రైతుల గగ్గోలు
“సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ (పీఏసీఎస్) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 977 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో లక్ష రూపాయలలోపు 575 మంది తీసుకోగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష పంట రుణమాఫీ చేస్తే కేవలం ఈ సహకార సం ఘంలో 308 మంది జాబితా మాత్రమే వచ్చింది.
- లక్ష రూపాయల జాబితాలో పేర్లు గల్లంతు
- మాకేందుకు పంట రుణమాఫీ కాలేదు ..?
- ఒక్కో బ్యాంకులో సగానికి సగం మాఫీ కాలేదు
- పత్తా లేని పంట రుణమాఫీ మెస్సేజ్‌లు
- అసలు మాఫీ అయిందా..? కాలేదా..?
- రూ.50 వేల రుణం ఉన్నా
- పంట రుణమాఫీ కాలేదు
- అధికారిక జాబితా విడుదల చేయడంలో నిర్లక్ష్యం
- సోషల్ మీడియా వచ్చిన జాబితానే నమ్ముకున్న రైతులు
- ఇవేం నిబంధనలు…ఇదేం ప్రభుత్వం అంటూ రైతుల ఆక్రోశం
సిద్దిపేట,జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ (పీఏసీఎస్) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 977 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో లక్ష రూపాయలలోపు 575 మంది తీసుకోగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష పంట రుణమాఫీ చేస్తే కేవలం ఈ సహకార సం ఘంలో 308 మంది జాబితా మాత్రమే వచ్చింది. వీరికి రూ.1,73,46,957 మాఫీ చేసింది. మిగతా 267 మంది రైతులకు మాఫీ కాలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తామేమీ తప్పు చేశాం.. మాకేందుకు పంటరుణమాఫీ కాలేదు అంటూ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు”
పేర్లు గల్లంతు
రైతుల గగ్గోలు …చాలా చోట్ల లక్ష రూపాయల జాబితాలో పేర్లు గల్లంతు..ఒక్కో బ్యాంకులో సగానికిపైగా పేర్లు గల్లంతయ్యాయి. ఇక మా పంట రుణమాఫీ ఎప్పుడో అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు రూ. రెండు లక్షల పంటరుణమాఫీ అని చెప్పి మరోసారి మోసం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,53,168 రైతుల ఖాతాలకు రూ. 811.67 కోట్లు లక్ష లోపు వరకు పంటరుణమాఫీ చేశాం అని చెబుతుండగా 1,45,147 కుటుంబాలకు వర్తించింది. సిద్దిపేట జిల్లాలో 53,137 రైతుల ఖాతాలు కాగా 50,295 కుటుంబాలకు రూ. 290.34 కోట్లు, మెదక్ జిల్లాలో 48,864 రైతుల ఖాతాలు కాగా 45,882 కుటుంబాలకు రూ. 241.82 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 51,167 రైతుల ఖాతాలు కాగా 48,970 కుటుంబాలకు రూ. 279.61 కోట్లు పంటరుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో సాధ్యం కాలేదు.
క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. సగానికి సగం పంటరుణమాఫీ జాబితాలో రైతుల పేర్లు గల్లంత య్యాయి. రైతులు ఇదేంటని అధికారుల వద్దకు వెళ్తే వారి వద్ద సరైన సమాధానం లేదు. గ్రీవెన్ సెల్లో వివరాలు ఇచ్చి వెళ్లండి ..తాము చూసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం అని చెబుతున్నారు. చాలా గ్రామాలకు సోషల్ మీడియాలో వచ్చిన జాబితాలు తప్పా అధికారికంగా ఎక్కడా కూడా జాబితాలను విడుదల చేయలేదు. బ్యాంకర్ల వద్ద ఉన్న జాబితాలు కూడా బయటకు విడుదల చేయడం లేదు. కొన్ని చోట్ల మాత్రమే విడుదల చేసినట్లు సమాచారం ఉంది. ఒక బ్యాంకులో లక్ష రూపాయల వరకు ఎంత మంది రుణం తీసుకున్నారు. ఎంత మందికి పంటరుణం మాఫీ అయింది అనే లెక్కలు చెప్పడానికి సైతం అధికారులు విముఖత చూపుతున్నారు. అంటే ఒక స్పష్టత, ఒక లెక్క పత్రం లేకుండా పోయింది.
కుటుంబాల్లో పంట రుణమాఫీ చిచ్చు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంటరుణమాఫీ పథకం పల్లెల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఎటూ పొంతన లేని నిబంధనలు పెట్టి కొంతమందికి పంటరుణమాఫీ చేసి మరికొంత మందిని విస్మరించడంతో కొందరు రైతులు ఆందోళనకు గురికావడంతో పాటు ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. రేషన్‌కార్డును ప్రాతిపదికగా తీసుకొని పంటరుణమాఫీ చేయడం వల్ల పచ్చని కుటుంబాల్లో ప్రభుత్వం చిచ్చుపెట్టినట్లయ్యింది. ఒకే కుటుంబంలో ఉన్న ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకరు వేరుపడగా అతడికి గతంలో రేషన్‌కార్డు వచ్చింది. మిగిలిన ఇద్దరు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నందున వారి పేర్లు ఒకే రేషన్‌కార్డులో ఉ న్నాయి.
