AI Startup | బెంగళూరు: బెంగళూరు ఐటీ హబ్‌లోని ఓ ఏఐ స్టార్టప్ ఎక్స్ వేదికగా ఇచ్చిన ఉద్యోగ ప్రకటన అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ ఇచ్చిన ఈ ప్రకటనలో, క్రాక్డ్ ఫుల్‌స్టాక్ ఇంజినీర్‌ను నియమించుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. సంవత్సరానికి రూ.40 లక్షల ప్యాకేజీ చెల్లించనున్నట్లు తెలిపారు. బేస్ జీతం సంవత్సరానికి రూ.15-25 లక్షలు, ఈఎస్ఓపీస్ జీతం ఏడాదికి రూ.10-15 లక్షలు అని తెలిపారు.
ఇందిరా నగర్‌లోని తమ కార్యాలయానికి వచ్చి పని చేయాలని, వారానికి ఐదు రోజులు పని దినాలని తెలిపారు. అభ్యర్థులకు 0-2 సంవత్సరాల అనుభవం ఉంటే సరిపోతుందని, ఏ కళాశాలలో చదివారనే దానితో సంబంధం లేదని, రెజ్యూమ్ అక్కర్లేదని పేర్కొన్నారు. వెంటనే ఉద్యోగంలో చేరవచ్చునని తెలిపారు. దీనిని అనేకమంది తమ బంధుమిత్రులకు ట్యాగ్ చేశారు.
దీంతో ఉద్యోగార్థుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. కొందరు నెటిజన్లు ఈ కంపెనీ ఎంత కాలం ఉంటుందోనని అనుమానం వ్యక్తం చేశారు. కంపెనీలో నియామకాల కోసం ఈ విధానాన్నే ఎల్లప్పుడూ అనుసరిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సారి మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వైరల్ అయిందో తెలియడం లేదన్నారు. తమ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది టైర్-1 కళాశాలలో చదివినవారు కాదని, వారు తెలివైనవారు, చురుకైనవారు అని వివరించారు.