భోపాల్: జవనరి ఒకటో తేదీ నుంచి అదృశ్యమైన ఇండిపెండెంట్ జర్నలిస్టు(Chhattisgarh Journalist) ముకేశ్ చంద్రాకర్ మృతదేహాన్ని చత్తీస్‌ఘడ్‌లోని సెప్టిక్ ట్యాంక్‌లో గుర్తించారు. బీజాపూర్‌లోని చాతన్పారా బస్తీ లో ఆ జర్నలిస్టు బాడీని వెలికితీశారు. ముకేశ్ చంద్రాకర్.. ఎన్డీటీవీకి కాంట్రిబ్యూటింగ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. కాంక్రీట్‌తో సీలింగ్ చేసిన సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని గుర్తించినట్లు బీజాపూర్ పోలీసులు వెల్లడించారు. అతని శరీరం వాచిపోయింది. తల, వెన్నుకు పలు చోట్ల గాయాలు అయ్యాయి. దుస్తుల ద్వారా అతన్ని గుర్తించారు. ముకేశ్ మొబైల్ లొకేషన్ ఆధారంగా.. అతను చివరి సారి సురేశ్ చంద్రాకర్ కాంట్రాక్టర్‌తో మాట్లాడినట్లు పసికట్టారు. సురేశ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ముకేశ్ రాసిన కథనాలకు అతని మరణం లింకైందా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. దోషుల్ని త్వరలో పట్టుకోనున్నట్లు ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. బస్తర్ జంక్షన్ అన్న పేరుతో ముకేశ్ ఓ యూట్యూబ్ చానల్‌ను నడిపిస్తున్నాడు. దానికి 1.59 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. బస్తర్ ప్రాంతంపై అతను పూర్తి ఫోకస్‌తో వీడియోలు చేసేవాడు. 2021లో మావోలు కిడ్నాప్ చేసిన సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను విడిపించడంలో ముకేశ్ కీలక పాత్ర పోషించాడు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు హైదరాబాద్‌లో ఓ కాంట్రాక్టర్‌ను అరెస్టు చేశారు.