కాంగ్రెస్ వస్తే ఎవుసం కుప్పకూలుడే..
కరెంటు కోసం నాడు పడ్డ కష్టాలు మళ్లీ పడాలంటే మా వల్ల కాదు..నాడు రాత్రి పూట చీకట్లో బోరు బావుల వద్దకు వెళ్లి చాలా మంది కన్నుమూసిన రోజులను ఎట్లా మర్చిపోతం. అలాంటి పరిస్థితి మళ్లీ తీసుకొస్తమని కాంగ్రెసోళ్లు చెబుతుంటే వాళ్లకు ఎట్లా ఓట్లేసేదని రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు.
- కరెంట్ కోసం మళ్లీ పడిగాపులు తప్పవు
- 10 హెచ్‌పీ మోటరు మా వల్ల కాదు
- కాంగ్రెస్ మాటలపై రైతుల ఆందోళన
కరెంటు కోసం నాడు పడ్డ కష్టాలు మళ్లీ పడాలంటే మా వల్ల కాదు..నాడు రాత్రి పూట చీకట్లో బోరు బావుల వద్దకు వెళ్లి చాలా మంది కన్నుమూసిన రోజులను ఎట్లా మర్చిపోతం. అలాంటి పరిస్థితి మళ్లీ తీసుకొస్తమని కాంగ్రెసోళ్లు చెబుతుంటే వాళ్లకు ఎట్లా ఓట్లేసేదని రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు. సీఎం కేసీఆర్ సర్కారు 24 గంటల కరెంటు ఇస్తుండడంతో సాగు బాగా అవుతుందని. అలాంటి సర్కారును వదలుకునేది లేదంటూ పేర్కొంటున్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ మూడు గంటల కరెంటే ఇస్తమంటున్నరు.. దాంతో వ్యవసాయంలో మునుగుడే తప్ప తేలేది లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవడం మా వల్ల కాదని, అలాంటి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వమని, మా బాధలు తెలిసిన సీఎం కేసీఆర్‌నే మళ్లీ ఎన్నుకుంటామని ముక్తకంఠంతో చెబుతున్నారు. పదేండ్లుగా కరెంటు కష్టాలు లేక ప్రశాంతంగా ఉంటున్నామని, మళ్లీ కరెంట్ కష్టాలు కొని తెచ్చుకోలేమంటున్న రైతులు కాంగ్రేసోళ్లకు ఈ ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్తామని పేర్కొంటున్నారు.
– నల్లగొండ, నవంబర్ 29
మూడు గంటల కరెంటుతో మూడు గాబులు కూడా నిండవు
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నరు. మూడు గంటల కరెంటుతో మూడు గాబులు కూడా నిండవు. మరి పొలాన్ని ఎట్లా తడుపుతం. కాంగ్రెసోళ్లు చెప్పే మాటలన్నీ అబద్దాలే. వాళ్ల మాటలు మేం నమ్మం. తెలంగాణ రాకముందు ఎన్నో కష్టాలు పడ్డం. మా తండాల నీళ్లకు ఎన్నో ఏండ్లు తండ్లాడినం. సరిగ కరెంటు లేక, బోర్లు పోయక నాకున్న మూడెకరాల భూమి పడావు పెట్టిన. అప్పు చేసి పొలం నాటినా చేతికొచ్చే కాడికి కరెంటు సక్కగ రాక ఎండిపోయి నష్టపోయినం. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ సారు 24 గంటల కరెంటు ఇస్తున్నడు. రైతుబంధు డబ్బులతో పొలాన్ని సాగుచేస్తున్నం. నీరు కూడా ఫుల్‌గా ఉంది. బోర్లు మంచిగా పోస్తున్నయ్. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ వాళ్లు వచ్చి 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకుంటే మూడు గంటల విద్యుత్ చాలంటూ చెబుతున్నరు. కొద్దిపాటి పొలానికి అంత పెద్ద మోటరు ఎందుకు. వాళ్లు చెబుతున్న మాటలన్నీ ఉత్తవే. సీఎం కేసీఆర్ సారు చేస్తున్నదే మంచిగుంది. రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు లేవు. మళ్లీ ఆయనే సీఎం కావాలి.