దీంతో తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులు తీసుకున్న పంటరుణం లక్ష దాటితే తల్లిదండ్రలతో పాటు ఆ ఇద్దరుకొడుకులకు పంట రుణమాఫీ కా లేదు. దీంతో పంటరుణమాఫీ అయిన సోదరుడితో పాటు కలిసి ఉన్న సోదరులు, తల్లిదండ్రుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. పంట రుణం తీసుకున్న రైతులందరికీ ఏకకాలంలో, ఏకమొత్తంలో పంటరుణమాఫీ చేస్తామన్న సర్కారు మాటతప్పి కొందరికే మాఫీ చేయడం వల్ల పల్లెల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.లక్షలోపు రుణం ఉండి మాఫీ కాని రైతులు వ్యవసాయాధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
ఒకవైపు వానకాలం ఎవుసం పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో పంటరుణమాఫీ కాని రైతు లు పనులన్నీ వదులుకొని కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒకవైపు అందరికీ రుణమా ఫీ చేస్తామని చెప్పడం, మరోవైపు రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవడం, అన్ని అర్హతలు ఉన్నా జాబితా లో పేర్లు రాకపోవడం, జాబితాలో పేర్లు వచ్చినా ఇంకా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది.
నారాయణరావుపేట మండలంలోని యూనియన్ బ్యాంకులో లక్ష రూపాయల్లోపు రుణం తీసుకున్న వారు 800 మంది ఉన్నారు. వీరిలో కేవలం 430 మందికి మాత్రమే పంటరుణమాఫీ అయినట్లు జాబితా వచ్చింది. మాఫీ జాబితాలో మిగతా సగం మంది పేరు లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మెదక్ జిల్లా పాపన్నపేట సహకార బ్యాంకు పరిధిలో లక్షలోపు పంట రుణాలు తీసుకున్న వారు 1685 మంది రైతులు ఉన్నారు. వీరిలో 845 మం దికి మాత్రమే పంటరుణమాఫీ అయినట్లు జాబితా వచ్చింది. అంటే ఇక్కడ కూడా సగానికి సగం మంది రైతుల పంట రుణమాఫీ కాలేదు.
జిన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెం దిన చిందం రాజమౌళి అనే రైతు స్థానిక గ్రామీణ బ్యాంకులో రూ. 45 వేల పంటరుణం తీసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పంటరుణమాఫీ జాబితాలో అతడి పేరు రాలేదు. అన్ని అర్హతలు ఉన్నా తనకు మాఫీ ఎందుకు కాలేదని అతను ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఇంత వరకు అధికారిక జాబితాను గ్రామ పంచాయతీల వద్ద ప్రదర్శించలేదు. బ్యాంకుల వద్ద కూడా సరిగ్గా ఉంచలేదు. కొన్ని చోట్ల మాత్రమే పెట్టారు. దీంతో నిరక్షరాస్యులు తమ పేరు జాబితాలో ఉందో లేదో అనే బెంగ వారిని వెంటాడుతున్నది. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తెలిసిన వారితో దీనంగా మ పేరు ఉందో చూడు బిడ్డా అంటూ అడుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఒక కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటే తలా రూ.50 చొప్పున రుణం తీసుకున్నారు. ఒక్కొక్కరి పేరు మీద రూ.50 వేలు ఉన్నాయి. అందరివి లక్షలోపే ఉన్నాయి. కుటుంబం యూనిట్ తీసుకున్నా మొత్తం కలిపి లక్షా యాభైవేలు అవుతుంది. రెండు లక్షల పరిమితి దాటలేదు. ఒకరికి ఒకరు సంబంధం కూడా లేదు. వారి పేరున రూ.50 వేలు మాత్రమే ఉన్నాయి కదా..వారికి పంటరుణ మాఫీ ఎందుకు కాలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మహ్మదాపూర్ క్లస్టర్ పరిధిలో మొదటి విడతలో 480 మంది రైతులకు మాత్రమే పంట రుణమాఫీ అయింది. మహ్మదాపూర్లో 89 మంది రైతులకు పంట రుణమాఫీ కాగా మడద, రాములపల్లి గ్రామా ల్లో 130మందికి, నాగారంలో 53మందికి, ఉమ్మాపూర్, జిల్లెలగడ్డ గ్రామాల్లో 208మందికి పంటరుణమాఫీ అయినట్లు ప్రభుత్వం జాబితా విడుదల చేసిం ది. జాబితాలో ఉన్న రైతులకు కొందరికి ఇప్పటికీ తమ ఖాతాల్లో డబ్బులు పడకపోవడం విశేషం. ఇక జాబితాలో పేర్లు రాని వారు దాదాపు 30 నుంచి 40శాతం మంది వరకు ఉంటారు.
