరుణాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. ఆదివారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 60 నియోజకవర్గాలకుగానూ 46 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. పోలింగ్‌కు ముందే 10 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నికతో విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన 50 నియోజకవర్గాల్లో 36 స్థానాల్లో కమలం పార్టీ గెలిచిందని కౌంటింగ్ తర్వాత ఈసీ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా కేవలం ఒక్క స్థానానికి పరిమితమైంది. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)-5, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)-3, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్(పీపీఏ)-2 స్థానాల చొప్పున గెలుచుకోగా, స్వతంత్రులు మూడు చోట్ల విజయం సాధించారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీతో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టనున్నది. తాజా అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా గవర్నర్ కేటీ పర్నాయక్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశారు. సీఎం పెమాఖండూ, మంత్రివర్గం రాజీనామాను ఆయన ఆమోదించారు.
ప్రముఖ బీజేపీ నేతల ఓటమి
బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, ఆ పార్టీ లోని కొందరు ప్రముఖ నేతలు ఎన్నికల్లో ఓడిపోయారు. యఛులి నియోజకవర్గంలో విద్యా శాఖ మంత్రి తబ తేదిర్ ఎన్సీపీ(అజిత్ పవార్) అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. మరో ప్రముఖ నేత, సీఎం పెమాఖండూకు సన్నిహితుడిగా భావించే న్యామర్ కర్బాక్ లిరోమోబా స్థానం నుంచి పరాజయం పాలయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యే కుంసి, రెండుసార్లు ఎమ్మెల్యే కైలింగ్ మొయోంగ్ కూడా ఈసారి ఓటమి చవిచూశారు. మరోవైపు పెమా ఖండూతో వ్యక్తిగత శత్రుత్వం ఉండే మాజీ హోంమంత్రి కుమార్ వాయ్ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒకే ఒక్క అభ్యర్థిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 2019లో ఓడిన ఎన్పీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన తాంగ్వాంగ్ వాంగమ్ ఈసారి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు.
జంపింగ్‌లతో సీఎం స్థానం పదిలం
రాష్ట్రంలో ఏకగ్రీవమైన 10 మంది బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో సీఎం పెమా ఖండూ కూడా ఉన్నారు. ఈయనే రాష్ట్ర సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. క్రీడా ప్రేమికుడు, సంగీత ప్రియుడు అయిన పెమాఖండూ 2016లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు దారి తీసిన రాజ్యాంగ సంక్షోభం తర్వాత కీలక నేతగా ఎదిగారు. తన వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో ఈశాన్య రాష్ట్రంలో బీజేపీని తొలిసారిగా అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ నుంచి పీపీఏలో చేరిన ఆయన.. ఆ తర్వాత 2016లో మెజార్టీ పీపీఏ ఎమ్మెల్యేలతో బీజేపీ తీర్థం పుచ్చుకొని, సీఎంగా కొనసాగారు.
ప్రజలకు ధన్యవాదాలు: మోదీ
అరుణాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. బీజేపీపై విశ్వాసం ఉంచినందుకు ఆయన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. మరోవైపు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మూడు స్థానాల్లో జయకేతనం ఎగురవేయడంపై ఆ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ హర్షం వ్యక్తం చేశారు.
మసకబారిన కాంగ్రెస్ ప్రభ
రాష్ట్రంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రభ పూర్తిగా మసకబారింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన ఆ పార్టీ.. ఈసారి మరింత దిగజారి కేవలం ఒక్క స్థానంలోనే విజయం సాధించి ఘోర పరాభవం మూటగట్టుకొన్నది. అరుణాచల్‌లో తన ఉనికి కాపాడుకొనేందుకు హస్తం పార్టీ నానాపాట్లు పడుతున్నది. పోటీ చేసేందుకు ఆ పార్టీకి కనీసం అభ్యర్థులే లేని పరిస్థితి నెలకొన్నది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 19 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టింది.

2019 ఎన్నికల ఫలితాలు
బీజేపీ- 41,జేడీయూ-7, ఎన్పీపీ-5,కాంగ్రెస్-4,పీపీఏ-1, స్వతంత్రులు-2
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

