రుణమాఫీపై స్పష్టతేది?
అధికారంలోకి వస్తే తక్షణమే అప్పు ఉన్న ప్రతి రైతుకూ రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ... ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల అనంతరం కూడా రైతులకు కుచ్చుటోపీ పెట్టేందుకు కుట్రలు చేస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
- లబ్ధిదారుల ఎంపిక ప్రతిపాదికపై మౌనం
- తొలి జాబితాలో రేషన్‌కార్డే ప్రమాణికం
- డీసీసీబీ పరిధిలో అర్హుల్లో 46శాతం మందికే రుణమాఫీ
- బ్యాంకుల్లో లబ్ధిదారుల జాబితాలే లేని వైనం
- జాబితాలపై స్పష్టత లేక బ్యాంకుల వద్ద రైతుల పరుగులు
- కేసీఆర్ సర్కార్ ఇచ్చిన దాంట్లో 43శాతమే రుణమాఫీ
- ఆర్థిక భారం తగ్గించుకునేందుకు నానా తంటాలు
- రైతుల్లో చర్చనీయాంశంగా రుణమాఫీ కోతలు
అధికారంలోకి వస్తే తక్షణమే అప్పు ఉన్న ప్రతి రైతుకూ రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ… ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల అనంతరం కూడా రైతులకు కుచ్చుటోపీ పెట్టేందుకు కుట్రలు చేస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గురువారం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించినా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసలైన రైతుల్లో లబ్ధి జరిగిన రైతులు మాత్రం సగానికి తక్కువే ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు రుణమాఫీకి దేన్ని ప్రతిపాదికగా తీసుకున్నారన్న దానిపై శుక్రవారం కూడా ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోయారు. అటు వ్యవసాయ అధికారులు, ఇటు లీడ్ బ్యాంకు ప్రతినిధులు సైతం తమకేమీ తెలువదు.. అంతా ఉన్నతాధికారులకే తెలుసంటూ తప్పించుకుంటుండడం ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నది. కాగా అర్హులైన రైతుల్లో 50శాతానికి కూడా తక్కువగానే రుణమాఫీ వర్తింపచేస్తున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో కేసీఆర్ సర్కార్ చేసిన లబ్ధితో పోల్చినా ప్రస్తుతం రూ.లక్ష వరకు రుణమాఫీ లబ్ధి 43శాతానికే పరిమితం అవుతుండడం గమనార్హం.
– నల్లగొండ ప్రతినిధి, జూలై19(నమస్తే తెలంగాణ)
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రుణమాఫీ పథకంపై స్పష్టత కరువైంది. లబ్ధిదారుల ఎంపికకు తీసుకున్న ప్రమాణాలు ఏమిటన్న దానికి ఎక్కడా సమాధానం దొరుకడం లేదు. బ్యాంకుల వద్ద లబ్ధిదారుల జాబితానే లేకపోగా ఎంత మందికి మాఫీ అయ్యిందనేది కూడా చెప్పే నాథుడే లేకుండా పోయారు. దీంతో రైతులు శుక్రవారం ఆయా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తమ లోన్ ఖాతా నంబర్‌తో వచ్చి రుణమాఫీ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడం కనిపించింది. వస్తే వచ్చిందని, లేకుంటే ఎందుకు రాలేదన్న దానికి ఎవరూ బదులివ్వలేదు. వ్యవసాయ అధికారులను అడగండి అంటూ బ్యాంకర్లు ఉచిత సలహా ఇస్తుండడం విశేషం. దాంతో రైతులు బ్యాంకుల నుంచి వ్యవసాయ అధికారుల వద్దకు బారులు తీరారు. వడ్డీ, అసలు కలిపినా రూ.లక్ష లోపే రుణం ఉన్నా చాలా మందికి రుణమాఫీ జరుగకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
సహకారం రంగంలో 46శాతం మందికే..
