గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 01, 2020 , 01:17:34

సహకార కసరత్తు

సహకార కసరత్తు
  • ఊపందుకున్న సహకార ఎన్నికల ఏర్పాట్లు
  • సమాయాత్తమవుతున్న రాజకీయ పార్టీలు
  • ఓటర్ల జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు
  • 3విండో చైర్మన్లు, 299డైరెక్టర్ల పదవులు
  • చైర్మన్లకు వర్తించని రిజర్వేషన్లు
  • రెండు రోజుల్లో డైరెక్టర్ల రిజర్వేషన్లు

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని 23సింగిల్‌ విండోలకు ఈనెల 15న ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని ఆయా విండోలకు పొడిగించిన కాల పరిమితి ఈనెల 4వ తేదీన ముగుస్తుండగా ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ రైతన్నల్లో రాజకీయ కాకను రేపింది. జిల్లాలోని 23విండోల చైర్మన్లతో పాటుగా 299విండోల్లోని డైరెక్టర్ల పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ప్రతి విండో పరిధిలో 13డైరెక్టర్ల పదవులకు పోలింగ్‌ జరుగుతుంది. పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి పార్టీలు బలపర్చిన అభ్యర్థులు సింగిల్‌ విండో చైర్మన్లుగా ఎన్నికవుతారు.  చివరి సారిగా 2013లో సమైక్య రాష్ట్రంలో ఈ ఎన్నికలు జరిగాయి. స్వరాష్ట్రం సాధించాక తొలిసారిగా రైతన్నల ఎన్నికలు జరగబోతుండటం గమనార్హం. ప్రతి విండోల పరిధిలో 13డైరెక్టర్ల పదవులు ఉంటాయి. ఈ పదవులకు మరో రెండు రోజుల్లో అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇందులో ఎస్సీలకు 2పదవులు, బీసీలకు 2పదవులు, 1స్థానం ఎస్టీకి, 1స్థానం ఓసీ మహిళకు కేటాయించడం జరుగుతుంది. మిగతా స్థానాలన్నీ జనరల్‌గా ఉంటాయి. ఈ డైరెక్టర్ల పదవులు విండోల వారీగా రిజర్వేషన్ల ఖరారు చేపట్టాక పోటీపై ఆయా పార్టీలు, రైతన్నలు ఓ అంచనాకు రానున్నారు. జిల్లాలోని 23విండోల పరిధిలో 1.10లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఏడేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో గతంలో మృతి చెందిన ఓటర్లను తొలగించడం, పలు అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ జాబితా కూడా రెండు రోజుల్లో పూర్తి కానుంది. దీన్ని బట్టి డైరెక్టర్ల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు వీలవుతుంది. దీంతో డైరెక్టర్ల పదవులకు పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు రిజర్వేషన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, ఉప్పునుంతలలాంటి విండోలు అధిక లాభాలతో ఉన్నాయి. ఈ విండోలో చైర్మన్ల పదవులను దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు, ఆశావహులు మక్కువ చూపిస్తున్నారు. రూ.కోట్లల్లో లావాదేవీలు జరుగుతూ అధిక లాభార్జన ఆర్జిస్తున్న ఇలాంటి సంఘాలను కైవసం చేసుకోవడానికి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే చైర్మన్ల పదవులకు మాత్రం ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. డైరెక్టర్లుగా గెలిచిన అభ్యర్థులు తమలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకొంటారు. అయితే ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులను బలపరుస్తాయి. 


దీన్ని బట్టి ఆయా పార్టీల మద్దతుదారులుగా డైరెక్టర్లు ఎన్నికల బరిలో దిగుతారు. ఇలా రైతన్నలు ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నారు. ఇక అధికారులు సైతం ఈనెల 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసే నాటికి ఓటర్ల జాబితాతో పాటుగా రిజర్వేషన్లను పూర్తి చేయనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా జీవో 6ను విడుదల చేసింది. ఇటీవలే కొత్తగా 18సింగిల్‌ విండోలను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 45ను తాజాగా రద్దు చేస్తూ జీఓ 6ను విడుదల చేసింది. దీని ప్రకారం కొత్త విండోల ప్రమేయం లేకుండా గతంలో ఉన్నట్లుగా 23సింగిల్‌ విండోలకు మాత్రమే ఎప్పటిలాగే ఎన్నికలు జరుగుతాయి. ఇక అధికార టీఆర్‌ఎస్‌ ఇటీవలే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సాధించింది. గత ఏడాది నుంచి వరుసగా జరుగుతున్న ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్‌, పరిషత్‌ ఎన్నికల్లో సాధించిన ఫలితాలకు తోడుగా వచ్చిన మున్సిపాలిటీ గెలుపు మాదిరిగానే సింగిల్‌ విండోలనూ కైవసం చేసుకుంటామనే దీమాలో పార్టీ నేతలు, ఆశావహులు ఉన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌లోనూ ఎప్పటిలాగే డైరెక్టర్లకు ఆశావహులు అధికంగానే ఉన్నారు. ఇక కాంగ్రెస్‌, బీజేపీలాంటి పార్టీలు వరుస ఓటములతో కుదేలుకాగా అభ్యర్థులను వెతికే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం మీద విండో ఎన్నికలు మరో రెండు, మూడు రోజుల్లో మరింత వేడెక్కనున్నాయి.


రెండు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు 

జిల్లాలోని 23సింగిల్‌ విండోల్లోని 299డైరెక్టర్ల పదవులకు ఈనెల 15న ఎన్నికలు జరుగుతాయి. ఇందుకోసం ఓటర్ల జాబితాతో పాటు రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టాం. మరో రెండు,మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేపడతాం. ప్రతి విండోలో 13డైరెక్టర్ల పదవుల చొప్పున 299డైరెక్టర్ల పదవులు ఉంటాయి. ఈనెల 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరుగుతుంది.

- శ్రీరామ్‌, డీసీవో


logo