BJP Leader Mets Goa Governor | గోవాలో బీజేపీ నేత విశ్వజిత్ రాణె శనివారం గవర్నర్‌ను కలుసుకున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ వ్యక్తిగతం అని ఓ ఆంగ్ల టీవీ చానెల్‌కు చెప్పారు. తాను బీజేపీలో క్రమశిక్షణ గల సైనికుడ్ని అని అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల తర్వాత గోవా గవర్నర్‌తో విశ్వజిత్ రాణె భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
గోవా నూతన సీఎం పదవికి ఆయన పోటీ పడుతున్నారు. కానీ గవర్నర్‌తో విశ్వజిత్ రాణె సమావేశమైన విషయమై తమకు సమాచారం లేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. గురువారం వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గోవాలో 40 స్థానాల అసెంబ్లీలో బీజేపీ 20 స్థానాల్లో గెలుపొంది ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఒక స్థానం దూరంలో నిలిచింది.
ఓట్ల లెక్కింపులో ప్రారంభంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెనుకబడినా విజయం సాధించారు. తిరిగి ప్రమోద్ సావంత్ సీఎంగా కొనసాగనున్నారని వార్తలొచ్చాయి. దీనిపై మీడియా ప్రశ్నించినప్పుడు విశ్వజిత్ రాణె.. ఇది సున్నితమైన ప్రశ్న అంటూ దీనిపై తనకు సమాచారం లేదని దాటేశారు.