Chhattisgarh : చత్తీస్‌గఢ్‌లో విషాదం జరిగింది. వాటర్ మిలన్ తిన్న 15 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ముగ్గురు చిన్నారులు ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఘటన జంజ్‌గిర్–చంపా జిల్లాలోని ఘుర్కోట్ గ్రామంలో సోమవారం జరిగింది. అధికారుల వివరాల ప్రకారం.. కొంతమంది పిల్లలు కుటుంబంతో కలిసి తమ అమ్మమ్మ వాళ్లింటికి వచ్చింది.
ఆదివారం సాయంత్రం వాళ్లు ఇంట్లో ఉన్న వాటర్ మిలన్ తిన్నారు. కొద్దిసేపట్లోనే వాటర్ మిలన్ తిన్న పిల్లలకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే శ్వాస సంబంధిత సమస్యలు ఎదురయ్యాయి. అందులో అఖిలేష్ దివార్ (15) తీవ్ర అనారోగ్య సమస్యని ఎదుర్కొన్నాడు. వెంటనే ఆ బాలుడిని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మిగతా ముగ్గురు పిల్లలు శ్రీ దివార్ (4), పింటూ దివార్ (12), హితేష్ దివార్ (13) కూడా ఇవే సమస్యలు ఎదుర్కొన్నారు. వెంటనే వీరిని కూడా అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే, వీరిలో అఖిలేష్.. ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వాటర్ మిలన్ ఉదయం కోశారు. ఆ రోజు సాయంత్రం తిన్నారు. ఈ క్రమంలో ఆ వాటర్ మిలన్ విషతుల్యం అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు. మరణించిన బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పిల్లలు తిన్న వాటర్ మిలన్ శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. అలాగే, కొయ్యకుండా ఉంచిన ఇంకో వాటర్ మిలన్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం చిన్నారులకు వైద్య చికిత్స కొనసాగుతోంది. పూర్తి దర్యాప్తు తర్వాతే పిల్లల మరణాలకు కారణాలు తెలుస్తాయని అధికారులు, పోలీసులు తెలిపారు.