నీలగిరి, ఏఫ్రిల్ 12: అధిక లాభాలు, కాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో జనాన్ని నమ్మించి వీఐపీఎస్ కంపెనీ పేరుతో రూ. వందల కోట్లతో పెట్టుబడులు పెట్టించి, వేవ్(WAVE) పేరుతో చీటింగ్‌కు పాల్పడే మల్టీలెవల్ మార్కెటింగ్ ఏజెంట్ల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి పది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ అదనపు ఎస్పీ జి.రమేష్ తెలిపారు. అదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ VIPS group of companies పేర వినోద్ తుకారాం ఖుటే అనే వ్యక్తి ఏజెంట్లును నియమించుకుని జనం నుంచి రూ.కొన్ని వందల కోట్లు పెట్టుబడులు పెట్టించి, ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన విషయం తెలిసిందే.
మరోసారి WAVE పేరుతో మోసగించే యత్నంలో భాగంగా శనివారం స్థానిక లక్ష్మీ గార్డెన్స్ సమీపంలో హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఏరియాకు చెందిన కానాల లక్ష్మీనారాయణ రావు, నకిరేకల్ మండలం మర్రూర్‌కు చెందిన పున్నం బాలకృష్ణ, చిట్యాల మండలం ఎలికట్టెకు చెందిన ఉయ్యాల శ్రీనివాస్, నల్లగొండ పట్టణానికి చెందిన కురాకుల రమేష్, కనగల్ మండలం దోరేపల్లికి చెందిన గాజుల మహేష్, నల్లగొండ మండలం కాకుల కొండారం గ్రామానికి చెందిన కోల కుశలయ్య, నల్లగొండ పట్టణానికి చెందిన మాదగొని సైదులు, కట్టంగూర్ మండలం మునుకుంట్లకు చెందిన ముడుసు ఉమాశంకర్, నల్లగొండ మండలం అప్పాజీపేటకు చెందిన ఓరుగంటి శంకర్, కట్టంగూర్కు చెందిన గుడపూరి లింగస్వామి, గూడూరు అఖిల్ (కొత్త కంపెనీలో పాత కస్టమర్లు). వీరితో మళ్లీ రూ. పెట్టుబడి పెడితే, పాత డబ్బులు కూడా తిరిగి వస్తాయని చెప్పి మళ్లీ మోసగించాలని యత్నించిన్నట్లు తెలిపారు.
ఈ సమాచారం అందుకున్న నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు తన సిబ్బందితో అకడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 10 సెల్ ఫోన్లు సీజ్ చేసి వీఐపీఎస్ ఏజెంట్లును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిని విచారించగా, వేవ్ కంపెనీ సీఈవోగా వీఐపీఎస్ కంపెనీ సీఈవో వినోద్ తుకారాం ఖుటే, సౌత్ ఇండియా డెవలప్మెంట్ డైరెక్టర్ కల్యాణ్ చక్రవరి డైరెక్టర్లు సుమిత్ పురాంక్, గుమ్మల సత్యనారాయణ, గుమ్ముల అభినాష్ ఉన్నారన్నారు. వారు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే తక్షణమే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అడిషనల్ ఎస్పీ సూచించారు. సమావేశంలో నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, టూటౌన్ సీఐ రాఘవ రావు, నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు ఏఏఎస్ రాజు, సిబ్బంది జానకిరాములు తదితరులు ఉన్నారు.