న్యూఢిల్లీ: నిద్రలేమి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని మనందరికీ తెలుసు. కంటినిండా కునుకు లేకపోతే మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని అనేక రెట్లు పెంచుతుంది. అంతేకాదు నిద్రలేమితో సతమతమవుతున్న వారు ఆస్తమా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారని, వీరు మంచి నిద్రవేళలు పాటిస్తే.. ఆస్తమా వ్యాధి ప్రభావాన్ని తగ్గించొచ్చని కూడా తెలిపింది. చైనాలోని షాండాంగ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం 38-73 ఏండ్ల మధ్యవున్న 4,55,405మంది నిద్రవేళలపై పరిశోధన జరిపింది. నిద్రలేమితో బాధపడుతున్న వారిలో వాపు సంబంధ సమస్యలుంటే, వారు ఆస్తమా బారినపడే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువని జర్నల్ పేర్కొంది.