పారిశుధ్యం అస్తవ్యస్తం
జిల్లాలో గ్రామ పంచాయతీల పరిస్థితి దారుణంగా మారింది. పంచాయతీల్లో పాలక వర్గ పదవీకాలం పూర్తవడం.. ప్రతినెలా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోవడం, పారిశుధ్య కార్మికులకు వేతనాలు లేకపోవడంతో పల్లెల్లో పాలన గాడి తప్పింది.
- ఆరు నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాల్లేవు
- మరమ్మతులకు నోచని గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు
- రిపేరు చేసేందుకు డబ్బుల్లేవంటున్న కార్యదర్శులు
- పొంగుతున్న డ్రైనేజీలు, కాలిపోయిన వీధి దీపాలు
- గాడి తప్పిన పంచాయతీ పాలన
నల్లగొండ, జూన్ 6 : జిల్లాలో గ్రామ పంచాయతీల పరిస్థితి దారుణంగా మారింది. పంచాయతీల్లో పాలక వర్గ పదవీకాలం పూర్తవడం.. ప్రతినెలా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోవడం, పారిశుధ్య కార్మికులకు వేతనాలు లేకపోవడంతో పల్లెల్లో పాలన గాడి తప్పింది. వేసవి కాలంలో నీటి కోసం గోస పడ్డ జనం వానకాలం ప్రారంభం కాగానే పారిశుధ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నిన్న మొన్న పడిన వర్షాలు, గాలి దుమారానికి డ్రైనేజీలు పొంగుతుండగా.. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో వీధి దీపాలు కాలి పోయాయి. వాటిని బాగు చేసేవారు లేక పోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
వర్షాలతో పొంగుతున్న డ్రైనేజీలు
ఈ సారి వర్షాకాలం ప్రారంభం కంటే ముందుగానే అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడ్డాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల రాకతో వానలు కురుస్తున్నాయి. జిల్లాలో రెండు రోజులు కురిసిన వర్షాలతో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. వీధుల్లో, మురుగు కాల్వల్లో చెత్త పేరుకు పోయినా వాటిని శుభ్రం చేసే పరిస్థితి లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలుగా పంచాయతీ పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవటంతో వారు పారిశుధ్యంపై దృష్టి పెట్టడం లేదు. పైగా ట్రాక్టర్లు చెడిపోయినా రిపేరు చేయక పోవడంతో చెత్త సేకరణ జరుగడం లేదు.
వేధిస్తున్న నిధుల కొరత
గ్రామ పంచాయతీల్లో నిధుల లేమి కారణంగా కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు ఆగిపోయాయి. దీనికి తోడు ట్రాక్టర్లు చెడిపోయి మరమ్మతులు చేసే పరిస్థితి లేకపోవడంతో అవి గ్రామ పంచాయతీలకే పరిమితమయ్యాయి. గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలకు వీధి లైట్లు కాలిపోయాయి. పంచాయతీ పాలక వర్గం లేనందున వాటి రిపేరు విషయమై పట్టించుకునే వారు లేకుండా పోయారు. ప్రభుత్వం నుంచి నిధులు రానందున కార్యదర్శులు సైతం చేతులెత్తేశారు. ఫలితంగా ప్రజలు చీకట్లోనే కాలం వెల్లదీస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకు ప్రతి నెలా రూ.20 కోట్లు ఇవ్వగా ప్రస్తుత ప్రభుత్వం డిసెంబర్, జనవరిలో రూ.9.68 కోట్లు మాత్రమే ఇచ్చింది. అవి కూడా ఫిబ్రవరిలో పాలన పూర్తయిన సర్పంచులు ఉన్నకాడికి ఊడ్చుకొని పోయారు. దాంతో పంచాయతీల గల్లా ఖాళీ కాగా పాలన పడకేసింది.
ఆరు నెలలుగా కార్మికులకు వేతనాల్లేవ్
జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా 3,258 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. గతంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కడే కార్మికుడు ఉండగా.. వారికి నెలకు రూ.1500 వేతనం ఇచ్చేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్మికుల సంఖ్యను పెంచడంతో పాటు వారి వేతనాన్ని సైతం ప్రతినెలా రూ.9,500 అందజేసింది. దాంతో కార్మికులు చెత్త ఎప్పటికప్పుడు ఎత్తి డంపింగ్ యార్డుల్లో పోసేవారు. ప్రస్తుతం కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం, ట్రాక్టర్లు నడువడానికి డీజిల్ సైతం లేనందున ఎక్కడి చెత్త అక్కడే ఉంది. నిన్న మొన్న కురిసిన వర్షాలకు డ్రైనేజీలు పొంగుతుంటే ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో కొన్ని గ్రామాల్లో ప్రజలే స్వచ్ఛందంగా శుభ్రం చేసుకుంటున్నారు.
ఆరు నెలలుగా జీతాలివ్వకుంటే బతికేదెట్టా
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు నెల నెలా జీతం ఇచ్చింది. ట్రాక్టర్ల నిర్వహణకు డబ్బులు చెల్లించింది. దాంతో ప్రతి రోజూ ఉదయం ఏడు గంటలకే ఊర్లకు పోయి చెత్త ఎత్తి డంపింగ్ యార్డులో పోసేది. ఇప్పుడు ఆరు నెలలుగా జీతాల్లేవ్. మా ఊరి ట్రాక్టర్ ఖరాబ్ అయింది. బాగు చేయించమంటే కార్యదర్శి డబ్బుల్లేవని అంటున్నాడు. మేమేం చేయం. కనీసం ట్రాక్టర్ రిపేర్ చేపిస్తే చెత్త తీయడానికి వీలుంటది. గవర్నమెంట్ ఆలోచించి డబ్బులిస్తే బాగుండు.
-నల్లగొండ మండలానికి చెందిన ఓ పారిశుధ్య కార్మికుడు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

