పటాన్చెరు, అక్టోబర్ 10: పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశచూపి అమాయక మహిళల నుంచి ఏపీకి చెందిన విద్య అనే మహిళ భారీగా డబ్బులు, బంగారం వసూలు చేసి మోసం చేసిన ఘటన పటాన్చెరులో వెలుగుచూసింది. పటాన్చెరు పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. విద్య అనే మహిళ హైదరాబాద్‌లోని వారాసిగూడలో నివాసం ఉండేది. ఆ ప్రాంతంలో చాలామంది మహిళలకు మాయమాటలు చెప్పి, వారి నుంచి భారీగా డబ్బులు, బంగారం వసూలు చేసింది. వసూలు చేసిన డబ్బులకు సంబంధించి బంగారం, రెట్టింపు డబ్బులు అడిగినా ఇవ్వకపోవడంతో బాధిత మహిళలు కొద్ది నెలలుగా విద్య చుట్టూ తిరుగుతున్నారు. మహిళల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో విద్య మూడు నెలల క్రితం గుట్టుచప్పుడు కాకుండా పటాన్‌చెరుకు వచ్చి అద్దెకు ఉంటున్నది. విద్య వద్దకు బాధిత మహిళలు రాగా, విద్యతో పాటు ఆమె అనుచరులు బాధిత మహిళలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు మహిళలు గాయపడ్డారు.
ఈ ఘటనపై బాధిత మహిళలు గురువారం పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్య రూ.18 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసినట్లు బాధిత మహిళలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీకి చెందిన వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఓ నాయకుడి పేరు చెప్పి తమకు ఆశచూపిందని, బంగారం, డబ్బులు ఇస్తే తమకు రెట్టింపు ఇస్తామని చెప్పి భారీగా వసూలు చేసినట్లు బాధిత మహిళలు పేర్కొన్నారు. వైఎస్ఆర్ పార్టీకి చెందిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు చెప్పి, తమ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిందని బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం, డబ్బుల కోసం అడిగిన ప్రతిసారి రేపు, మాపు అంటూ చెబుతూ ఏడాదిన్నరగా తప్పించుకున్నట్లు తెలిపారు. గురువారం పటాన్చెరులో విద్య ఉంటున్న ఇంటికి వెళ్లగా, ఆమెతో పాటు అనుచరులు దాడి చేశారన్నారు. రాడ్లు, కట్టెలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలైనట్లు వాపోయారు.
మహిళల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన విద్యను అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆరోపించారు. విద్యపై హైదరాబాద్‌లోని కూకట్‌పల్లితో పాటు పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైనట్లు బాధిత మహిళలు తెలిపారు. శుక్రవారం మళ్లీ పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌కు బాధిత మహిళలు వచ్చారు. విద్యను అరెస్టు చేయడంలో పటాన్చెరు పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఆమెకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని, అందుకే పోలీసులు విద్యను అరెస్టు చేయడం లేదని బాధిత మహిళలు ఆరోపించారు.
పటాన్చెరులో విద్య ఉన్నా పరారీలో ఉందని పోలీసులు తెలుపుతున్నారని ఆరోపించారు. విద్యను అరెస్టు చేయాలని కోరగా, పోలీసులు సరైన సమాధానం ఇవ్వడం లేదని బాధిత మహిళలు ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి న్యాయం చేయాలని బాధిత మహిళలు డిమాండ్ చేశారు. కాగా, దీనిపై పటాన్చెరు ఎస్‌హెచ్‌వో వినాయకరెడ్డి స్పందించారు. విద్యతో పాటు ఆమె అనుచరులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని ఎస్‌హెచ్‌వో తెలిపారు.