నోయిడా: నోయిడాలో ఓ మహిళపై దాడిచేసిన బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగిపై కేసు నమోదు చేసి వెంటనే అతడిని అరెస్టు చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) డిమాండ్ చేసింది. నోయిడాలోని సెక్టార్-93 బీలోని గ్రాండ్ ఓమాక్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన పార్కులో బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి శుక్రవారం మొక్కలు నాటడానికి పూనుకున్నాడు. పార్కును ఆక్రమించి మొక్కలు నాటడంపై సొసైటీకి చెందిన ఓ మహిళ అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన త్యాగి ఆమెను తిట్టడంతోపాటు నెట్టివేసి దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన ఆమె భర్తను కూడా దుర్భాషలాడాడు.