బీహార్‌లో బీజేపీ గెలుపుపై ‘సర్’వత్రా సందేహాలు?!
ఎన్నికల సంఘం (ఈసీ) చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై దేశవ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నాయి. ‘సర్' ప్రక్రియలో భారీగా ఓట్లు తొలగించడం వల్లే తమ పార్టీలు ఓడిపోయాయని అటు తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, ఇటు బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఆరోపించడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.
- ‘సర్’ పూర్తైన ఏడాది తర్వాత కొత్తగా 14 లక్షల ఓటర్లు చేర్పు
- అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్లు ఓటేశారా? లేదా? అన్న దానిపై సందిగ్ధం
- 1.15 కోట్ల ఓట్లు వచ్చిన ప్రతిపక్ష ఆర్జేడీ గెలుచుకొన్నది 25 సీట్లే
- కోటి ఓట్లు వచ్చిన బీజేపీ ఖాతాలో మాత్రం 89 నియోజకవర్గాలు
- కేవలం 10 వేల ఓట్ల్ల తేడాతో ఎన్డీయే కూటమికి 33 సీట్లు
- బీహార్‌లో నిరుడు జరిగిన ‘సర్’ పై మేధావుల అనుమానాలు
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సంఘం (ఈసీ) చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై దేశవ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నాయి. ‘సర్’ ప్రక్రియలో భారీగా ఓట్లు తొలగించడం వల్లే తమ పార్టీలు ఓడిపోయాయని అటు తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, ఇటు బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఆరోపించడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.
ఇప్పుడు ఈ జాబితాలో బీహార్ కూడా చేరినట్టు తెలుస్తోంది. గత ఏడాది జూన్-సెప్టెంబర్ నడుమ బీహార్ రాష్ట్రవ్యాప్తంగా ‘సర్’ప్రక్రియను నిర్వహించారు. ‘సర్’ తుది జాబితాలో 47 లక్షల ఓట్లను తొలగించారు. దీంతో ‘సర్’కు ముందు 7.89 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య.. ఆ తర్వాత 7.42 కోట్లకు చేరింది. అనంతరం నవంబర్‌లో అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది. అయితే, బీహార్‌లో ‘సర్’ పూర్తైన ఏడాది తర్వాత అంటే ఈ నెలలో ఈసీ ఓ ప్రకటన విడుదల చేసింది. బీహార్ ఎలక్టోరల్ రోల్లో కొత్తగా 14 లక్షల మందిని చేరుస్తున్నట్టు ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.56 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. ఇది ఇప్పుడు రాజకీయవర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నది.
ఎన్నికల్లో ఓటేశారా? లేదా??
బీహార్‌లో ఎన్నికలు నిర్వహించి దాదాపు ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు 14 లక్షల మంది కొత్త ఓటర్లను ఈసీ చేర్చడంపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా చేరిన ఓటర్లు ఫామ్-6 (కొత్తగా ఎన్రోల్మెంట్) ద్వారా దరఖాస్తు చేసుకొన్నారా? లేక ఫామ్-8 (మార్పులు-చేర్పులు) ద్వారా దరఖాస్తు చేసుకొన్నారా? అనే విషయాన్ని ఈసీ స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ 14 లక్షల మంది కొత్త ఓటర్లు గత ఎన్నికల్లో ఓటు వేశారా? లేదా? ఒకవేళ, వేస్తే.. అప్పటి ‘సర్’ తుది జాబితాలో వీరిని ఎందుకు చేర్చలేదు? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ, గత ఎన్నికల్లో ఓటుహక్కును ఈ 14 లక్షల మంది వినియోగించుకోనట్లయితే, ‘సర్’ ప్రక్రియ సమయంలోనే వీళ్లు దరఖాస్తులు ఇచ్చినప్పటికీ, వీరి పేర్లను చేర్చకుండా, ఏడాదిపాటు ఎందుకు కాలయాపన చేశారని నిలదీస్తున్నారు. దీనికి ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.
ఫలితాలు కూడా విచిత్రం..
బీహార్‌లోని 243 నియోజకవర్గాలకు గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సుమారు 4.93 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు. అయితే, దాదాపు కోటి ఓట్లతో బీజేపీ 89 సీట్లను గెలుచుకోగా, 1.15 కోట్ల ఓట్లను సాధించిన విపక్ష ఆర్జేడీ మాత్రం 25 స్థానాలకే పరిమితమయ్యింది. ఇక, 96 లక్షల ఓట్లు సాధించిన బీజేపీ మిత్రపక్షం జేడీయూ మాత్రం 85 సీట్లను గెలుచుకోవడం గమనార్హం. అంతేకాదు, కేవలం 10 వేల ఓట్ల తేడాతో బీజేపీ+జేడీయూ కూటమి కలిసి 33 స్థానాలు గెలుచుకోగా, 5 వేల ఓట్ల తేడాతో 13 సీట్లలో ఈ కూటమి విజయాన్ని నమోదు చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ విక్టరీ మార్జిన్ 95 ఓట్ల నుంచి 1300 ఓట్లుగా ఉండటం గమనార్హం. దీంతో బీహార్‌లో జరిగిన ‘సర్’ ప్రక్రియపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