పంట రుణాల మంజూరులో సహకార రంగం పాత్ర కూడా కీలకమే. గ్రామీణ ప్రాంతాల రైతులకు రుణాలివ్వడంలో కోఆపరేటివ్ సొసైటీలు ముందు వరుసలో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని నల్లగొండ జిల్లా కేంద్ర సహకారం బ్యాంకు(డీసీసీబీ) ఆధ్వర్యంలో రైతులకు పెద్ద మొత్తంలో పంట రుణాలు ఇచ్చారు. ఇందులో రూ.లక్ష వరకు రుణాలు పొందిన వారిలో రూ.లక్ష రుణమాఫీకి అర్హులైన వారుగా 72వేల మందిని గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. వీరికి రూ.316 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని గుర్తించారు. తీరా గురువారం ప్రకటించిన రుణమాఫీ జాబితా ప్రకారం అర్హులైన వారిలో కేవలం 46శాతం మందికే రుణమాఫీ వర్తిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. డీసీసీబీ అధికారుల లెక్కల ప్రకారం 33,913 మందికే రూ.143.11 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి. మిగతా 54శాతం మంది రైతుల పరిస్థితి ఏంటో అన్న దానికి శుక్రవారం నాటికి ఎవరి వద్దా సమాధానం లభించలేదు.
కుటుంబం ప్రాతిపదికనే..
ఇదే విషయమై రైతు సంఘాల నేతలు రంగంలోకి దిగి ఆరా తీసే పనిలో పడ్డారు. పలువురి రైతులు ఇచ్చిన సమాచారంతో పాటు రుణమాఫీ జాబితాల ప్రకారం ఓ అంచనాకు వచ్చారు. గురువారం నాటి రుణమాఫీలో రేషన్‌కార్డు ప్రతిపాదికన కుటుంబాన్ని పరిగణలోకి తీసుకునే వర్తింప చేసినట్లు తేలింది. ఒకే రేషన్‌కార్డు పరిధిలోని కుటుంబసభ్యుల్లో ఇద్దరికి కలిపి తీసుకున్న అసలు, వడ్డీ కలిపి ఉంటే వారి రుణం మాఫీ అయినట్లు తెలిసింది. ఇదే సమయంలో వీరిద్దరి రుణం రూ.లక్ష దాటితే ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారు. వీరికి రూ.లక్షన్నర వరకు రుణమాఫీ ప్రకటించినప్పుడు మాపీ జరుగుతుందని తెలుస్తున్నది. ఇలానే రేషన్‌కార్డులోని కుటుంబసభ్యులకు ఎంత మందికి రుణాలు ఉన్నా గరిష్ఠంగా ఆ కుటుంబానికి 2లక్షల వరకే రుణమాఫీ వర్తింప చేయనున్నట్లు తొలి జాబితాలోని లబ్ధిదారుల ఎంపిక స్పష్టం చేస్తున్నది. ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక, వారు తీసుకున్న రుణాలను బట్టి రేషన్‌కార్డు బేస్డ్గా కుటుంబాన్నే ప్రామాణికంగా తీసుకున్నట్లు అర్థమవుతున్నది. ఒక కుటుంబంలో ఎంత మందికి ఎంత అప్పు ఉన్నా అందరికీ కలిపి గరిష్ఠంగా రూ.రెండు లక్షల వరకే రుణమాఫీ వర్తింప చేసేలా ప్రభుత్వం అనధికారిక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తున్నది. దీని వల్ల ఆర్థికంగా భారీగా ప్రభుత్వం భారం తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అనధికారిక వర్గాల సమాచారం. పట్టాదారు పాస్‌పుస్తకాల ఆధారంగా రుణమాఫీ చేపడితే భారీ మొత్తంలో భరించాల్సి వస్తుందని భావించిన ప్రభుత్వం తెరవెనక కోతలకు సిద్ధమైందన్న చర్చ సర్వత్రా మొదలైంది.
