ఓ యువతికి ఊహించని ఘటన ఎదురైంది. ఓ యువకుడు నడిరోడ్డుపై అడ్రస్ పేరుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. యువతి ఛాతీ పైన నొక్కాడు. ఈ హీనమైన ఘటన అసోంలోని గువహటిలో శుక్రవారం చోటు చేసుకుంది.
అసోంకు చెందిన భావన కశ్యప్ శుక్రవారం సాయంత్రం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. స్కూటీపై వచ్చిన ఓ యువకుడు ఆమె ముందు ఆపాడు. సినాకి పాత్ ఎక్కడ అని ఆమెను అడిగాడు. తనకు తెలియదు.. మరెవరైననా అడిగండి? అని ఆ వాహనదారుడికి యువతి తెలిపింది. అవేమీ పట్టించుకోకుండా మళ్లీ కొంచెం ముందుకెళ్లి.. వెనక్కి వచ్చాడు. మళ్లీ అడ్రస్ అడిగి.. అసభ్యకరంగా ప్రవర్తించాడు. సెకన్ల కాలంలో యువతి ఛాతీని గట్టిగా నొక్కాడు. ఏం జరుగుతుందో తెలియక ఆమె ఆందోళనకు గురైంది. కానీ ఏ మాత్రం భయపడకుండా.. ఆ కామాంధుడిని గట్టిగా పట్టుకుంది. స్కూటీని ముందుకు వెళ్లనివ్వకుండా.. తన శక్తినంతా ఉపయోగించి వెనుక టైర్‌ను గట్టిగా పట్టుకోవడంతో అది ముందుకు వెళ్లలేకపోయింది. మొత్తానికి ఆ స్కూటీని పక్కనే ఉన్న మురికి కాల్వలోకి తోసేసింది బాధిత యువతి.
ఈ సందర్భంగా సదరు యువతి భావన కశ్యప్ మాట్లాడుతూ.. ఇప్పుడు అతన్ని తాను వదిలేస్తే ఇలానే మరికొంత మంది మహిళలను వేధించే అవకాశం ఉందన్నారు. అసోం రాష్ట్రం మహిళల భద్రతకు నెలవైన ప్రాంతం అని అనుకునే వాళ్లం. ఉత్తర భారత్‌లోని రాష్ట్రాల్లో హీనమైన నేరాలు జరుగుతాయి. అలాంటి ఘటనలు అసోంలో చోటు చేసుకోకపోవడంతో ప్రశాంతంగా ఉంటున్నామని అనుకున్నాం. కానీ ఇలాంటి యువకుల వల్ల మహిళలకు భద్రత లేకుండా పోయే అవకాశం ఉందన్నారు.
మొత్తానికి ఈ ఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు చేరుకుని ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తక్షణమే స్పందించిన పోలీసులకు భావన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.