Sravana Masam 2023 | రామగిరి, ఆగస్టు 16 : గత రెండు నెలలుగా ఆషాఢం, అధిక శ్రావణ మాసంతో శుభ ముహూర్తాలు లేక వివాహాలు జరుగలేదు. ఈ నెల 18 నుంచి డిసెంబర్ చివరి వరకూ పుష్కలంగా ముహూర్తాలు ఉండటంతో ఇక పెండ్లిళ్ల హడావిడి మొదలు కానున్నది. అలాగే నాటి పెండ్లి పత్రికల్లో సీతారాముల ఫొటోలు ఉండగా, కాలానుగుణంగా నేడు వారి స్థానంలోకి వధూవరులు వచ్చేశారు. అంతేకాకుండా ఈ-మెయిల్, వాట్సాప్‌లలో ఆహ్వానం పలుకుతున్నారు.
ఆగస్టు : 18,19,20,24,26,29,30,31
సెప్టెంబర్ : 1,2,3,6,7,8
అక్టోబర్ 22,24,25,26,27
నవంబర్ : 4,16,18,19, 22,23,24,25,29
డిసెంబర్ : 2,3,6,7,8, 14,15,19,20,21,22,24
బ్రాహ్మణుడు లగ్నపత్రిక రాసింది మొదలు.. ఇంట్లో పెండ్లి సందడి షురూ అయినట్లే. మెహందీ, సంగీత్, మంగళ స్నానాలు, పెండ్లి తేది, సమయం, వేదికతోపాటు అన్ని అంశాలు తెలిపేలా ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేస్తున్నారు. అందులో బంధువులు, స్నేహితుల ఫోన్ నంబర్లు చేర్చి వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి ఆ ఫొటోలను గ్రూప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు సైతం పెళ్లి కుమార్తె లేదా కుమారుడితో దిగిన ఫొటోలు షేర్ చేయడం కొత్త ఆనవాయితీకి తెరలేపినట్లు అయ్యింది. అలాగే కొంతమంది ఫంక్షన్‌కు ఒకే రకమైన డ్రెస్‌కోడ్‌తో పాల్గొంటున్నారు. మగవారు పలు రకాల కలర్ పైజామాలు ధరిస్తుండగా, మహిళలు అదేస్థాయిలో మ్యాచింగ్ అయ్యే చీరెలు ధరిస్తున్నారు.
నాలుగు నెలల్లో చాలా ముహూర్తాలు..
ఆషాఢం, అధిక శ్రావణమాసంతో రెండు మాసాలుగా ముహూర్తాలు లేవు. అయితే శ్రావణ మాసం ప్రారంభమవుతుండటంతో ఈ నెల నుంచి డిసెంబర్ వరకు దాదాపు 40 ముహూర్తాలున్నాయి. ఇప్పటికే పెండ్లిళ్లు చేయాలనుకునేవారు ముహూర్తాలు నిర్ణయం చేసుకుని బ్రాహ్మణులను బుకింగ్ చేసుకున్నారు. దాంతో అంతా బిజీగా ఉన్నారు.
– దౌలాతాబాద్ వాసుదేవశర్మ, ప్రముఖ పురోహితుడు, చిట్యాల
గతంలో ఇంటింటికీ వెళ్లి కార్డులు ఇచ్చేవాళ్లు
పెండ్లి వేడుకకు నెల రోజుల మందుగానే ప్రింటింగ్ ప్రెస్‌లో కార్డులు అచ్చువేయించేవారు. మా నాన్న వాళ్లు సైకిళ్లపై ఊరూరా తిరిగి బంధువులకు పెండ్లి కార్డులు పంపిణీ చేసేవాళ్లు. చాలా దూరమైతే బస్సులో వెళ్లేవారు. దగ్గరి ప్రాంతాలైతే నడుచుకుంటూ వెళ్లి కార్డులు ఇచ్చేవాళ్లు. ఈ సంప్రదాయం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కార్డులు ఇవ్వడం తగ్గించారు. వాట్సాప్ గ్రూప్‌లో పెట్టి ఆహ్వానిస్తున్నారు.
– బత్తుల వీరప్ప, నల్లగొండ
శ్రావణ మాసం నేటి నుంచి ప్రారంభం కానుండడంతో ఆలయాలు శ్రావణ శోభ సంతరించుకోనున్నాయి. శ్రావణం.. స్త్రీలకు లక్ష్మీ మాసం. శివలక్ష్మీ పార్వతులకు నిత్యపూజలు నిర్వహించే ఈ నెలను లక్ష్మీమాసం అని కూడా అంటారు. పాడిపంటలు, శుభాలతోపాటు వరాలను కురిపించే ఈ రోజుల్లో ప్రతి నిత్యం ఇష్టదైవాలను కొలుస్తారు. కలియుగ దైవమైన వేంకటేశ్వరుడి తిరునక్షత్రం శ్రావణం. ఈ నెల రోజుల వ్యవధిలోనే అనేక పండుగలు నిర్వహించడం విశేషం. ఎంతో పవిత్ర కాలం కావడంతో ఆలయాల్లో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. అందుకే ఈ రోజులు ఆధ్యాత్మిక వసంతం సంతరించుకుంటుంది.
శ్రావణమాసం ప్రత్యేకతలు..
ఈ మాసానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కోరికలు తీర్చే నెలగా కీర్తిస్తారు. అయితే ఈ నెల 21న నాగుల పంచమి, 25న వరలక్ష్మి వ్రతాలు, 31 రాఖీ పౌర్ణమి, సెప్టెంబర్ 7న కృష్ణాష్టమితోపాటు హయగ్రీవుడు, బదరీనారాయణుడు, వరహమూర్తి, సంతోషిమాత జయంతోత్సవాలు ఉన్నాయి. ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకం, శుక్రవారం లక్ష్మి ఆరాధన ఎంతో శ్రేష్టమైనవి. సోమ, మంగళ, శుక్ర, శనివారాలు ఎంతో పవిత్రమైన రోజులుగా భావిస్తారు. రాఖీ పౌర్ణమి రోజునే జ్ఞాన దేవతగా పిలిచే హయగ్రీవ స్వామి జయంతి నిర్వహిస్తారు. లక్ష్మీదేవికి ధనం, సరస్వతికి అక్షరాభ్యాసం చేసింది ఈ స్వామియేనని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణ జయంతి వేడుకలు బ్రాహ్మణులు వైష్ణవ సంప్రదాయంగా ఈ మాసంలోనే నిర్వహిస్తారు. దీక్షలు, పూజలతో కొనసాగే ఈ సమాసంలో కృష్ణాష్టమి వేడుకలు ఆనందోత్సాహాన్ని కలిగిస్తాయి. గ్రామ దేవతలకు నిర్వహించే బోనాల పండుగను ఈ మాసంలోనే జరుపుకొంటారు. శివకేశవుల ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించే భక్తులు శ్రావణమాసంలో ఉపవాస దీక్షలు చేస్తారు. వరలక్ష్మీ కటాక్షం కోసం అన్ని ఆలయాల్లో వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహిస్తారు.