ఆగ్రా: ఒక కారులో పెద్దమొత్తంలో డబ్బు తరలిస్తున్నారు. మరో కారు దానిని వెంబడించింది. ముందుకు దూసుకెళ్లిన దుండగులు ఆ కారుకు అడ్డంగా ఆపారు. డబ్బు ఉన్న కారు వద్దకు వెళ్లి తుపాకీలు చూపించి అందులో ఉన్న డబ్బు ఎత్తుకెళ్లారు (Robbery). ఇదేదో సినిమాలో చూసినట్లు గుర్తుకు వస్తుంది కదా.. అవును అచ్చం అలాగే సినీ ఫక్కీలో కారులో ఉన్న 200 కిలోల వెండి, రూ.లక్ష ఎత్తుకెళ్లిన ఘటన ఆగ్రాలో జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని గోవాలో.. ఓ కొరియర్ కంపెనీ సిబ్బంది తమ కారులో వెండి, రూ.లక్ష తరలిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.45 సమయంలో ఆగ్రా-గ్వాలియర్ హైవేపై వారి కారును ఓ హోండా అమేజ్ కారు వోవర్టేక్ చేసి వెళ్లింది. అనంతరం కొరియర్ కంపెనీ కారుకు అడ్డంగా ఆగింది. అందులో నుంచి దిగిన దుండగులు కొరియర్ సిబ్బందిని తుపాకులతో బెదిరించి.. అందులో ఉన్న 200 కిలోల వెండి, రూ.లక్ష ఎత్తుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రా ఏడీజీ రాజీవ్ కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీలైనంత తొందరగా దుండగులను పట్టుకుంటామని చెప్పారు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినట్లుగా ఉందని తెలిపారు. ఇందులో కొరియర్ కంపెనీ సిబ్బంది హస్తమేమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.