అప్పట్లో ఇచ్చిన దాంట్లో 43 శాతమే
2014 జూన్ 2 నుంచి 2018 డిసెంబర్11 వరకు రైతులు తీసుకున్న పంట రుణాల్లో రూ.లక్ష రుణమాఫీని కేసీఆర్ సర్కార్ 2018 నవంబర్ ఎన్నికల సందర్భంగా ప్రకటించింది. దాని ప్రకారం 2019 ఫిబ్రవరిలో ఒకసారి, కరోనా తర్వాత 2023 ఆగస్టులో మూడు దఫాలుగా 99,999 రూపాయల వరకు గల రుణాలను మాఫీ చేసింది. రూ.లక్ష రుణాల మాఫీకి ఇంతలోనే ఎన్నికల కోడ్ అడ్డమొచ్చింది. కేసీఆర్ సర్కార్ చేసిన రుణమాఫీ లబ్ధిని పరిశీలిస్తే నల్లగొండలో 1.65లక్షల రైతులకు రూ.1,044కోట్లు, సూర్యాపేటలో 1.75లక్షల మందికి రూ.751 కోట్లు, యాదాద్రిలో 59,726 మంది రైతులకు రూ.364 కోట్లుగా ఉంది. మొత్తంగా 4లక్షల మంది రైతులకు రూ.2159కోట్లు రుణమాఫీ జరిగింది. ఇది 99,999 రూపాయల వరకే కావడం విశేషం. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ లక్ష రూపాయల వరకు రుణమాఫీ ప్రకటిస్తే నల్లగొండలో 83,124 మందికి రూ.454.49కోట్లు, సూర్యాపేటలో 56,274 మందికి రూ.282.98కోట్లు, యాదాద్రి జిల్లాలో 37,285 మందికి రూ.203.82 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది. మొత్తంగా 1,76,683 మందికి రూ.941.29కోట్లు మాత్రమే లబ్ధి జరుగుతున్నది. దీన్ని బట్టి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన దాంట్లో 43శాతమే రుణమాఫీ జరుగుతున్నట్లు స్పష్టమవుతున్నది. అప్పుడు కేసీఆర్ పాసుపుస్తకం ప్రతిపాదికన రుణమాఫీ వర్తింప చేయడంతో భారీగా రైతులకు లబ్ధి చేకూరగా ప్రస్తుతం రేషన్‌కార్డు ప్రతిపాదికగా కుటుంబం యూనిట్‌గా తీసుకోవడంతోనే రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు లెక్కలను బట్టి వెల్లడవుతున్నది. దీనిపై అధికారికంగా మరింత స్పష్టత రావాల్సి ఉంది.
క్షేత్రస్థాయిలో ఇలా..
ఉమ్మడి జిల్లా పరిధిలో మచ్చుకు కొన్ని సొసైటీల్లో జరిగిన లబ్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. దామరచర్ల సొసైటీలో రూ.లక్ష లోపు రుణాలున్న రైతులు 518కాగా వీరిలో 360 మందికే రుణమాఫీ వచ్చింది. ఇక్కడ పాసుపుస్తకం ప్రమాణికం కాకుండా రేషన్‌కార్డు ప్రమాణింగా ఎంపిక చేసినట్లు స్పష్టమైంది. డిండి పరిధిలో 774 మందికి గానూ 320 మందికి, పెద్దవూరలో 408 మందికిగానూ 92 మందికి.. కొండమల్లేపల్లిలో 771 మందికిగానూ 423 మందికి.. నకిరేకల్‌లో 432 మందికిగానూ 207 మందికి, కట్టంగూరులో 931 మందికిగానూ 389 మందికి, శాలిగౌరారంలో 270 మందికిగానూ 97 మందికి, కనగల్‌లోని రెండు సొసైటీల్లో కలిపి 994 మందికిగానూ 355 మందికి మాత్రమే రుణమాఫీ వర్తించింది.
యాదాద్రి జిల్లాలోని ఆత్మకూర్(ఎం) సొసైటీలో 566 మందికి గానూ 239 మందికి, చౌటుప్పల్‌లో 283 మందికిగానూ 147 మందికి, తుర్కపల్లిలో 822 మందికిగానూ 495 మందికి లక్ష లోపు రుణాలు మాఫీ అయ్యాయి.
సూర్యాపేట జిల్లా పరిధిలోని నేరేడుచర్ల పరిధిలోని మూడు సొసైటీల్లో కలిపి 1790 మంది రూ.లక్ష వరకు రుణగ్రహీతలు ఉండగా ఇందులో 797 మందికే మాఫీ జరిగి, మరో 993 మందికి కాలేదు. మఠంపల్లి సొసైటీలో 749 మందికిగానూ 367 మందికి, హుజూర్‌నగర్‌లోని అమరవరంలో 631 మందికి గానూ 261 మందికి, వేపలసింగారంలో 555 మందికి గానూ 217 మందికి, బూరుగడ్డలో 1092 మందికి గానూ 488 మందికి మాత్రమే లబ్ధి జరిగినట్లు తెలిసింది. మిగతా వాళ్ల సంగతి ఏంటో ఎవరి వద్దా సమాధానం దొరుకలేదు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

