‘హనుమంతు.. నువ్వు పుణెకు రా. ఇక్కడ ఉద్యోగావకాశాలు ఎక్కువే. మనోళ్లు చాలామంది ఉన్నారు. అన్నీ చూసుకుంటాం’ ఎంటెక్ పూర్తి చేసిన యువకుడికి అతడితో కలిసి బీటెక్ పూర్తి చేసిన క్లోజ్ ఫ్రెండ్ చెప్పిన మాట ఇది.
– సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 5
ఇంకేముంది స్నేహితుడి మాట విన్న హను మంతు వారంలోనే పుణె వెళ్లి స్నేహితుడిని కలిశాడు. హనుమంతును గట్టిగా కౌగిలించుకున్నా ఫ్రెండ్. ఇరువురు కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మధ్యాహ్నం భోజనం చేశారు. సాయం త్రం వరకు ముచ్చట్లు పెట్టారు. ఆపై ‘అరేయ్.. నువ్వు పలానా హాస్టల్లో ఉండు. ఓకేనా’ అని చెప్పి దోస్త్ వెళ్లిపోయాడు. హనుమంతుకు కోపం వచ్చింది. వీడేంది, వాడి గదికి రమ్మనడం లేదని అనుకున్నాడు. కానీ, ఆ ఫ్రెండ్ రోజూ హనుమంతును ఫోన్లో పలుకరిస్తూనే ఉన్నాడు. నెల వ్యవధిలోనే హనుమంతుకు ఉద్యోగం వచ్చింది. ఈ విషయా న్ని దోస్త్‌కు చెప్పేశాడు. ఆ వెంటనే ఆ దోస్త్ హనుమంతును గదికి పిలిపించుకున్నాడు. పాత విషయాన్ని మనసులో పెట్టుకున్న హను మంతు.. దాని గురించి బయటకు చెప్పకముందే ఆ స్నేహితుడు మనసు విప్పి మాట్లాడాడు. ‘అరేయ్.. నీకు ఉద్యోగం లేనప్పుడు గదికి రమ్మనలేదేం అని ఆలోచిస్తున్నావా? అదేం లేదురా. నా గదిలో ఉన్న నలుగురు ఉద్యోగం వచ్చినవాళ్లే. ఉద్యోగ రీత్యా ఎదురయ్యే సమస్యలు గురించి మాత్రమే వాళ్లకు తెలుసు. కానీ, నేను నిన్ను పంపించిన హాస్టల్లో 400 మంది యువతీయువకులు ఉన్నారు.
వాళ్లంతా నిరుద్యోగులే. రోజూ ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. అలాంటి వాళ్ల దగ్గర ఉంటేనే ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? ఆయా ఉద్యోగాలకు వెళ్లి ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం, మరోసారి అలాంటి పొరపాటు చేయకుండా ఎలా జాగ్రత్త పడాలో తెలుస్తుంది. ప్రాక్టికల్ అనుభవం పెరుగుతుంది. అందుకే అక్కడకు పంపించాను రా’ అని చెప్పేశా డు. దోస్త్ చెప్పిన ఆ మాటతో హనుమంతు కోపం పోయి, కండ్లలో నీళ్లు తిరిగాయి. నిజమే కదా.. అని సంతోషపడుతూ స్నేహితుడిని హత్తుకున్నాడు. ఇదీ దోస్తాన్ అంటే. హితుడుగా ఎప్పటికీ మిగిలిపోవాలంటే ఇంతకుమించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జీవితాం తం ఆ పేరును గుర్తుపెట్టుకోకపోతేనే అది తప్పవుతుంది. మనకు సాయం చేసిన హితులను పలుకరించేందుకు ఇదే మంచి తరు ణం, ఈ స్నేహితుల దినోత్సవా న్ని మరో మరుపురాని ఘట్టంగా మలుచుకునేందుకు శుభశకునం. ఆదివారం స్నేహితుల దినోత్సవం.
నేటితరం..
చదువుకుంటున్న, తాజాగా చదువులు పూర్తిచేసుకున్న నేటితరం స్నేహితులు ఫ్రెండ్షిప్ డేను వేడుకలకు వేదికగా మార్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. అంతా ఒకచోట చేరాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రణాళికలు వేస్తున్నారు. చదువుకునే సమయంలో ఎదురైన చేదు జ్ఞాపకాలు, తీపి గుర్తులను మరోసారి మన నం చేసుకోవాలని భావిస్తున్నారు. చిన్న, చిన్న ఆటపాటలతోపాటు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఆసక్తి చూపుతున్నారు.
గుర్తు చేసుకుందాం..
చెడ్డీ దోస్త్.. గల్లీ దోస్త్, స్కూల్ దోస్త్, కాలేజీ దోస్త్.. ఉద్యోగంలో దోస్త్, ఆటల్లో దోస్త్.. ఇలా ఎంతోమంది ఉన్నా.. కొంతమంది స్నేహం ఎప్పటికీ గుర్తుంటుంది. వాళ్లతో గడిపిన క్షణాలు సంతోషాన్ని ఇస్తాయి. అలాంటి తీపి జ్ఞాపకాలు మళ్లీ వస్తే బాగుండని అందరికీ అనిపిస్తుంది. అందుకే స్నేహితుల దినోత్సవాన్ని కొత్తగా జరుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు. ప్ర త్యేక దినోత్సవాన చిన్ననాటి స్నేహితులను కలుసుకునేందుకు ఇష్టపడుతున్నారు. లేదంటే వాళ్ల ను కనీసం ఫోన్లలో పలకరించేందుకు ఆరాటపడుతున్నారు. ‘అరేయ్ .. లెక్కల సారు కొట్టిన దెబ్బలకు ఈపు ఇమానం మోత మోగిన విష యం నీకు గుర్తుందా’ అంటూ నాటి జ్ఞాపకాలను నవ్వుకుంటూ చర్చించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాటి విజయాలు, వైఫల్యాల వెనుక ఉన్న కష్టాన్ని ఒకరితో ఒకరు పంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. స్నేహితుల ద్వారా పొందిన సాయాన్ని మరోసారి వాళ్లకు గుర్తుచేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆపదలో ఉన్న స్నేహితులను ఉన్నదాంట్లో ఆదుకునేందుకు సైతం ప్రణాళికలు వేస్తున్నారు.