నల్లగొండ రూరల్, జూలై 24 : ఎందులోనూ తీసిపోరు.. ఎవరికీ తక్కువ కాదు.. గృహలక్ష్మిగానే కాదు.. ఏ రంగంలోనైనా హ్యాట్సాప్ అని నిరూపిస్తున్నారు మహిళలు. నల్లగొండ జిల్లా రాములబండ గ్రామ పంచాయతీ వాచర్గా పని చేస్తున్న సింగపంగ లింగమ్మ గతంలో కూలి నాలి చేస్తూ జీవనం గడిపేది.
రెండేండ్ల నుంచి గ్రామ పంచాయతీలో వాచర్గా పని చేస్తున్న ఆమె.. గ్రామపంచాయతీ ట్రాక్టర్ నడుపుతూ చెత్తను సేకరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నది. పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ ఒకరు ఇటీవల మానేశాడు. దాంతో చెత్త సేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా తనకు డ్రైవింగ్ రావడంతో ముందుకొచ్చింది. కొత్త వారిని నియమించే వరకు తానే ట్రాక్టర్ నడుపుతానని విధుల్లో చేరింది. నెలకు రూ.6వేల వేతనం పొందుతున్నది.