Bihar | భారీ కేటాయింపులు.. కేంద్ర బడ్జెట్లో బీహార్‌పై బీజేపీ సర్కారు వరాల జల్లు
కేంద్ర బడ్జెట్లో బీహార్ రాష్ట్రంపై బీజేపీ సర్కారు వరాల జల్లు కురిపించింది. బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ ఎంపీల మద్దతుపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ర్టానికి నిధుల వరద పారించింది. తెలంగాణ సహా అనేక రాష్ర్టాల పేర్ల ప్రస్తావన కూడా లేని బడ్జెట్లో బీహార్‌కు మాత్రం కేటాయింపుల్లో కేంద్రం ప్రాధాన్యతను ఇచ్చింది.
- రహదారులకు రూ.26,000 కోట్లు
- రూ.21,400 కోట్లతో పవర్‌ప్లాంట్
- వరద నివారణకు 11,500 కోట్లు
- గయలో ఇండస్ట్రియల్ కారిడార్
- పర్యాటక కేంద్రంగా నలంద ప్రాంతం
- కొత్త ఎయిర్‌పోర్టులు, వైద్యకాలేజీలు
- బీహార్ రాష్ట్ర బడ్జెట్‌ను తలపించేలా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు
Bihar | న్యూఢిల్లీ, జూలై 23: కేంద్ర బడ్జెట్లో బీహార్ రాష్ట్రంపై బీజేపీ సర్కారు వరాల జల్లు కురిపించింది. బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ ఎంపీల మద్దతుపై ఆధారపడి నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ర్టానికి నిధుల వరద పారించింది. తెలంగాణ సహా అనేక రాష్ర్టాల పేర్ల ప్రస్తావన కూడా లేని బడ్జెట్లో బీహార్‌కు మాత్రం కేటాయింపుల్లో కేంద్రం ప్రాధాన్యతను ఇచ్చింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ రాష్ర్టానికి అనేక ప్రాజెక్టులు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తన రాష్ర్టానికి భారీగా నిధులు తీసుకురావడంలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్ విజయవంతమయ్యారు.
రోడ్లకు రూ.26,000 కోట్లు
బీహార్‌లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. పట్నా – పుర్ణియా, బక్సర్ – భాగల్పూర్ జాతీయ రహదారులు, బోధ్‌గయా – రాజ్‌గిర్ – వైశాలి – దర్భంగ ఎక్స్‌ప్రెస్‌వే, బక్సర్ వద్ద గంగానదిపై కొత్తగా రెండు లేన్ల వంతెన నిర్మాణం వంటి పనులకు బడ్జెట్లో ఏకంగా రూ.26,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
21,400 కోట్లతో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం
బీహార్‌లో వరద నివారణ పనుల కోసం రూ.11,500 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిధులతో బ్యారేజీలు, నదుల్లో కాలుష్య నివారణ పనులు, నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టనుంది. రాష్ట్రంలో పిర్పైంటిలో 2400 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం నిర్మాణానికి రూ.21,400 కోట్లు కేటాయించారు.
ప్రపంచ స్థాయికి విష్ణుపాద్, మహాబోధి ఆలయాలు
బీహార్‌లోని విష్ణుపాద్, మహాబోధి ఆలయాలను ప్రపంచ స్థాయి తీర్థయాత్ర, పర్యాటక గమ్య స్థానాలుగా తీర్చిదిద్దుతామని నిర్మల పేర్కొన్నారు. విష్ణుపాద్ ఆలయం ప్రాచీన హిందూ ఆలయం కాగా, బౌద్ధ మతానికి చెందిన మహాబోధి ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. ఈ రెండు ఆలయాల కారిడార్లను కాశీ విశ్వనాథ్ ఆలయ కారిడార్ తరహాలో అభివృద్ధి చేస్తామని నిర్మల తెలిపారు. ఇవే కాకుండా రాష్ట్రంలో కొత్తగా ఎయిర్‌పోర్టులు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను సైతం కల్పించనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బీహార్ అభివృద్ధికి వివిధ అభివృద్ధి సంస్థల నుంచి ఆర్థిక సహకారాన్ని అందిస్తామని చెప్పారు.
బీహార్ ప్రజలను అవమానించొద్దు: తేజస్వీ
బీహార్‌కు కేటాయింపులపై ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా ఇచ్చే కేటాయింపులనే అసాధారణంగా చూపించి బీహార్ ప్రజలను అవమానించొద్దని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ నుంచి ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గబోమని ఆయన స్పష్టం చేశారు.
సంతోషంగా ఉన్నా: నితీశ్ కుమార్
కేంద్ర బడ్జెట్లో బీహార్‌కు ప్రాధాన్యం ఇవ్వడంపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం బీహార్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ.. ‘మేము బీహార్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. కానీ, సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. అయితే, కేంద్రం నుంచి ఇవాళ మరో మార్గంలో బీహార్‌కు ప్రత్యేక సహకారం అందింది.’ అని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపుల పట్ల తాను సంతోషంగా ఉన్నానని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

