ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా మరోసారి మహా ప్రళయం సృష్టిస్తున్నది. రోజువారీ కరోనా కేసులు సెకండ్ వేవ్‌ను దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,166 కేసులు నమోదయ్యాయి. ఇది మంగళవారం కంటే 39 శాతం అధికం. అయితే 13,195 మందికి (87 శాతం) ఎలాంటి లక్షణాలు లేవు. బుధవారం 1,218 మంది ఆసుపత్రిలో చేరారు. ఇందులో 80 శాతం మంది ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నారు. దీంతో ముంబైలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,33,628కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 61,923గా ఉన్నది. మరోవైపు కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 16,384కు పెరిగింది. గత 24 గంటల్లో 714 మంది రోగులు కోలుకున్నారు. ముంబైలో కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 7,52,726కు చేరింది. రికవరీ రేటు 90 శాతంగా ఉన్నది. ముంబైలో కరోనా సెకండ్ వేవ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పుడు 2021 ఏప్రిల్ 4న గరిష్ఠంగా 11,163 కేసులు నమోదయ్యాయి.