బుధవారం 08 ఏప్రిల్ 2020
Medchal - Feb 12, 2020 , 03:27:38

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలకు వందేండ్లు..

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలకు వందేండ్లు..

అహ్మద్‌నగర్‌, ఫిబ్రవరి11 : మానవతా థృక్పదమే పరమావధిగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ అందిస్తున్న సేవలకు వందేండ్లు నిండాయి. దేశంలో తొలిసారి ప్రవేశపెట్టిన నాడే హైదరాబాద్‌లో బ్రిటిష్‌ రెసిడెంట్‌ ప్రెసిడెంట్‌ 1920లో ఐఆర్‌సీఎస్‌ సేవలను తెలంగాణలో ప్రారంభించడం విశేషం. నగరంలోని రాణిగంజ్‌లో రెడ్‌క్రాస్‌ సొసైటీ పేదలకు పోషకాహారాన్ని అందించే ఉచిత పాల పంపిణీ కేంద్రంతో రెడ్‌క్రాస్‌ సేవలు ప్రారంభమయ్యాయి. అలనాడే ఈ సంస్థ పేదలకు వైద్య సౌకర్యాలు అందించేందుకు వెల్‌నెస్‌ సెంటర్‌తో పాటు చైల్డ్‌ వెల్ఫేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ నగరంలో డాక్టర్‌ పాల్‌దాస్‌ నేతృత్వంలో అంకురార్పణ చేసుకున్న రెడ్‌క్రాస్‌ సేవలు దివంగత డాక్టర్‌ సరస్వతీరావు ఆధ్వర్యంలో బ్లడ్‌బ్యాంక్‌ వంటి కార్యక్రమాలతో ఇంతింతై అన్నట్లుగా వృద్ధి చెందాయి. తదనంతరం గవర్నర్‌ రంగరాజన్‌, ఆయన సతీమణి పోద్బలంతో 1999లో మాసబ్‌ట్యాంక్‌లో రెడ్‌క్రాస్‌ పాఠశాలతో పాటు మహిళలకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.


నాటి నుంచి గవర్నర్‌ పరిధిలో పనిచేస్తున్న రెడ్‌క్రాస్‌ ప్రభుత్వ పాఠశాల నిర్విఘ్నంగా కొనసాగుతుండగా ఇక్కడ కుట్టు శిక్షణ కేంద్రానికి కొన్ని అవరోధాలేర్పడ్డాయి. అయితే నాటి గవర్నర్‌ దంపతుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా రెడ్‌క్రాస్‌ సంస్థ నాటి కుట్టు మిషన్‌లతో మళ్లీ కుట్టు శిక్షణా కేంద్రాన్ని పున:ప్రారంభించింది. తమ  లక్ష్యాలకు అనుగుణంగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ నగరంలో విస్తృతమైన సామాజిక సేవా కార్యక్రమాలతో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. అంతేకాక ప్రభుత్వ లక్ష్యాలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ  ఈ కేంద్రంలో జ్యూట్‌ , కాటన్‌ బ్యాగుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటికే 75 వేల మందికి డెంగీ నివారణ హోమియో మందులు అందించడం, రక్తదాన శిబిరాలతో తలసేమియా, సికిల్‌సెల్‌ భాదితులకు అండగా నిలవడమే కాక యోగా, ఫస్ట్‌ ఎయిడ్‌ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడం, యువతకు ఉపాధి కల్పించే శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రెడ్‌క్రాస్‌ సంస్థ తెలంగాణ అధ్యక్షుడు దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి , ప్రధాన కార్యదర్శి మదన్‌ మోహన్‌ల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ త్వరలో ఇక్కడ కంప్యూటర్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  


సామాజిక సమస్యలపై పోరాటం..

రెడ్‌క్రాస్‌ సభ్యులతో నగరంలో ఐఆర్‌సీఎస్‌ సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నాం. ఇప్పటికే గవర్నర్‌ ప్రోద్బలంతో యూత్‌ రెడ్‌క్రాస్‌ , జూనియర్‌ రెడ్‌క్రాస్‌ విభాగాలలో 1లక్ష 60 వేల మంది వైఆర్‌సీ , జేఆర్‌సీలతో పాటు 2 వేల మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.  క్షేత్రస్థాయిలో ఐఆర్‌సీఎస్‌ను మరింత బలోపేతం చేసేందుకు రెడ్‌క్రాస్‌ యాప్‌తో నూతన సభ్యత్వాలను పెంచేందుకు కృషి చేస్తాం.  

- మామిడి భీమ్‌రెడ్డి, హైదరాబాద్‌ రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ 


logo