భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 13 : అకాల భారీ వర్షాలు ఉన్నందున, మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు- రుద్రవెల్లి లో లెవెల్ బ్రిడ్జి వద్ద ప్రవహిస్తున్న మూసీ నది వరద నీటి ఉధృతిని ఆయన పరిశీలించారు. మూసీ పరివాహక ప్రాంతంలో కాజ్ వేలు, వాగులు, బ్రిడ్జిల రాకపోకలపై అప్రమత్తంగా ఉంటూ డైవర్షన్ ఏర్పాటును పక్కాగా నిర్వహించాలని, వరద ఉధృతి ఉన్నప్పుడు ఎవరిని అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు. జంట నగరాల్లో కురిసిన భారీ వర్షాలు, హిమాయత్ సాగర్లో నీటిని విడుదల చేసినప్పుడు మూసీ వరద ఉధృతంగా ఉంటుందని, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రవహిస్తున్న వరద నీటిలో వెళ్లకుండా చూడాలని, రోడ్డు దాటడం లాంటివి చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోకూడదని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, ఎక్కడ ఏం జరిగినా సమాచారం వెంటనే చేరేలా చూడాలన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆయన వెంట అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ రాపర్తి భాస్కర్ గౌడ్, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, చౌటుప్పల్ సీఐ రాములు, స్థానిక ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి, ఎం.ఆర్ ఐ గుత్తా వెంకట్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఎండీ రఫీ, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.