‘ఆడికేంది పెద్ద మోతెవరి..’ ఊళ్లల్లో వినిపించే మాట ఇది! కొందరికి పుట్టుకతో ఈ పెద్దరికం వస్తది. ఇంకొందరు బలగం బలంతోని మోతెవరి అనిపించుకుంటరు!గిప్పుడు బుర్రా శివకృష్ణ గిన పెద్ద మోతెవరే! వారసత్వంగా వచ్చిన పేరు కాదిది. సొంతంగా సంపాదించుకున్నది. పోటీ పరీక్షల్లో విఫలమైనఈ యంగ్ డైరెక్టర్.. క్రియేటివ్ ఫీల్డ్‌లో సత్తా చాటి సాధించుకున్న టైటిల్ ఇది. ‘మోతెవరి లవ్‌స్టోరి’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలో తెలంగాణం వినిపిస్తూ.. విన్నర్ అనిపించుకున్న దర్శకుడు బుర్రా శివకృష్ణను ‘జిందగీ’ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
మనిషికి కష్టాలు ఉంటయ్, కన్నీళ్లొస్తయ్. ఆ కష్టాలను తలుచుకుంట ఉంటే.. జీవితం ఆగమైతది. నా జీవితం గిట్ల అట్లనే ఉంటుండె! నిమ్మలం అనేదే లేకుండె! మా ఊరు పేరు సంకెపల్లి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటుంది. మా ప్రాంతానికి గల్ఫ్ కష్టాలు దోస్తులే! మా బాపు (నాన్న) కూడా మేం చిన్నగున్నప్పుడే దుబాయి పోయిండు. అమ్మ ఇంటికాడ బీడీలు చేసుకుంట మమ్మల్ని చూసుకునేది. మా అన్న పోలీస్ జాబ్ కొట్టడంతో నేనుగిన పోలీస్ కావాల్ననుకున్న. ఎంటెక్ చదివినాంక పోలీస్ పరీక్షకు గట్టిగనే ప్రిపేరైన! కానీ, క్వాలిఫై గాలె! మళ్లీ గ్రూప్ 2 కోసం కష్టపడ్డ. అదీ రాలేదు. రెండు పరీక్షల్లో దగ్గరిదాకా వచ్చి.. మిస్సయ్యాను. అప్పటికే దుబాయి నుంచి వచ్చిన మా నాన్నకు ఆరోగ్యం క్షీణించింది. నా చదువు పక్కనపెట్టి నాన్నను చూసుకున్న. ‘నాన్నను మేం చూసుకుంటం.. నువ్వు ఉద్యోగం గురించి ఆలోచించు’ అని మా అన్న చాలాసార్లు చెప్పేటోడు. నాకేమో.. నాన్నను ఇడ్సిపెట్టి పోబుద్ధికాలేదు. నాన్న కన్నా ఏం ఎక్కువ కాదని.. ప్రిపరేషన్ పక్కన పెట్టిన.
శ్రీకాంత్ స్నేహంతోనే..
