శనివారం 29 ఫిబ్రవరి 2020
ఢిల్లీలో ఆప్‌ ఘన విజయం

ఢిల్లీలో ఆప్‌ ఘన విజయం

Feb 11, 2020 , 14:58:29
PRINT
ఢిల్లీలో ఆప్‌ ఘన విజయం

న్యూఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో ముచ్చటగా మూడోసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ పాగా వేసింది. ఢిల్లీ పీఠంపై మరోసారి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆసీనులు కానున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలందించిన కేజ్రీవాల్‌.. మూడో సారి కూడా సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి ఆప్‌ దూసుకెళ్లింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని ఆప్‌ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 36 కాగా, ఆప్‌ 60 స్థానాలకు పైగా విజయం సాధించింది. 2015 ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్‌ 67 స్థానాలను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కూడా 2015 ఫలితాలే పునరావృతమయ్యాయి.

ఇక ఈ గెలుపులో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కీలకపాత్ర పోషించారు. ఆప్‌ మేనిఫెస్టో రూపకల్పనలో ప్రశాంత్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొత్తానికి కిషోర్‌ వ్యూహలు ఆప్‌ గెలుపుకు కీలకంగా పని చేశాయి. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్‌ కేజ్రీవాల్‌ 13,508 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పట్‌పడ్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మనీష్‌ సిసోడియా విజయం సాధించారు.

ఆప్‌ గెలుపుతో ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు మిన్నంటాయి. స్వీట్లు పంచుకుంటూ ఆప్‌ శ్రేణులు ఆనందంలో మునిగితేలారు. కేజ్రీవాల్‌ చేసిన అభివృద్ధికి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఢిల్లీ అభివృద్ధికి కేజ్రీవాల్‌ అహర్నిశలు కష్టపడ్డారని.. దానికనుగుణంగా ఫలితం దక్కిందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ గెలుపు తమకు మరింత బాధ్యతను పెంచాయని పేర్కొన్న ఆప్‌ నాయకులు.. ఢిల్లీని మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. 


logo