గురుగ్రామ్: సాధారణంగా పోలీసులు ఇంట్లో అడుగుపెట్టారంటేనే ఆ కుటుంబం గుండెల్లో దడ పుడుతుంది. ఏ ఉపద్రవం ముంచుకొచ్చిందోనని గజగజ వణికిపోతారు. కానీ హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ కుటుంబం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే.. ఆ నిందితుడి కుటుంబసభ్యులు నానా హంగామా చేశారు.
పోలీసులను వెంబడిస్తూ పోలీస్ స్టేషన్ దాకా వెళ్లారు. ఆఖరికి పోలీస్ స్టేషన్ గేటు దగ్గర నిందితుడి ఇద్దరు సోదరిలు, తల్లి పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఓ హెడ్ కానిస్టేబుల్ యూనిఫామ్‌ను చింపేశారు. గొడవను చూసి మిగతా పోలీసులు బయటికి వచ్చే సరికి నిందితుడి సోదరుడు పారిపోయాడు. అయితే నిందితుడితోపాటు అతని ఇద్దరు సోదరిలను, తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పరారీలో ఉన్న నిందితుడి సోదరుడి కోసం గాలిస్తున్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న కరన్ సందర్శిని విచారించేందుకు గత బుధవారం మధ్యాహ్నం పోలీసులు వెళ్లారు. నేరంలో నిందితుడి పాత్ర నిర్ధారణ కావడంతో అరెస్టు చేసి న్యూ కాలనీ పోలీస్‌స్టేషన్‌కు తరలించే సమయంలో ఘటన చోటుచేసుకుంది. ఘటన వివరాలను ఎస్సై కరంబీర్ మీడియాకు వెల్లడించారు.