నేటితో ప్రచారం పరిసమాప్తం
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48గంటల ముందు ప్రచారాన్ని బంద్ చేయాల్సి ఉంటుంది.
- సాయంత్రం 4గంటల నుంచి అంతా గప్‌చుప్
- హోరాహోరీగా సాగిన ప్రచారం
- పటిష్ట యంత్రాంగంతో బీఆర్ఎస్ దూకుడు
- ప్రతి ఓటర్ తలుపుతట్టిన గులాబీ శ్రేణులు
- కాంగ్రెస్ అభ్యర్థికి హ్యాండిస్తున్న కీలక నేతలు
- పోలింగ్ ఏర్పాట్లతో అధికారులు సన్నద్ధం
- రేపు డిస్ట్రిబ్యూటర్ కేంద్రాల నుంచి పోలింగ్ సెంటర్లకు సిబ్బంది
- 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్
నల్లగొండ ప్రతినిధి, మే 24 (నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి సరిగ్గా 48గంటల ముందు ప్రచారాన్ని బంద్ చేయాల్సి ఉంటుంది. దాంతో నేటి సాయంత్రం నాలుగు గంటలతో మైకులు మూగబోయి జెండాలు పక్కకుపోయి అంతా గప్‌చుప్ కానుంది.
ఇక ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్, పోలింగ్ ప్రక్రియ, ఏజెంట్ల నియామకంపై అభ్యర్థులు పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. ఆదివారం ఉదయం నుంచి నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లా కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూటరీ సెంటర్లలో పోలింగ్ సిబ్బందికి విధులు కేటాయిస్తూ సామాగ్రిని కూడా అందజేయనున్నారు. ఈ నెల 27న ఉదయం 8గంటల నుంచి పోలింగ్ మొదలై సాయంత్రం నాలుగు గంటలకు ముగియనుంది. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే దాదాపు పూర్తి కావచ్చాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వీటిని పర్యవేక్షిస్తున్నారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఇన్నాళ్లు ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారాన్ని సాగించారు. ఓటర్ల నమోదు నాటి నుంచే మండలి ఎన్నికల హడావుడి మొదలుకాగా బీఆర్ఎస్తో పాటు మరికొందరు అభ్యర్థులు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉండడానికి ప్రయత్నించారు. చివరగా నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రతి అభ్యర్థి ప్రచారంపైనే పూర్తిస్థాయిలో కేంద్రీకరించారు. హోరాహోరీ ఎన్నికల ప్రచారంతో వాతావారణం పూర్తిగా వేడెక్కింది.
ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరోసారి ప్రజలకు వివరిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మోసాలను ఎండగడుతూ ప్రచారాన్ని నిర్వహించింది. మిగతా అభ్యర్థులు ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో పోలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్ని కోణాల్లోనూ మెరుగైన అభ్యర్థిగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. దాంతో ప్రధాన అభ్యర్థుల్లో రాకేశ్‌రెడ్డి వ్యక్తిత్వం, ఉన్నత విద్య,ఉద్యోగాలు, వ్యక్తిగత వ్యవహారశైలి, విషయ పరిజ్ఞానం,
ప్రజా సమస్యలపై విస్తృత అవగాహన, స్పష్టతకు పట్టభద్రుల్లో మంచి ఆదరణ లభించింది ఓ వైపు కాంగ్రెస్ పార్టీ అసత్యారోపణలను తిప్పికొడుతూనే మరోవైపు కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దిన వైనాన్ని వివరిస్తూ ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. అభ్యర్థి రాకేశ్‌రెడ్డి కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని చుట్టి వస్తూ సుడిగాలి పర్యటనలు చేశారు. జిల్లా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మర్లు, రాష్ట్ర, జిల్లా నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ స్థాయి నేతల వరకు అంతా ఉప ఎన్నికల ప్రచారంలో భాగస్వాములయ్యారు.
రేపు డిస్ట్రిబ్యూటరీ కేంద్రాల నుంచి..
శనివారం సాయంత్రం నాలుగు గంటలతో ప్రచారానికి తెరపడనుండడంతో అభ్యర్థులంతా పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టనున్నారు. అధికారులు మాత్రం పోలింగ్ ఏర్పాట్లపై కేంద్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ప్రకటించిన అధికారులు సిబ్బంది నియామాకం కూడా పూర్తి చేశారు. వీరందరూ ఆదివారం ఉదయానికే ఆయా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
12 జిల్లా కేంద్రాల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల సమక్షంలో వీరికి ర్యాండమైజ్ పద్ధతిలో పోలింగ్ కేంద్రాలను కేటాయించనున్నారు. కేటాయించిన విధంగా వీరికి పోలింగ్ సామగ్రిని అందజేసి విధులు నిర్వర్తించాల్సిన ప్రాంతాలకు పంపించనున్నారు. రాత్రికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని 27న ఉదయం 6గంటల వరకే సర్వం సిద్ధంగా ఉండనున్నారు. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన పోలింగ్ ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
ఇప్పటికే అభ్యర్థుల సంఖ్య 52 ఉండడంతో అందుకు అనుగుణంగా బ్యాలెట్ బాక్స్‌లను, బ్యాలెట్ పేపర్లను, ఇతర సామగ్రిని ఆయా జిల్లా కేంద్రాలకు చేరవేశారు. మరోవైపు పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన పోలిస్ బందోబస్తును కూడా సిద్ధం చేశారు. వీరంతా రేపటి నుంచి పూర్తి స్థాయిలో విధుల్లోకి వెళ్లనున్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ప్రకటించారు.
పైపైనే కాంగ్రెస్ నేతల ప్రచారం
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గతంలో చేసిన ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, తిట్ల పురాణాలతో ఆ పార్టీ ముఖ్యులు ప్రచారానికి ముఖం చాటేసినట్లు చర్చ జరుగుతున్నది. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక్కరోజూ కూడా మల్లన్నకు మద్దతుగా ప్రచారానికి రాలేదు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా దూరంగా ఉన్నారు. జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు కూడా పైపైనే ప్రచారానికి పరిమితమైనట్లు సమాచారం.
ఇక ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రచారం సంగతేమో గానీ… కనీసం తీన్మార్ మల్లన్నను కలిసేందుకు కూడా విముఖత చూపినట్లు సమాచారం. ఇట్లా మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని కీలక నేతలంతా అంటీముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతున్నది. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మద్దతుగా బీజేపీ రాష్ట్ర నేతలు ప్రచారం చేస్తున్నా, ప్రచార ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తున్నది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

