త్వరలోనే బయటకొస్తా!
తనను ఎక్కువ కాలం బంధించే జైలే లేదని, త్వరలో తప్పకుండా బయటకు వస్తానని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన భార్య సునీత శనివారం ఒక వీడియోలో చదివి వినిపించారు.
- నన్ను ఎక్కువ కాలం బంధించే జైలు లేదు
- అరెస్టు ఊహించిందే.. భవిష్యత్త్తులోనూ సవాళ్లే
- దేశంలో ‘దుష్ట’ శక్తులను గుర్తించి ఓడించాలి
- బీజేపీ వాళ్లు మన సోదర సోదరీమణులు.. నన్ను అరెస్ట్ చేశారని వారిపై ద్వేషం చూపొద్దు
- కేజ్రీవాల్ సందేశాన్ని వినిపించిన సునీత
- విచారణ పారదర్శకంగా జరగాలన్న జర్మనీ
న్యూఢిల్లీ, మార్చి 23: తనను ఎక్కువ కాలం బంధించే జైలే లేదని, త్వరలో తప్పకుండా బయటకు వస్తానని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన భార్య సునీత శనివారం ఒక వీడియోలో చదివి వినిపించారు. తన అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొన్న కేజ్రీవాల్.. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చేందుకు త్వరలో తాను బయటకు వస్తానని పేర్కొన్నారు. తాను లోపల ఉన్నా, బయట ఉన్నా.. తన జీవితంలోని ప్రతిక్షణం దేశ సేవకే అంకితమని భావోద్వేగ సందేశం ఇచ్చారు. ‘మీ సోదరుడు, కొడుకుని సుదీర్ఘకాలం బంధించే జైలే లేదు. త్వరలో నేను బయటకు వస్తాను, హామీలను పూర్తిచేస్తాను’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను పోరాటాలు చేయడానికే పుట్టానని, భవిష్యత్తులో కూడా పెద్ద సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకే తన అరెస్టు అశ్చర్యం కలిగించలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
దేశాభివృద్ధికి అందరం ఏకం కావాలి
ప్రజలందరూ కలిసి భారతదేశాన్ని ప్రపంచంలోనే బలమైన, గొప్పదైన అగ్ర దేశంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉన్నదని కేజ్రీవాల్ నొక్కిచెప్పారు. ‘దేశాన్ని బలహీనపరిచే శక్తులు దేశం లోపల బయట ఎన్నో ఉన్నాయి. మనం వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆ శక్తులను గుర్తించి ఓడించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘దేశంలో ఎందరో దేశభక్తులు, శక్తులు ఉన్నాయి. భారతదేశం ముందుకు సాగేలా చేయాలి. ఈ శక్తులన్నీ ఐక్యమై బలోపేతం కావాలి’ అని కేజ్రీవాల్ తన సందేశంలో ఆకాంక్షించారు. తాను కస్టడీలో ఉన్నానన్న ఆందోళనతో ప్రజా, సామాజిక సేవ చేయడం ఆపోద్దని ఆయన ఆప్ కార్యకర్తలను కోరారు. ఇదే సమయంలో బీజేపీ నేతలను తన సోదర సోదరీమణులుగా సంబోధించిన కేజ్రీవాల్.. తన అరెస్టుపై వారిపై ద్వేషం చూపొద్దని సూచించారు.
జర్మనీ స్పందనను ఖండించిన భారత్
కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ స్పందించింది. ‘భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. న్యాయవ్యవస్థ స్వతంత్రత, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకు సంబంధించిన ప్రమాణాలు ఈ కేసులో కూడా వర్తిస్తాయని ఆశిస్తున్నాం. ఇతరులలానే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌పై పారదర్శక, నిష్పక్షపాత విచారణకు అర్హులు. అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన అవకాశాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చు. తాను ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకోవడం అనేది న్యాయప్రకారంగా చాలా ముఖ్యమైన అంశం. దీన్ని ఆయనకు కూడా వర్తింపజేయాలి’ అభిప్రాయపడ్డారు. కాగా, జర్మనీ విదేశాంగ శాఖ స్పందనపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జర్మనీ రాయబారి జార్జ్ ఎంజ్వీలర్కు విదేశాంగ శాఖ సమన్లు ఇచ్చింది. భారత అంతర్గత వ్యవహారాలపై జోక్యం చేసుకోవడంపై నిరసన తెలియజేశామని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
కస్టడీపై ఢిల్లీ హైకోర్టులో సవాల్.. వచ్చే వారం విచారణ
ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ శనివారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పిటిషన్‌పై అత్యవసరంగా ఈ నెల 24(ఆదివారం) విచారణ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. తన అరెస్టు, రిమాండ్ రెండూ అక్రమమని, కస్టడీ నుంచి వెంటనే విడుదల కావడానికి తాను అర్హుడనని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను ఈ నెల 27న విచారణ చేస్తామని కోర్టు బదులిచ్చింది. మరోవైపు కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో ఢిల్లీ ఏసీపీ ఏకే సింగ్ తనతో దురుసుగా ప్రవర్తించారని కేజ్రీవాల్ ఆరోపించారు. గతంలో మనీశ్ సిసోడియా పట్ల కూడా కోర్టు ప్రాంగణంలో ఆయన ఇదే విధంగా వ్యవహరించాడని, తన భద్రతా దృష్ట్యా ఆ అధికారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు.
ఎన్నికల వేళ ఆప్ ఆఫీసుకు తాళమెలా వేస్తారు?
లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరాచకంగా ప్రవర్తిస్తున్నదని ఢిల్లీ ఆప్ మంత్రులు ఆతిశీ, సౌరవ్ భరద్వాజ్ మండిపడ్డారు. ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడానికి వ్యతిరేకంగా శుక్రవారం ఆప్ కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీ డీడీయూ మార్గ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయాన్ని అన్నివైపులా నుంచి మూసివేయించిందని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి ఆతిశీ శనివారం ఎక్స్ పోస్టులో వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కార్యాలయాన్ని మూసివేయడం ద్వారా ఒక జాతీయ పార్టీ కార్యకలాపాలను ఏ విధంగా అడ్డుకొంటారని ఆమె ప్రశ్నించారు.
రాజీనామా చేయాలని ఏ చట్టం చెప్పలేదు
ఢిల్లీ ప్రభుత్వం చట్టప్రకారమే నడుస్తుందని, రాజకీయ ప్రతీకారం వల్ల జైలుకు వెళ్లిన సీఎం రాజీనామా చేయాలని ఏ చట్టం చెప్పడం లేదని భగవంత్ మాన్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో మాత్రమే ఉన్నారని, ఆయనను దోషిగా తేల్చలేదని పేర్కొన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనే విషయంపై అన్ని అంతర్జాతీయ పత్రికలు తమ మొదటి పేజీల్లో రాశాయని తెలిపారు. ‘మన దేశంలో ప్రతిపక్ష నేతలను జైల్లో పెడుతున్న వాళ్లు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం గురించి మాట్లాడుతారు’ అని ప్రధాని మోదీ, బీజేపీ నేతలను ఉద్దేశించి మాన్ వ్యాఖ్యానించారు.
కేజ్రీవాల్ త్వరలో విడుదల అవుతారు: మాన్
ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ త్వరలో విడుదల అవుతారని, దేశంలో విప్లవం తీసుకొస్తారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు అమరవీరుల దినం సందర్భంగా మాన్తోపాటు పలువురు ఢిల్లీ మంత్రులు శనివారం స్థానిక షాహీదీ పార్క్‌లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాన్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశంలో నియంతృత్వాన్ని నెలకొల్పాలని చూస్తున్నదని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

