న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో కొన్ని రోజుల క్రితం ఓ ప్రయాణికుడిని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్(Air India Express Pilot) కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ పైలట్‌ను అరెస్టు చేసి, ఆ తర్వాత రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ కేసును ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పైలట్‌ను వీరేంద్ర సెజ్వాల్గా గుర్తించారు. ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కెప్టెన్ వీరేంద్రను అదుపులోకి తీసుకున్నారు. అయితే అతనిపై నమోదు అయిన సెక్షన్లు బెయిల్‌కు అనుకూలమైనవని, ఫార్మాల్టీలు ముగిసిన తర్వాత ఆ పైలట్‌ను రిలీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. సాక్ష్యులు, సాక్షాధారాల ఆధారంగా ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.
దాడి జరిగిన ఘటనకు చెందిన సీన్‌ను రీకన్స్ట్రక్షన్ చేసే పనిలో ఢిల్లీలో పోలీసులు నిమగ్నమయ్యారు. టర్మినల్ 1 వద్ద ఉన్న పలు కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అంకిత్ దీవాన్‌తో పాటు మరికొంత మంది వాంగ్మూలం తీసుకున్నారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత నిందితుడికి సమన్లు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసినట్లు చెప్పారు. పైలట్ వీరేంద్ర సెజ్వాల్ దర్యాప్తుకు సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 19వ తేదీన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టర్మినల్ 1 వద్ద సెక్యూర్టీ చెక్ జరుగుతున్న సమయంలో అకింత్, పైలట్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అంకిత్‌పై పైలట్ దుర్భాషలాడుతూ అటాక్ చేశాడు.