పాట్నా : బీహార్‌కు తమ పార్టీ నుంచి మొదటి ముఖ్యమంత్రి ఎవరవుతారనేది మంగళవారం తేలనుందని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు సోమవారం తెలిపారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇందుకోసం కేంద్ర పరిశీలకుడిగా వస్తారని.. ఆయనే ముఖ్యమంత్రి ఎవరో వెల్లడిస్తారని వారు చెప్పారు. మంగళవారం చివరి క్యాబినెట్ సమావేశం తర్వాత నితీశ్ తన పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతున్నది.
దీంతో బుధవారం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉండొచ్చని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. శివరాజ్ సమక్షంలో తమ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకుంటారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సరయోగి మీడియాకు తెలిపారు. బీసీ లేదా దళితుడు బీజేపీ నుంచి సీఎం అవుతారని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ కూడా పోటీలో ఉన్నారు.