-లావూరి పాంజ్యా, రైతు, వాచ్యాతండా, దామరచర్ల మండలం, నల్లగొండ జిల్లా
ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతే రేవంత్‌రెడ్డి కొనిస్తడా
వ్యవసాయానికి 10 హెచ్‌పీ మోటరు పెట్టుకుంటే మూడు గంటల కరెంట్ సరిపోద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నడు. రైతులందరూ 10 హెచ్‌పీ మోటరు పెడితే లోడు తట్టుకోలేక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రేవంత్‌రెడ్డి కొనిస్తాడ. ఒకో ట్రాన్స్ఫార్మర్ కింద నాలుగు నుంచి ఐదు 3 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే లోడ్ పడదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు అన్నట్లు 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే ఇద్దరు రైతులకు ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాల్సి వస్తది. అలా కాకుంటే ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎవరు కొనిస్తరు. 10 హెచ్‌పీ మోటర్లు కొనాలంటే లక్షకు పైగానే ఖర్చు అవుతుంది. అంత పెద్ద మోటరు పెడితే భూమి లోపల నీరంతా అయిపోద్ది. మళ్లీ ఊరడానికి చాలా సమయం పడుతుంది. అప్పటివరకు పంటలు ఎండిపోతయ్. రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై అసలు అవగాహన లేక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నడు. సీఎం కేసీఆర్ స్వయాన రైతు కాబట్టే రైతుల బాధలు అర్థం చేసుకొని 24 గంటల కరెంట్ ఇస్తున్నరు. పంట పెట్టుబడి ఇస్తున్నడు. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ వాళ్లు చెప్పే మాయ మాటలు నమ్మే స్థితిలో రైతులు లేరు. మేమంతా బీఆర్ఎస్కే మద్దతిస్తాం.
– కాటబోయిన శంకర్, దామెర, నాంపల్లి మండలం
సాగుకు మూడుగంటల కరెంట్ సరిపోదు
కాంగ్రెస్ వాళ్లు ఇస్తామన్న 3 గంటల కరెంట్ సాగుకు సరిపోదు. 3 గంటలతో మూల కూడా తడువదు. రైతులు 10 హెచ్‌పీ మోటర్లు కొనాలంటే లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. మళ్లీ అప్పుల పాలు కావాల్సిందే. గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం అనేక కష్టాలు పడ్డాం. రాత్రి, పగలు పనులు మానుకొని కరెంటు కోసం పొలాల వద్దే ఎదురు చూశాం. ఇప్పుడు సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో మా భూముల్లో అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నాం. పుష్కలంగా నీళ్లు అందుతుండడంతో రెండు కార్లు పండించుకుంటున్నం. ఇట్లా గంటల కరెంటిచ్చి రైతులను ఇబ్బందులు పెట్టే కాంగ్రెస్ మాకు అక్కరలేదు. రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఓటువేసి గెలిపించుకుంటం.
– ఐతగోని కృష్ణ, కొప్పోలు, గుర్రంపోడు మండలం
10 హెచ్‌పీ మోటర్లు పెట్టడం సాధ్యంకాదు
వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ సరిపోద్ది. రైతులంతా 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నడు. మూడు గంటల కరెంటు చాలని ఆయన చెబితే సరిపోద్దా.. రైతులను అడిగితే తెలుసుద్ది.. ఎంత కరెంట్ ఉంటే ఎంత నీళ్లు వస్తయనేది. 10 హెచ్‌పీ మోటర్లు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టువాల్నో వాళ్లే చెప్పాలి. 10 హెచ్‌పీ మోటరు ఎట్లుంటదో మాకు తెల్వదు. 3,5 హెచ్‌పీ మోటర్లతోనే సాగు చేస్తున్నం. కాంగ్రెస్ వాళ్లు రైతులపై పగబట్టినట్లు మాట్లాడడం వాళ్లకే మంచిది కాదు. గతంల కూడా కరెంటు కోసం అవస్థలు పడ్డం. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో రెండు పంటలు పండించుకొని మూడు పూటలా తింటున్నం. ఉచిత కరెంటు, రైతుబంధు ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే మాకు కావాలి. మళ్లీ కాంగ్రెసోళ్లను తీసుకొచ్చి మా నెత్తిన పెట్టుకొని బాధపడలేం.
