న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీ) నియామకానికి సంబంధించిన 2023 చట్టంపై వచ్చిన సవాళ్లను విస్తృత ధర్మాసనానికి నివేదించాలా వద్దా అనే విషయమై సెప్టెంబర్ 23న ఇచ్చిన తన భిన్న తీర్పును ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన దరఖాస్తును పరిశీలించడానికి సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతో కూడిన ద్విసభ్య మూర్తుల ధర్మాసనం అటువంటి నివేదన అవసరమా కాదా అనే అంశంపై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదని జస్టిస్ దత్తా అభిప్రాయపడగా ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం దీనిని పరిశీలించాలని జస్టిస్ శర్మ మొగ్గు చూపారు. ఈ భిన్న తీర్పుల నేపథ్యంలోనే బుధవారం సీజేఐ సూర్యకాంత్ ఎదుట రీకాల్(ఉపసంహరణ) దరఖాస్తు ప్రస్తావనకు వచ్చింది. ఆ దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే ముందు న్యాయస్థానం దానిని పరిశీలిస్తుందని సీజేఐ సూర్యకాంత్ అన్నారు.