‘మై విలేజ్ షో’ శ్రీకాంత్, నేను బీటెక్ చేసే రోజుల్లోనే మంచి దోస్తులం. ఆ స్నేహమే నాకు లంబాడిపల్లెను పరిచయం చేసింది. ఆ ఊర్లో ఎన్ఎస్ఎస్ క్యాంపులు పెట్టినప్పుడు రెగ్యులర్‌గా వెళ్లేటోణ్ని. శ్రీకాంత్ వాళ్ల నాన్న డైట్ ప్రిన్సిపల్‌గా పనిచేసేటోడు. సమాజానికి ఏదైనా మంచి చేయాలనే ఆలోచన ఉన్న మనిషి. మద్యపాన నిషేధం, స్వచ్ఛతకోసం పాటుపడుతుండె. సమాజహితం కోరుతూ కొన్ని స్కిట్స్ చేపిస్తుండె! ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆ ఊరికి పోతుండె. ఆ స్కిట్స్ అందరికీ దగ్గర కావాల్నని శ్రీకాంత్ ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ చానెల్‌ను పెట్టిండు. నేను కూడా వాళ్లతో కలిసి పనిచేసిన. మేం తీసే వీడియోలు కామెడీగా ఉంటూనే, ప్రజలను చైతన్యపరచాలని అనుకున్నం. మొదట్లో నేను స్క్రీన్ వెనుకే ఉండేటోణ్ని. తర్వాత్తర్వాత స్క్రీన్ మీద కనిపించడం మొదలుపెట్టిన. విలేజ్ పార్లమెంట్ ఎపిసోడ్ కోసం రెండు స్క్రిప్ట్‌లను రెడీ చేసిన. సెకండ్ స్క్రిప్ట్‌ను యాక్సెప్ట్ చేయడంతో నాకు రాయగలననే నమ్మకం కుదిరింది. తర్వాత రాసిన సర్పంచ్ ఎలక్షన్లు, డ్రంక్ డ్రైవ్ స్క్రిప్ట్‌లకు మంచి స్పందన వచ్చింది. ఒకవైపు స్క్రిప్ట్ రాస్తునే కొన్ని సీన్లలో కూడా తెరమీద కనిపించిన. ఉషారు పిట్టలు, ఇసుకదందా, నా లవర్ సిరిలకు రైటింగ్ తదితర షార్ట్‌ఫిల్మ్స్‌కు దర్శకత్వం చేసిన.
క్యాంపస్కని చెప్పి..
రెండుసార్లు ట్రై చేసినా.. సర్కార్ కొలువు రాకపోయేసరికి నేను లూజర్ అనుకుని భయపడుతుండె. ‘మై విలేజ్ షో’తో నేను విన్నర్ అని నిరూపించుకునే అవకాశం వచ్చింది. ‘మామా ఒక ఏడాది ఇందులో కష్టపడుదామ’ని శ్రీకాంత్ చెప్పడంతో ఇంట్లో వాళ్లకు ఉస్మానియా క్యాంపస్‌కు పోతున్న అని అబద్ధం చెప్పి లంబాడిపల్లెకు వచ్చిన. నా గ్రూప్-2 ప్రిపరేషన్‌తో కొలువు కొట్టకపోయినా సమాజానికి మంచిచేసే కంటెంట్ రాయగలిగిన. నవ్వులతోపాటు సొసైటీకి ఓ సందేశం ఇస్తున్న మా షార్ట్ ఫిల్మ్‌లు చూసిన జీ5 వాళ్లు మంచి సినిమా తీయనికి అడిగినరు. ఈ సినిమాలో మై విలేజ్ షోలో చేసిందే చూపించాలనుకున్నా. అలా పుట్టిందే ‘మోతెవరి లవ్ స్టోరి’. ఇందులో కామెడీతోపాటు అనుబంధాలు, దుబాయి దుఃఖం అన్నీ కలగలిసి ఉంటాయి.
32 రోజుల్లో షూటింగ్..
తెలంగాణ యాసను ఈ సినిమాలో ఉన్నది ఉన్నట్లు చూపించాలనుకున్నా. ఆరునెలల్లో స్క్రిప్ట్ పని పూర్తి చేసిన. 32 రోజులల్ల షూటింగ్ కంప్లీట్ చేసినం. ఈ వెబ్‌సిరీస్‌లో మై విలేజ్ షో టీంను అందంగా చూపించాలనుకున్నా. అందులో భాగంగానే నాతోపాటు గంగవ్వ, చందు, రాజు అక్కడక్కడ మెరుస్తుంటారు. ఇప్పటివరకు షార్ట్ ఫిల్మ్‌కు పెట్టిన ఎఫెక్ట్స్నే ఈ సిరీస్‌లో ఉపయోగించా. ఒక ఫిల్మ్ మేకర్ ఏదైనా చేయగలడనే నేను నమ్ముతా! దాన్నే సిరీస్ మొత్తం పూర్తయ్యే వరకు ఫాలో అయ్యాను. గతంలో మేము కొన్ని సినిమాల ప్రమోషన్ వీడియోలు చేసిన అనుభవం ఉంది. గంగవ్వను షూటింగ్‌లకు తీసుకెళ్లినప్పుడు మాకు పరిచయమైన సినిమా ప్రపంచం వల్ల ఇదంతా నేర్చుకున్నా. మా సినిమా మొత్తం సిద్ధన్నపేట, ఏటూరునాగారం ప్రాంతాల్లోనే పూర్తిచేశాం.
