ఆదివారం 24 మే 2020
Nalgonda - Feb 11, 2020 , 03:02:32

‘సహకార’ బరిలో1023 మంది అభ్యర్థులు

‘సహకార’ బరిలో1023 మంది అభ్యర్థులు

నీలగిరి:  రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణకు  ఈ నెల 6న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 6 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించి 9న పరిశీలన చేసి 10న ఉపసంహరణలు నిర్వహించారు. మొత్తం 42 సహకార సంఘాల పరిధిలోని 545 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా 175 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 370 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సహకార అధికారులు కసరత్తులు చేస్తున్నారు. 

370 స్థానాలకు 1023 మంది పోటీ..

జిల్లా వ్యాప్తంగా 42 సహకార సంఘాల పరిధిలోని 545 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా 2189 మంది నామినేషన్లు దాఖలు చేయగా 185 నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. సోమవారం ఉపసంహరణల గడువు ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 981 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా 1023 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరికి ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. నాలుగు రోజుల పాటు ప్రచారం నిర్వహించి ఈ నెల 15న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు నిర్వహించి అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. 

11 చైర్మన్‌ స్థానాలు ఏకగ్రీవం...

జిల్లా వ్యాప్తంగా 42 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా ప్రతి సంఘానికి చైర్మన్‌ అయ్యేందుకు అవసరమైన సంఖ్యకు అనుగుణంగా 11 సంఘాలలో డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. శాలిగౌరారంలో 13 స్థానాలకు 12, గుండ్రాంపల్లిలో 13 స్థానాలకు 7, నార్కట్‌పల్లిలో 13కు 11, ఎల్లారెడ్డిగూడెంలో 12కు 8, సల్కునూర్‌లో 13కు 12, ఆలగడపలో 13కు 13, దామరచర్లలో 13కు 10, బాబుసాయిపేటలో 13కు 11, వెనిగండ్లలో 13కు 13, పెద్దవూరలో 13కు 11, గుర్రంపోడులో 13కు 10 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.


logo