New Criminal Laws | బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు.. నేటి నుంచి అమల్లోకి కొత్త న్యాయ చట్టాలు
బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు జూలై 1(సోమవారం) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
- ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెక్స్ యాక్ట్‌కు చెల్లు
- ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనూ సమన్లు జారీ
- హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లకు తప్పనిసరిగా వీడియోగ్రఫీ
- కేసు విచారణలో జాప్యం నివారణకు కోర్టులో రెండు వాయిదాలకే అవకాశం
- విచారణ పూర్తయిన తర్వాత 45 రోజుల్లోగా తీర్పు
- కొత్త చట్టాల్లో కీలక నిబంధనలు
New Criminal Laws | న్యూఢిల్లీ, జూన్ 30: బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు జూలై 1(సోమవారం) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్) అమల్లోకి వస్తాయి.
భారతదేశ నేర న్యాయ వ్యవస్థ, నేరాల దర్యాప్తు, విచారణ ప్రక్రియలో ఈ కొత్త చట్టాలు వేగం తీసుకురానున్నాయని, ఒక ఆధునిక న్యాయ వ్యవస్థను అందించనున్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కొత్త చట్టాల్లో జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు, ఎంఎస్ఎం వంటి ఎలక్ట్రానిక్ మోడ్ విధానంలో సమన్లు జారీ, అతి క్రూరమైన నేరాల క్రైమ్ సీన్లను వీడియోగ్రఫీ చేయడం వంటి నిబంధనలు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా కాకుండా కొత్త చట్టాలు ప్రజలకు న్యాయం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గతంలో చెప్పారు.
కొత్త చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..
- మైనర్‌పై సామూహిక లైంగిక దాడికి పాల్పడితే మరణ శిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన. పిల్లలను అమ్మడం లేదా కొనడం క్రూరమైన నేరం.
- జీరో ఎఫ్ఐఆర్ విధానంతో ఒక వ్యక్తి పోలీసుస్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా ఏదైనా ఘటనను రిపోర్టు చేయడంలో లేదా చట్టపరమైన చర్యలు ప్రారంభించడంలో ఆలస్యాన్ని నివారించొచ్చు.
- ఏదైనా ఘటనను ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు వీలుంది. పోలీసుస్టేషన్‌కు వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదు. దీని ద్వారా వేగవంతమైన ఫిర్యాదు ద్వారా అదే వేగంతో పోలీసులు తగిన చర్యలు తీసుకొనే వెసులుబాటు ఉంటుంది.
- ఎలక్ట్రానిక్ రూపంలో సమన్లు జారీ చేయవచ్చు. దీని ద్వారా చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు పేపర్ వర్క్‌ను తగ్గిస్తుంది.
- లైంగిక దాడి బాధితురాలి స్టేట్మెంట్ను ఆమె సంరక్షకురాలు లేదా బంధువు సమక్షంలోనే ఒక మహిళా పోలీసు అధికారి రికార్డు చేయాలి. వారం రోజుల్లోగా వైద్య నివేదిక రావాలి.
- మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి.. బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేనిపక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలి.
- ఏదైనా కేసులో నిందితులు, బాధితులు 14 రోజుల్లోగా ఎఫ్ఐఆర్, పోలీసు రిపోర్టు, చార్జిషీట్, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్ల కాపీలను పొందవచ్చు.
- క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన తర్వాత 45 రోజుల్లోగా తీర్పు ఇవ్వాలి. విచారణ ప్రారంభమైన 60 రోజుల్లోగా అభియోగాలు నమోదు చేయాలి.
- కేసు విచారణలో అనవసర జాప్యాలను నివారించేందుకు, సకాలంలో న్యాయం అందించేందుకు న్యాయస్థానాలు కూడా గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి.
- సాక్షుల భద్రతను, వారి సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి.
- రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే పదాన్ని చేర్చారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలను నిర్వచించారు. ఏదైనా కేసులో చేపట్టే తనిఖీలు, స్వాధీనాలను వీడియో రికార్డింగ్ చేయడం తప్పనిసరి.
- వివాహం పేరుతో మోసం చేయడం, మైనర్లపై సామూహిక లైంగిక దాడికి పాల్పడటం, మూక హత్యలు, చైన్ దొంగతనాలు వంటి ఘటనలకు పరిష్కరించేందుకు ప్రత్యేక నిబంధనలు.
- అరెస్టు సందర్భాల్లో బాధితులు తమ పరిస్థితి గురించి సమాచారాన్ని బంధువులకు లేదా స్నేహితులకు తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా అరెస్టయిన వ్యక్తి తక్షణ సాయం పొందే వీలుంటుంది.
- అరెస్టు వివరాలను ప్రముఖంగా పోలీసుస్టేషన్లు, జిల్లా కేంద్రాల్లో డిస్ప్లే చేయాలి. దీని ద్వారా అరెస్టయిన వ్యక్తి బంధువులు, స్నేహితులు ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
- దర్యాప్తును బలోపేతం చేయడంలో భాగంగా తీవ్రమైన నేరాల విషయంలో ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరిగా ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించాలి.
- మహిళలపై నేరాల కేసుల్లో బాధితులు తమ కేసు పురోగతిపై 90 రోజుల్లోపు ఎప్పటికప్పుడు సమాచారం పొందేందుకు అర్హులు.
- మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో బాధితులకు అన్ని దవాఖానల్లో ఉచితంగా ప్రథమ చికిత్స లేదా వైద్య చికిత్స.
- మరింత భద్రత కల్పించడం, దర్యాప్తులో పారదర్శకతను అమలు చేయడంలో భాగంగా లైంగిక దాడి కేసుల్లో బాధితురాలి స్టేట్మెంట్ను ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.
- మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, 15 ఏండ్లలోపు పిల్లలు, 60 ఏండ్ల పైబడిన వృద్ధులు పోలీసుస్టేషన్‌కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వారు నివాసం ఉంటున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

