‘మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధిస్తే అంతకు మించిన పురోగతి ఉండదు. అందుకు కావాల్సింది చదువు. చదువాల్సిన సమయంలో, కెరీర్లో స్థిరపడాల్సిన సందర్భంలో టైం వేస్ట్ చేస్తే జీవితాన్నే కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే బాగా చదువాలి.. ఆర్థికంగా ఎదుగాలి. సోషల్‌మీడియాలో రెండు కోణాలు ఉంటాయి. మంచి కోణాన్ని అందిపుచ్చుకొని జీవితంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకానీ ఫేస్బుక్, వాట్సాప్ వంటి వేదికలపై అనవసర విషయాలతో సమయాన్ని వృథా చేయొద్దు. ముఖ్యంగా టీనేజ్ ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల పర్యవేక్షణ అవసరం.
ఫ్రెండ్లీ వాతావరణంతో వారి ఉజ్వల భవిష్యత్ కోసం గైడ్ చేయాలి. ర్యాగింగ్, వేధింపుల వంటి వాటిపై కఠిన చట్టాలు అమలులో ఉన్నాయి. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఫిర్యాదు చేయాలి. తక్షణమే స్పందించేందుకు జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుంది’ అని నల్లగొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్పీని నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా పలుకరించింది. అమ్మాయిలు, మహిళలకు సంబంధించిన అనేక విషయాలపై ఆమె స్పందించారు. మహిళల కోసం అమలులో ఉన్న చట్టాలు, తీసుకుంటున్న చర్యలు, తదితర విషయాలను పంచుకున్నారు.
– నల్లగొండ ప్రతినిధి, మార్చి 7 (నమస్తే తెలంగాణ)
‘అమ్మాయిలు ముఖ్యంగా తమ కెరీర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించేందుకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని అందుపుచ్చుకోవడంలోనే సమస్య ఉంది. అమ్మాయిలకు తమ భవిష్యత్తుపై స్పష్టత అవసరం. సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే. ముందుగా మంచిగా చదువాలన్న కోరిక అవసరం. అందుకోసం అందుబాటులో ఉన్న అవకాశాలపై దృష్టి సారించాలి. అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలి. మంచిగా చదివి ఆర్థికంగా నిలదొక్కుకుంటే అమ్మాయిలు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఆర్థిక స్థిరత్వం సాధిస్తే ప్రపంచాన్నే జయించవచ్చు.’ అని నల్లగొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం అమలులో ఉన్న చట్టాలు, తీసుకుంటున్న చర్యలు, తదితర విషయాలపై తన మనోగతాన్ని వెల్లడించారు.
నల్లగొండ ప్రతినిధి, మార్చి 7 (నమస్తే తెలంగాణ)
చిత్తశుద్ధి అవసరం
ఏదైనా సాధించాలంటే దాని పట్ల చిత్తశుద్ధి అవసరం. చిత్తశుద్ధితో కృషి చేస్తే సాధించలేనిదేదీ ఉండదు. ప్రస్తుత సమాజంలో టైం వేస్ట్ చేసే యువత కూడా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు, విద్యార్థినులు లక్ష్యం వైపు సాగాలంటే అనవసర విషయాలు పక్కన పెట్టాలి. సోషల్ మీడియాతో టైం వేస్ట్ చేసే లక్షణాలు కరెక్టు కాదు. లక్ష్య సాధనలో దాన్ని పాజిటివ్ యాంగిల్లోనూ ఉపయోగించుకోవచ్చు. కానీ ఫేస్బుక్, వాట్సాప్ వంటి వేదికల ద్వారా టైం వేస్ట్ చేయొద్దు. పరీక్షల సమయంలో వాటి జోలికి పోకుండా ఉండాలి. చదువాలి.. ఎదగాలి అన్న తపన ఉంటే మంచి జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.
చిన్నతనంలో ప్రేమలు సరికావు
చదువు పూర్తిగాక ముందే, జీవితంలో స్థిరపడక ముందే.. ప్రస్తుతం ప్రేమలు, పెళ్లిళ్ల పేరుతో యువత జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నారు. చట్టప్రకారం పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నా.. కెరీర్ పట్ల శ్రద్ధ అవసరం. టీనేజీ ప్రేమలు, ఆ వెంటనే పెళ్లిళ్లు అనే ధోరణి సరికాదు. ముందు తమ జీవితానికి ఓ లక్ష్యం పెట్టుకోవాలి. ఆర్థికంగా స్థిరపడాలి. అప్పుడు ప్రేమ పెళ్లిళ్లు కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతాయి. జీవితంలో స్థిరపడకపోతే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోక తప్పదు.
తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం
ఆడపిల్లలు, ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యుల పర్యవేక్షణ, తోడ్పాటు ఎంతో అవసరం. ఆడపిల్లలకు మంచి చదువును అందించే ప్రయత్నం చేయాలి. ఇంట్లో ఆడపిల్లలతో స్నేహితుల మాదిరిగా వ్యవహరించాలి. ఇంట్లో అన్ని విషయాలు చెప్పేలా, చర్చించేలా వాతావరణం కల్పించాలి. మంచేదో, చెడేదో చెప్పి గైడ్ చేయాలి. అమ్మాయిల్లో జీవితం పట్ల సానుకూల దృక్పథం అలవడేలా, నిలదొక్కుకునేలా మంచి కెరీర్ వైపు ప్రోత్సహించాలి.
మహిళల కోసం ఎన్నో చట్టాలు
ప్రస్తుతం మహిళల కోసం ఎన్నో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. పకడ్బందీగా అమలవుతున్నాయి. కాలేజీల్లో ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, పని ప్రదేశాల్లో వేధింపులు, లైంగిక దాడులు ఇలా ప్రతి దానికీ ప్రత్యేక చట్టం ఉన్నది. వీటిని అమలు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాలు కూడా ఉన్నాయి. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించేందుకు సమర్థవంతమైన షీ టీమ్‌లు, ప్రత్యేకంగా మహిళా పోలీసు స్టేషన్లు ఉన్నాయి. భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్భయ, పోక్సో చట్టాలు సైతం ఉన్నాయి. ఎక్కడ ఇబ్బందులున్నా డయల్ 100తో పాటు వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలు కూడా అందుబాటులో ఉన్నాయి.
మహిళలందరికీ శుభాకాంక్షలు
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలి. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. అందుకు నా జీవితమే ఉదాహరణ. చిన్నతనం నుంచి చదువుపైనే దృష్టి ఉండేది. తల్లిదండ్రుల తోడ్పాటుతో కెరీర్ పట్ల స్పష్టత ఉండేది. ముందుగా ఇంజినీరింగ్ పూర్తి చేశాక ఉద్యోగంలో స్థిరపడాలనుకున్న. అనుకున్న విధంగానే టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించా. కానీ.. ఇంకా ఏదైనా సాధించాలన్న తపన వెంటాడేది. ఆ సమయంలోనే సివిల్స్‌పై ఆలోచన మెదిలింది. ఉద్యోగం చేస్తూనే సివిల్స్ ప్రిపరేషన్ మొదటుపెట్టా. ఐపీఎస్‌గా సెలక్ట్ అయ్యా. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ర్టానికి కేటాయించిన తొలి ఐపీఎస్‌ను నేనే. సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశం లభించింది. జీవితంలో ఇంతకు మించిన సంతృప్తి ఏముంటుంది.