నాన్న పొంగిపోయిండు
యూట్యూబ్‌లోనే చాలా మందిని మెప్పించినం. ఈ సిరీస్ కూడా పక్కా హిట్ అవుతుందని రంగంలోకి దిగినం. యూనిక్ స్టోరీ అని బలంగా నమ్మిన. జీ5 ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ వెబ్‌సిరీస్ 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌కు చేరింది. కరీంనగర్లో మా నాన్న ‘మోతెవరి లవ్ స్టోరి’ చూసి కన్నీళ్లను ఆపుకోలేకపోయిండు. ఒకప్పుడు ఆయన వల్లనే నా జీవితం కరాబైందని బాధపడి, నేడు నా విజయం చూసి ఉప్పొంగిపోయిండు. మై విలేజ్ షో ఒక మహా వృక్షం దాన్ని కాపాడుకుంటూనే సినిమాలు చేస్తాను. నా సినిమాను రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు ఆదరించారు. గెలిస్తే విజయం.. ఓడిపోతే అనుభవం అనే తీరుగా ముందుకు సాగడమే నా లక్ష్యం.ఎలదారియా.. ఎంతో ప్రత్యేకం!
డబ్బు మాయలో పడి సొంత
అన్నదమ్ములే గట్టు పంచాయితీలు పెట్టుకుంటున్న రోజులివి. ఈ సినిమాలోని ‘పెద్ద గిలాసల పాలు తాగి పెద్ద పాలు అడుగుతున్నవా.? చిన్నప్పుడు అయ్యవ్వ ఉన్నరు ఇప్పుడైతే ఎవ్వల్లేరు’ అనే డైలాగ్ పెట్టడానికి కారణం కూడా అదే! ఇప్పుడున్న గ్రామీణ ప్రాంతాల్లో నాకు తారసపడిన సన్నివేశాలు ప్రధానంగా ఎంచుకున్నాను. అచ్చమైన తెలంగాణ యాసలో డబుల్ మీనింగ్ డైలాగ్‌లు లేకుండా, బూతు మాటలు వినబడకుండా ఒక మంచి సిరీస్ తీశాననే తృప్తి ఉంది. హనుమవ్వ తన లవ్ స్టోరి చెబుతున్న సమయంలో ‘నన్ను అపార్థం చేసుకోకు బిడ్డ’ అని మనువడితో అనే డైలాగ్ స్త్రీ ఆత్మగౌరవానికి గుర్తుగా నిలిచింది. సినిమా మొత్తం ఒక ఎత్తయితే అందులోని ‘ఎలదారియా’ పాట మాత్రం చాలా ప్రత్యేకం. సినిమా మొత్తాన్ని ఆ పాటలోనే చెప్పాలనుకున్నా. అందులో వందశాతం సక్సెస్ అయ్యా. ఎలదారియా పాటకోసం రెండు నెలలు కసరత్తు చేశాను. ఈ పాట షూటింగ్ అప్పుడు నా బాల్యం యాదికొచ్చింది. మా నాన్నతో పొలంకాడికి పోయినపుడు నాకు దూపైతుంది అంటే.. పొలంలో ఒక పక్క ఎడ్లు నీళ్లు తాగుతుంటే మరోపక్క నాకు నీళ్లు తాపెటోడు. ఇక మోతెవరి దుబాయికి పోయినంక తన యోగ క్షేమాలు చెప్పుకుంటా హనుమవ్వకు క్యాసెట్ పంపించిన సీన్ నా నిజ జీవితంనుంచి తీసుకున్నా. నా చిన్నతనంలో మా నాన్నకు నేను కూడా గిట్లనే క్యాసెట్ల మాట్లాడి పంపేటోణ్ని. అవన్నీ ఈ కథలో భాగం చేసిన!
-రాజు పిల్లనగోయిన