యాదాద్రి భువనగిరి, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తో అంగన్వాడీలకు గుడ్లు బంద్ అయ్యాయి. ప్రభుత్వ తీరుతో విసుగు చెందిన కాంట్రాక్టర్లు ఎగ్స్ సరఫరా నిలిపివేశారు. తొమ్మిది నెలలుగా బిల్లులు రాకపోవడంతో గుడ్లు పంపిణీ చేయడంలేదు. దీంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు గుడ్లు అందని పరిస్థితి నెలకొంది.
ఐదు రోజులుగా బంద్..
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, భువనగిరి, మోత్కూ రు, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి కింద 901 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాలకు గుడ్ల సరఫరా నిలిచిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సైతం గుడ్ల పంపిణీ నిలిపేశారు. కోడి గుడ్లు కేంద్రాలకు చేరడంలేదు. నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అనేక అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, మహిళలకు ఇప్పటికీ ఎగ్స్ అందడంలేదు. టీచర్లు సైతం ఇదే విషయాన్ని చిన్నారులు, మహిళలకు స్పష్టం చేశారు. కేంద్రాల నిర్వహణ కష్టతరంగా మారడంతోపాటు పౌష్టికాహారంపై ప్రభావం పడుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తొమ్మిది నెలలుగా బిల్లులు పెండింగ్
అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లలో గుడ్ల సరఫరాకు టెండర్ ద్వారా కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. అయితే సదరు కాంట్రాక్టర్లకు నెలనెలా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఏకంగా 9 నెలలుగా బకాయిలు విడుదల చేయడంలేదు. ఎంతో కాలంగా నిధు ల విడుదల కోసం నిరీక్షిస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది. దీంతో బిల్లులు క్లియ ర్ కాకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. యాదాద్రిలో నెలకు 35లక్షల వరకు బిల్లులు చెల్లించాలి. ఈ లెక్కన తొమ్మిది నెలలకు 3.15 కోట్ల వరకు నిధులు పెండింగ్లో ఉన్నాయి. పెట్టిన పెట్టుబడి రాకపోవగా.. అప్పులకు మిత్తీలు పెరిగిపోతున్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. వెంటనే బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
50వేలకు పైగా చిన్నారులు, మహిళలపై ప్రభావం
చిన్నారులు, మహిళల్లో పోషకాహార లోప సమస్యను పరిష్కరించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజూ అంగన్వాడీ కేంద్రం ద్వారా ఒక పూట పూర్తి భోజనం, 200 మిల్లీమీటర్ల పాలు, ఒక గుడ్డు అందించేవారు. 3 నుంచి 6 ఏండ్ల పిల్లలకు ఒక పూట భోజనం స్నాక్స్, ఒక గుడ్డు ఇవ్వాలి. 7 నెలల నుంచి 9 ఏండ్ల చిన్నారులకు నెలకు 16 గుడ్లతోపాటు బాలామృతం ప్యాకెట్లు ఇంటికి ఇచ్చేవారు. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి పునాది వేయడం, శిశు మరణాలు, అనారోగ్యం, పాఠశాల డ్రాపౌట్ల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకునేది. అయితే ప్రస్తుతం జిల్లాలో 4736 మంది గర్భిణులు, 2887 మంది బాలింతలు ఉన్నారు. వీరే కాకుండా 23,746 మంది మూడేండ్లలోపు చిన్నారులు, 3 నుంచి 6 సంవత్సరాల మధ్య 19,836 మంది పిల్లలు ఉన్నారు. వీరికి గుడ్లు అందకపోవడంతో సుమారు 50 వేల మంది చిన్నారులు, మహిళలపై ప్రభావం పడుతున్నది.
ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలకు రో జూ అంగన్వాడీల్లో ఒక పూట భోజనం, పాలు, గుడ్డు అందించేవారు. 3 నుంచి 6 ఏండ్ల పిల్లలకు ఒక పూట భోజ నం స్నాక్స్, గుడ్డు ఇచ్చేవారు. 7 నెలల నుంచి 9 ఏండ్ల చిన్నారులకు నెలకు 16 గుడ్లతోపాటు బాలామృతం ఇచ్చేవారు. ప్రస్తుత జిల్లాలోని 4,736 మంది గర్భిణులు, 2,887 మంది బాలింతలు, 23,746 మంది చిన్నారులు, 3-6 ఏండ్ల మధ్య 19,836 మంది పిల్ల లకు గుడ్లు అందకపోవడంతో అవ స్థలు పడుతున్నారు.