నీలగిరి, జూలై 5 ; సీజనల్ వ్యాధుల నివారణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ప్రతి ఏటా సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ముందస్తుగానే ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. గత సంవత్సరం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో విషజ్వరాలు విజృంభించి ప్రజలు అనారోగ్యాల బారిన పడిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, నీటి కాలుష్యం నివారణకు చర్యలు తీసుకుంటుంది. వ్యాధులు ప్రబలినప్పుడు తక్షణం గుర్తించేందుకు అనువుగా మలేరియా ర్యాపిడ్ డయాగ్నస్టిక్ కిట్లు, జిల్లాలో దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు ప్రత్యేకంగా దోమలు, వాటి లార్వాల నివారణకు స్ప్రే, లిక్విడ్స్‌ను మంజూరు చేసింది. ప్రతి గ్రామంతోపాటు పట్టణాల్లోని వార్డుల్లో సైతం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా జూన్ మాసాన్ని మలేరియా మాసంగా, జూలై మాసాన్ని డెంగ్యూ మాసంగా గుర్తించిన అధికారులు ప్రజలను చైతన్యం చేస్తూ అన్ని గ్రామాల్లో దోమల నివారణకు చర్యలు చేపడుతున్నారు. వాటర్ ట్యాంక్‌లు, బోరుబావులు కలుషితం కాకుండా క్లోరినేషన్ చేస్తున్నారు. దోమల, లార్వాల నివారణకు 150 లీటర్ల టెమిఫోస్, 50 లీటర్ల పెరిత్రమ్ లిక్విడ్, 50 వేల మైక్రోైస్లెడ్స్, 50 వేల బ్లడ్ ల్యాన్పర్లు మంజూరు చేశారు. జూలైలో డెంగ్యూ ప్రజలే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు టీ హబ్‌కు రక్తనమూనాలను పంపించి వాటిని కట్టడి చేసేలా ప్రణాళికలు తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా కృష్ణానది పరీవాహక ప్రాంతంతోపాటు మునుగోడు, మర్రిగూడ, నకిరేకల్, కట్టంగూరు, తిప్పర్తి, అన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు
చేపడుతున్నారు.
దోమల నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు..
జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఇందుకు గానూ ముందస్తుగా అన్నిరకాల చర్యలను వైద్యారోగ్య శాఖ చేపట్టింది. విషజ్వరాలకు దోమలతోపాటు కలుషిత నీరు కూడా కారణం కావడంతో నీటిని క్లోరినేషన్ చేయడంతోపాటు స్వచ్ఛమైన నీటిని అందిచేలా చర్యలు చేపట్టారు. దోమల నిర్మూలనకు వైద్యారోగ్యశాఖ చేపట్టే కార్యక్రమాలతోపాటు అంగన్వాడీ, ఆశలు, ఏఎన్ఎంలు, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నాయి.
75 వేల ర్యాపిడ్ కార్డు టెస్టులు
రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) నుంచి జిల్లాకు 75 వేల మలేరియా ర్యాపిడ్ డయాగ్నస్టిక్ కిట్లు మంజూరయ్యాయి. మలేరియా వ్యాధిని మలేరియా ర్యాపిడ్ డయాగ్నస్టిక్‌ల ద్వారా నిర్ధారణ చేయవచ్చు. దీంతోపాటు ఇది వరకు మలేరియా పాజిటివ్ వచ్చిన ఏరియాలో పెరిత్రమ్ స్ప్రే చేయడానికి జిల్లాకు 50 లీటర్లు మంజూరు చేసింది. ప్రధానంగా దోమల ఉధృతి ఉన్నచోట ఇండ్ల లోపల పెరిత్రమ్ స్ప్రేను చేయనున్నారు. నిల్వ ఉన్న నీళ్ల దగ్గర దోమల లార్వాలు వృద్ధి చెందే అవకాశం ఉండగా అక్కడ టెమిఫోస్ లిక్విడ్‌ను చల్లి లార్వాలను నిరోధిస్తారు.
జిల్లాలో ప్రమాదకర మండలాలు ఇవే..
జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదకర మండలాలను జిల్లా వైద్యారోగ్య శాఖ గుర్తించింది. వీటిలో త్రిపురారం, తిప్పర్తి, తిరుమలగిరి, అనుముల, పెద్దవూర, డిండి, మర్రిగూడ, దామరచర్ల, అడవిదేవులపల్లి, నేరేడుగొమ్ము మండలాలతోపాటు దేవరకొండ, నకిరేకల్, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండలోని పలు ప్రాంతాలను ప్రమాదకరమైనవిగా గుర్తించారు.
14 రకాల టెస్టులు, 98 రకాల మందులు అందుబాటులో..
జిల్లాలోని పల్లె దవాఖానలు, సబ్ సెంటర్లలో సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు 14 రకాల టెస్టులు చేసేలా సిబ్బందిని ఏర్పాటు చేశారు. అంతేగాకుండా 98 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అతిసారను అరికట్టేందుకు ప్రతి పీహెచ్సీ, ఏఎన్ఎం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ఇవేకాకుండా మెరుగైన మందులు అవసరం పడితే ఈ-సంజీవని ద్వారా మందులను అందజేయనున్నారు. ఎప్పటికప్పుడు పీహెచ్‌సీలు, పల్లె దవాఖానలతోపాటు ఆశలు, ఏఎన్ఎంలు రక్త నమునాలు సేకరించి జిల్లా కేంద్రంలోని టీ హబ్‌కు తరలించి 138 రకాల పరీక్షలు చేయనున్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు
జిల్లాలో గతంలో వచ్చిన విషజ్వరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రణాళిలు రూపొందించడం జరిగింది. గూడేలు, తండాలతోపాటు పట్టణాల్లోనూ ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే అక్కడకి వెళ్లి హెల్త్ క్యాంపులు నిర్వహించడం, రక్తనమూనాలు సేకరించేలా కార్యాచరణ తయారుచేశాం. సకల వ్యాధులకు మూలమైన దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పనికిరాని పాత్రలు, టైర్లు, బకెట్ల ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి.
-డాక్టర్ అన్నీమళ్ల కొండల్రావు,డీఎంహెచ్ఓ, నల్లగొండ
సీజనల్ వ్యాధుల నివారణ పద్ధతులు..