-రమావత్ బాలు, రైతు, కాకునూరితండా, చందంపేట మండలం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయం కుప్పకూలిపోతది
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయం కుప్పకూలిపోతది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో సాగుకు ఢోకా లేకుండాపోయింది. పెట్టుబడిసాయంగా ఎకరానికి రూ.10వేలు అందిస్తుండడంతో అప్పులు లేక రైతు ఆత్మహత్యలు లేకుండా పోయాయి. కానీ గతంలో సరిగా కరెంటు, నీళ్లు ఇవ్వక రైతులను నానా అవస్థలు పెట్టిన కాంగ్రెస్ వాళ్లు.. ఇప్పుడు మళ్లీ మూడు గంటల కరెంటు సరిపోద్ది. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలి అంటూ మాట్లాడుతున్నరు. అసలు గతంలోనే సాగును పట్టించుకోని కాంగ్రెస్ నాయకులను ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. వాళ్లిచ్చే మూడు గంటల కరెంటుతో సాగు ముందుకు సాగే పరిస్థితి ఉండదు. అందుకే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే రైతులు బతుకుతరు.
– బొలిశెట్టి వెంకటేశ్వర్లు, రైతు, చెన్నాయిపాలెం, త్రిపురారం
మూడు గంటల కరెంట్‌తో అరెకరం కూడా పారదు
కాంగ్రెసోళ్లు చెప్పే మూడు గంటల కరెంటుతో అరెకరం కూడా పారదు. మిగతా పంటలు ఎండిపోయి రైతులు నష్టపోవాల్సి వస్తది. రైతులంతా 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లు వాడుతున్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంట్‌తో మేము సాగు చేసిన పొలానికి సరిపోను నీళ్లు అందుతున్నయ్. రైతుబంధు కూడా ఇస్తుండడంతో రైతులంతా సంతోషంగా సాగు చేసుకుంటున్నం. గతంల కాంగ్రెస్ పాలనలో ఆరుగంటల కరెంట్ ఇస్తే ఇస్తే అది ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు పోయేదో తెలికుండే. వచ్చిపోయే కరెంటుతో సగం పొలం కూడా పారేది కాదు. పంటలు ఎండిపోయి పెట్టుబడికి చేసిన అప్పులు తీరక ఇబ్బందులు పడ్డం. తెలంగాణ వచ్చినంక కరెంటు, నీళ్లకు ఇబ్బందులు లేకుండా పోయాయి. అందుకనే 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్‌కే ఓటు వేసి గెలిపించుకుంటం.
– ఆంగోతు శ్రీరామ్, రైతు, తూటిపేటతండా, తిరుమలగిరి(సాగర్)
మళ్లీ కాంగ్రెస్ వస్తే రైతుల బతుకు ఆగమే
నాకున్న నాలుగెకరాల పొలంలో వరిసాగు చేస్తున్న. సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు సాయం ఇస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు పంటలు పండించుకుంటున్నం. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు సాగుకు మూడు గంటల కరెంటు చాలు అంటూ కొత్తగా మాట్లాడుతున్నరు. గతంలో వాళ్లు ఆరు గంటల కరెంటే సరిగ ఇయ్యక పోయేది. ఇప్పుడు మూడు గంటల కరెంటుతో సాగు చేయడం సాధ్యమేనా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు ఎప్పుడు వస్తదో తెలియక పొలం కాడనే కాపలా ఉండేటోళ్లం. మా గ్రామంలో చాలా మంది రాత్రి కరెంట్ బారిన పడి సచ్చిపోయినరు. ఇప్పుడు 24 గంటల కరెంటుతో ఎప్పుడు తీరిక ఉంటే అప్పుడు మోటరు పెట్టి నీళ్లు పారిస్తున్నం. ఈ పదేండ్లు కరెంట్ విషయంలో మాకేం ఇబ్బంది కాలే. మళ్లీ కాంగ్రెస్ వస్తే మాత్రం రైతులకు కష్టాలు తప్పవు. ఇది రైతులందరికీ తెలుసు అందుకే వాళ్లంతా బీఆర్ఎస్కే ఓటేస్తరు.
-మహ్మద్ హుస్సేన్, రైతు, కాచారం, గుర్రంపోడు మండలం
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

