Bus in river : ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రయాణికుల బస్సు (Indian passenger bus) అదుపుతప్పి నేపాల్ (Nepal) దేశం తానాహున్ జిల్లాలోని మార్స్యాంగ్డి నదిలో పడిపోయింది. అనంతరం ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. ఈ ప్రమాదంలో 11 మంది యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గల్లంతయ్యారు. ప్రమాదానికి గురైన బస్సులో మొత్తం 40 మంది యాత్రికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అధికారులు ఘటనా ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. 11 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలువురు తప్పించుకునే ప్రయత్నంలో నదిలో కొట్టుకునిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
‘భారత్‌కు చెందిన యూపీ ఎఫ్టీ 7623 (UP FT 7623) నెంబర్‌గల బస్సు జిల్లాలోని మార్స్యాంగ్డి నదిలోకి దూసుకుపోయింది. అనంతరం నది ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని నేపాల్‌లోని తానాహున్ జిల్లాకు చెందిన డీఎస్పీ దీప్‌కుమార్ రాయ తెలిపారు. బస్సు పొఖారా నుంచి ఖాట్మండుకు వస్తుండగా ప్రమాదానికి గురైందని అధికారులు చెప్పారు.