ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు క్రీడలను నిర్లక్ష్యం చేసి మనలో చైతన్యాన్ని దూరం చేశారని, స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు క్రీడలకు ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు బుధవారం ముగియగా విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలతోనే చైతన్యం వస్తుందని, గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నదన్నారు. క్రీడలు భవిష్యత్‌పై ఆశను కలిగించి ఓటమి నుంచి విజయం సాధించేందుకు దోహద పడుతాయని తెలిపారు. సీఎం కప్ క్రీడా పోటీలు యువతీ యువకుల్ల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాయని చెప్పారు. కాగా, జిల్లా స్థాయిలో వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఈ నెల 28 నుంచి 31వరకు జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో తలపడనున్నారు.
సూర్యాపేటటౌన్, మే 24 : క్రీడలతో చైతన్యం వస్తుందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో 30 ఏండ్లు క్రీడలను నిర్లక్ష్యం చేసి మనల్ని క్రీడలకు దూరం చేసి మనలో చైతన్యాన్ని నశింపజేశారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులు, షీల్డులు అందజేసి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో క్రీడాభివృద్ధికి చేయాల్సింది చాలానే ఉందన్నారు.
ఉమ్మడి పాలనలో కార్పొరేట్ విద్య మోజులో పడి క్రీడలపై ఆసక్తి తగ్గించి చదువే అన్నింటికీ ఆధారమని చెప్పి క్రీడలకు దూరం చేసి చైతన్యాన్ని నశింపజేశారన్నారు. క్రీడలు భవిష్యత్‌పై ఆశను కలిగించి ఓటమి నుంచి విజయం సాధించేలా దోహదం చేస్తాయన్నారు. ఒక్కరు సాధించలేనిది నలుగురు కలిసి సాధించవచ్చని, అలాంటి టీమ్ స్పిరిట్ క్రీడలతోనే సాధ్యమవుతుందన్నారు. క్రీడలు జీవితానికి కావాల్సిన మెళకువలను నేర్పిస్తాయని, అది మంచి సమాజానికి దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని, ప్రతి గ్రామంలో క్రీడామైదానాలు ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మట్టిలోని మాణిక్యాలను వెలికితీసి వారిలోని ప్రతిభను ప్రోత్సహించేందుకే ఈ సీఎం కప్ క్రీడలు నిర్వహించినట్లు చెప్పారు.
వారం రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలు యువతీ యువకుల్ల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాయన్నారు. సీఎం కప్ క్రీడలను మొత్తం ఒకే దగ్గర నిర్వహించకుండా నాలుగు చోట్ల నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, త్వరలోనే సూర్యాపేటలో క్రీడాప్రాంగణం, అకాడమీ ఏర్పాటు చేసి అన్ని క్రీడలు ఒకే చోట నిర్వహించుకునేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలో ఎందరో ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులున్నారని, వారు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రత్యేక తర్పీదు కల్పిస్తామన్నారు. మన క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తెచ్చేలా కృషి చేస్తానన్నారు. సూర్యాపేట జిల్లాకు అర్చరీ క్రీడను పరిచయం చేశామన్నారు. క్రీడల్లో గెలుపొందిన వారు సంతోషంగా ఉంటారని, ఓడిన వారు కూడా బాధపడకుండా మరో ప్రయత్నం చేసి విజయం సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ప్రత్యేక తర్పీదు ఇస్తున్న పీఈటీలకు సొంత నిధులతో త్వరలో డ్రస్‌లు అందజేస్తానని తెలిపారు.
రాష్ట్ర స్థాయికి 137 మంది క్రీడాకారులు..
సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన జిల్లా స్థాయి సీఎం కప్ పోటీల్లో ఆయా క్రీడల్లో 222 మంది క్రీడాకారులు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో 137మంది క్రీడాకారులను ఈ నెల 27 నుంచి 31వరకు హైదారబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నారు. బ్యాడ్మింటన్(బాలురు) ప్రథమ కె.ఉత్తేజ్కుమార్(సూర్యాపేట), ద్వితీయ షారూఖ్(కోదాడ), డబుల్స్‌లో ప్రథమ షారూఖ్, రవీంద్ర(కోదాడ), ద్వితీయ వెంకటేశ్, రమేశ్(సూర్యాపేట), బాలికల సింగిల్స్ జె.ఎల్.ఎన్.కుమారి(సూర్యాపేట), బి.ప్రసన్న(మునగాల), డబుల్స్ డి.ప్రసన్న, జి.మానస(మునగాల), బాలికల కబడ్డీ ప్రథమ నేరేడుచర్ల, ద్వితీయ మేళ్లచెర్వు, బాలుర కబడ్డీ ప్రథమ నేరేడుచర్ల, ద్వితీయ మునగాల, హ్యాండ్‌బాల్ బాలుర ప్రథమ మేళ్లచెర్వు, బాలికలు ప్రథమ హుజూర్నగర్, బాలుర అథ్లెటిక్స్ 100 మీటర్ల స్ప్రింట్ ప్రథమ డి.దినేశ్‌కార్తీక్(సూర్యాపేట), ద్వితీయ జి.వంశీనాయక్, 400 మీటర్ల రన్నింగ్ ఎస్.గోపీచంద్(నూతనకల్), బి.గోపీచంద్(మునగాల), లాంగ్‌జంప్ వి.స్వామి నూతనకల్, డి.ప్రశాంత్ తుంగతుర్తి, షాట్‌ఫుట్ సందీప్‌రెడ్డి చిలుకూరు, టి.మల్లయ్య చివ్వెంల,
బాలికల అథ్లెటిక్స్ 100 మీటర్ల స్ప్రింట్ డి.కల్యాణి నూతనకల్, సీహెచ్.శైలజ హుజూర్నగర్, 400 మీటర్ల రన్నింగ్ ఎం.ఉమ నూతనకల్, డి.కల్యాణి నూతనకల్, లాంగ్‌జంప్ సీహెచ్.శైలజ హుజూర్నగర్, పి.మౌనిక నూతనకల్, షాట్‌ఫుట్ పి.మౌనిక నూతనకల్, ఆర్.ప్రియాంక సూర్యాపేట, వాలీబాల్ బాలికల ప్రథమ అనంతగిరి, ద్వితీయ గరిడేపల్లి, బాలుర వాలీబాల్ ప్రథమ నేరేడుచర్ల, ద్వితీయ సూర్యాపేట, ఖోఖో బాలికలు ప్రథమ తుంగతుర్తి, ద్వితీయ సూర్యాపేట, బాలుర ఖోఖో ప్రథమ తుంగతుర్తి, ద్వితీయ మునగాల, బాస్కెట్‌బాల్ బాలికలు ప్రథమ దొండపాడు, ద్వితీయ కోదాడ, బాస్కెట్‌బాల్ బాలుర ప్రథమ కోదాడ, ద్వితీయ సూర్యాపేట గెలుపొందాయి. జడ్పీ సీఈఓ సురేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, జిల్లా క్రీడల అధికారి వెంకట్‌రెడ్డి, డీఎస్పీ నాగభూషణం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కమిషనర్ పి.రామాంజులరెడ్డి, కౌన్సిలర్ తాహేర్‌పాషా, జడ్పీటీసీ జీడి భిక్షం, ఎస్జీఎఫ్ సెక్రటరీ అజాంబాబా, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి సుందరీకరణ పనుల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను స్విచ్ ఆన్ చేసి మంత్రి ప్రారంభించారు.
ప్రభుత్వమే పోటీలు నిర్వహించడం మంచి విషయం
సీఎం కప్ కబడ్డీ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. గతంలో ఏ టోర్నమెంట్ నిర్వహించినా మండలం వరకే ఉండేవి. ఆ పోటీల్లో గెలుపొందితే మండల స్థాయి వరకే గుర్తింపు వచ్చేది. కానీ, ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో గెలిస్తే రాష్ట్ర స్థాయిలో పేరు వస్తుంది. ప్రభుత్వమే పోటీలు నిర్వహించడం అభినందనీయం.
-నునావత్ కవిత, కబడ్డీ క్రీడాకారిణి, తుర్కపల్లి మండలం
గతంలో ఇలాంటి పోటీలు నిర్వహించలేదు
సీఎం కప్ క్రీడా పోటీల్లో ఇష్టంతో పాల్గొన్నా. పోటీల్లో గెలుపోటములు సహజం. కానీ, పోటీల్లో పాల్గొనడమే గొప్ప. గతంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొనడం కంటే సీఎం కప్ పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. గతంలో ఏనాడూ ఇలాంటి పోటీలు నిర్వహించలేదు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-సీహెచ్ వెంకటేశ్‌యాదవ్, కబడ్డీ క్రీడాకారుడు, కొలనుపాక, ఆలేరు మండలం
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చేలా సీఎం కప్ పోటీలు నిర్వహించడం సంతోషకరం. ఇలాంటి పోటీల్లో నాలాంటి వారికి అవకాశం కల్పించి రాష్ట్రస్థాయికి పంపేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్ని టోర్నమెంట్లు నిర్వహించినా బహుమతుల వరకే ఉండేది. కానీ, సీఎం కప్ పోటీలతో రాష్ట్ర స్థాయికి చేరుకోవడంతోపాటు క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించేలా నిర్వహించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-కె.భానుచందర్, కబడ్డీ క్రీడాకారుడు, జూలూరు, భూదాన్‌పోచంపల్లి మండలం
ఆటంకాలు లేకుండా క్రీడల నిర్వహణ
నేను ఎన్నో క్రీడల నిర్వహణలో పాల్గొన్నా. ప్రతిచోట క్రీడాకారులు ఏదో ఒక విషయంలో ఇబ్బందులకు గురయ్యేవారు. ఏఓ ఒక ఆటంకం జరిగేది. కానీ, సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడల్లో క్రీడాకారులు ఎంతో ఆనందంగా పాల్గొన్నారంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. క్రీడలను సమర్థవంతంగా నిర్వహించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-సన్నీళ్ల యాదయ్య, పీఈటీ, గరిడేపల్లి