Drunk Man : ఓ తాగుబోతు పూటుగా మద్యం సేవించి మురుగు కాలువలోకి వెళ్లాడు. కాలువలో మురుగు నీటి ప్రవాహం నెట్టేయడంతో ఓ 30 అడుగుల డ్రైనేజీ పైపులో ఇరుక్కుపోయాడు. రోడ్డు కింద మురుగునీటి కోసం ఏర్పాటు చేసిన ఆ డ్రైనేజీ పైపు రెండు చివరలు తెరుచుకునే ఉన్నప్పటికీ.. తాగుబోతును బయటికి తీసే సరికి పోలీసులకు తలప్రాణం తోకకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన ఓ వ్యక్తిగా పూటుగా మద్యం సేవించి అదే మత్తులో మురుగు కాలువలోకి వెళ్లాడు. అయితే డ్రైనేజీ ప్రవాహంలో నిలబడలేక మెల్లగా పైపులోకి జారిపోయాడు. అనంతరం ఎలా బయటికి రావాలో అర్థంకాక అరవడం మొదలుపెట్టాడు. అతడి అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన ప్రాంతానికి చేరుకున్నారు.
స్థానికులతో కలిసి అతడిని బయటికి తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. డ్రైనేజీకి పైనుంచి పైపు వైపు వచ్చే వరదకు అడ్డుకట్టవేశారు. ఆ తర్వాత డ్రైనేజీ పైపు మరో కొన నుంచి అందులో ఇరుక్కున్న చెత్తను తొలగించి మురుగు నీరు అవలీలగా బయటకు వెళ్లేలా చేశారు. ఎట్టేకేలకు తాగుబోతును బయటికి తీసుకొచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన కనిపించింది.