శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 03, 2020 , 00:12:35

చెన్నకేశవస్వామి గోవింద.. గోవిందా..

చెన్నకేశవస్వామి గోవింద.. గోవిందా..
  • నేత్రానందం రథోత్సవం
  • వైభవంగా చెన్నకేశవుడికి శకటోత్సవం
  • భారీగా తరలొచ్చిన భక్తజనం
  • పాలెం వెంకన్న రథోత్సవం, ఎడ్లబండ్ల ఊరేగింపు

జడ్చర్ల రూరల్‌ : మన్నించి మమ్మల్ని మంచిగా చూడు కలియుగ దైవమా అంటు లక్ష్మీచెన్నకేశవ స్వామికి రైతులు ఎద్దుల బండ్లతో తమ మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని గంగాపూర్‌లో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి జాతరలో భాగంగా ఆదివారం రైతులు స్వామివారికి శకటోత్సవం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఏటా తొలిసారిగా వచ్చే లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో జిల్లానుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు, రైతులు వచ్చి దాసాంగాలు, అవులు, దూడలను స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకుని ఈ ఏడాది వ్యవసాయం అనుకూలంగా ఉండాలని పంటలు బాగా పండాలని మూడు రోజులపాటు పూలతేరు, పెద్ద తేరు, శకటోత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ ఏడాది మరకరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్న సందర్భంగా దేవదాయ శాఖ, ఆలయ ధర్మకర్తల మండలి, వేదపండితులు చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిండంతోపాటు స్వామివారి ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలైన పూలతేరును శుక్రవారం, పెద్దతేరును రథసప్తమి రోజు శనివారం, శకటోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. 


రథసప్తమి సందర్భంగా ఒక్క శనివారం రోజు మాత్రమే స్వామివారిని దాదాపు లక్ష వరకు భక్తులు దర్శించుకున్నట్లు గ్రామస్తులు అంటున్నారు. శకటోత్సవం సందర్భంగా భక్తులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ వాహనాలకు, బండ్లకు తీరోక్క రకంగా అలంకరణ చేయడంతోపాటు కోయల వేశధారణలతో డోలు వాయిస్తు వివిధ విన్యాసాలతో ముందుకు సాగుతూ అందరిని ఆకుట్టుకున్నారు. శకటోత్సవం సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి, దేవదాయ శాఖ వారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.


అశ్వవాహనంపై పాలెం వెంకన్న

బిజినేపల్లి : మండలంలోని పాలెం అలువేలుమంగ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం రాత్రి వెంకన్న రథోత్సవం కనులపండువగా నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. రథసప్తమి సందర్భంగా ఏటా వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే తేరు లాగుట కార్యక్రమాన్ని చేశారు. రకరకాల పూలు, పచ్చటి తోరణాలతో అలంకరించి విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. గోవింద.. గోవిందా.. అంటూ రథాన్ని లాగుతూ ఆలయం నుంచి పురాతన గ్రామంలోని రచ్చకట్ట వరకు ఈ రథోత్సవ కార్యక్రమాన్ని అర్చకుల వేద మంత్రాలు, డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాహలం మధ్య నిర్వహించారు. 


అంతకముందు ఆలయ ప్రాంగణంలో మహిళల కోలాటాలు, బతుకమ్మ భజన కార్యక్రమాలు, భక్తి గేయాలను ఆలపించారు. స్వామివారి, అమ్మవార్ల దర్శనానికి బారులుతీరారు. ఆలయ పరిసర ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆదివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యారాధన, ప్రబంధ పారాయణం, ఉద్దాల మహోత్సవం నిర్వహించారు. రాత్రివేళలో హో మం, బలిహారణ, స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, శకటోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్‌ నర్సింహస్వామి, ఈవో ఆంజనేయులు, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచ్‌ లావణ్య, నాగరాజు, భక్తులు పాల్గొన్నారు.logo