అహ్మాదాబాద్: బాధితురాలి భర్త అత్యాచారానికి పాల్పడినా.. ఆ చర్య అత్యాచారమే అవుతుందని గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) ఓ తీర్పులో పేర్కొన్నది. జస్టిస్ దివ్యేశ్ జోషి తన తీర్పులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. డిసెంబర్ 8వ తేదీన ఓ కేసులో ఆయన ఈ తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. భార్యను రేప్ చేసినా అది నేరమే అవుతుందని, అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఇదే రూల్ అమలులో ఉన్నదన్నారు. ఆస్ట్రేలియాలోని మూడు రాష్ట్రాలు, న్యూజిలాండ్, కెనడా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్, నార్వే, సోవియేట్ యూనియన్, పోలాండ్, చెకస్లోవేకియాతో పాటు అనేక దేశాల్లో రేప్‌ను రేప్‌గానే భావిస్తారని జస్టిస్ దివ్యేశ్ తన తీర్పులో పేర్కొన్నారు. ఐపీసీలోని చాలా చట్టాలను యూకే నుంచి తీసుకున్నారని, కానీ బ్రిటన్‌లో రేప్ విషయంలో భర్తలకు మినహాయింపు లేదని, ఇప్పుడు మనం కూడా ఆ రూల్‌ను ఎత్తివేయాలని జస్టిస్ దివ్యేశ్ తెలిపారు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి లైంగికంగా దాడి చేస్తే.. ఐపీసీలోని 376 సెక్షన్ కింద నేరం అవుతుందని తన తీర్పులో చెప్పారు. చాలా వరకు కేసుల్లో భర్త అత్యాచారానికి పాల్పడితే అతన్ని వదిలేస్తారని, కానీ తన ఉద్దేశంలో మాత్రం రేప్‌ను రేప్‌గానే భావిస్తానని జస్టిస్ జోషి తెలిపారు.