Maharastra BJLP meet : మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఈ నెల 4న మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకోనుంది. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడే సీఎంగా మహాయుతి కూటమి సర్కారును నడపనున్నారు. మహాయుతి కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, సీఎం ఎంపిక నిర్ణయం బీజేపీదేనని, వారి నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించడంతో.. బీజేపీ నాయకుడే సీఎం కాబోతున్నారనే విషయం స్పష్టమైంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 4న బీజేఎల్పీ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను బీజేపీ హైకమాండ్ నియమించింది. వారి సమక్షంలో వచ్చే గురువారం బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఆ మరుసటి రోజే అంటే డిసెంబర్ 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
దక్షిణ ముంబైలోని అజాద్ మైదాన్‌లో కొత్త సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తదితర బీజేపీ అగ్ర నాయకులంతా హాజరుకానున్నట్టు సమాచారం.