రుణమాఫీ 12-12-2018 నుంచి 09-12-2023 మధ్యకాలంలో తీసుకున్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది అని ప్రభుత్వ యంత్రాంగం స్పష్టంగా చెబుతోంది. ఇదే విషయమై ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి చెబుతున్నారు. మరి అంతకు ముందు తీసుకున్న వారి సంగతి ఏంటి ..? ప్రస్తుతం విడుదల చేసిన పంటరుణమాఫీ జాబితాలో కూడా ఆ తేదీ మధ్యన తీసుకున్న వారి పేర్లు మాత్రమే పంటరుణమాఫీ జాబితాలో వచ్చాయి. దీంతో మిగతా రైతులు ఆందోళన చెందుతున్నారు.
జాబితాలో నా పేరు రాలేదు
సిద్దిపేట, జూలై 19: పుల్లూరు గ్రామీణ వికాస్ బ్యాంకులో నేను 2021లో రూ.50వేల పంట రుణం తీసుకున్నా. బ్యాంకుకు వచ్చి తెలుసుకుంటే పంటరుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. వచ్చే జాబితాలో వస్తది ఏమో అంటున్నారు. నాకు తెలిసి పంటరుణమాఫీ లక్ష వచ్చిన వారి కంటే రానివారే ఎకువ ఉన్నారు. నిబంధనలు పెట్టకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పంటరుణమాఫీ చేయాలి. లేకుంటే మా లాంటి పేద రైతులకు అన్యాయం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం వెంటనే పంటరుణమాఫీ చేయాలి.
-బాలకిషన్, రైతు, చింతమడక, సిద్దిపేట జిల్లా
కటాఫ్ డేట్‌ను ఎత్తివేయాలి
సిద్దిపేట, జూలై 19: 2018కి ముందు రుణాలు తీసుకున్న వారికి ప్రభుత్వం పంటరుణమాఫీ చేయాలి. ఎన్నికల్లో చెప్పినట్లు ప్రతి రైతుకు పంటరుణమాఫీ చేయాలని కోరుతున్నా. ఐదేండ్ల క్రితం ఎస్బీఐ ఏడీబీలో లోన్ తీసుకున్నా. లేదంటే మా కుటుంబం రూ.2 లక్షల పంటరుణమాఫీని నష్టపోతాం. కటాఫ్ డేట్‌ను ఎత్తివేయాలి. ఈ విషయం తెలుసుకుందామని బ్యాంకుకు వచ్చా.
-ఎర్రోళ్ల మహేందర్, రైతు,గంగాపూర్, సిద్దిపేట జిల్లా
ఎవరూ పట్టించుకోవడం లేదు
అక్కన్నపేట, జూలై 19: అక్కన్నపేటలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ. 80 వేల క్రాప్‌లోన్ తీసుకున్నా. తీరా రూ.లక్షలోపు పంట రుణమాఫీ జాబితాలో నా పేరు లేదు. బ్యాంకు మేనేజర్‌ను అడిగేందుకు అక్కన్నపేటకు వచ్చా. రెండు, మూడు గంటల నుంచి బ్యాంకు ఎదుట ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మొదటి నుంచి కాంగ్రెస్ సర్కారు రైతులను ఆడుకుంటున్నది. ఏకకాలంలో రూ.రెండు లక్షలు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు మూడు విడతల ముచ్చట చెప్పవట్టే. అయినా రూ. లక్షలోపు పంట రుణం కూ డా మాఫీ కాలేని పరిస్థితి. గతంలో సీఎం కేసీఆర్ సర్కారు హయాంలో రూ. 80 వేల పంట రుణమాఫీ అయ్యింది. చాలా సంతోషం అనిపించింది.
– గొల్లెన రాజయ్య, రైతు, జనగామ, సిద్దిపేట జిల్లా
మాకు రుణమాఫీ రాలేదు
మిరుదొడ్డి, జూలై 19 : సీఎం రేవంతరెడ్డి చేసిన రుణమాఫీలో కొందరికి మాత్రమే వచ్చింది. కానీ 60 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. నేను రూ.60 వేల రుణం తీసుకున్నా. నా భార్య ప్రమీల పేరు మీద గోల్డ్‌లోన్ తీసుకున్నా. మా ఇద్దరికీ రుణమాఫీ రాలేదు. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలపై అందరికీ మాఫీ చేస్తేనే బాగుండేది. కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలామంది రైతులు ఆశపెట్టుకుని ఈరోజు మోసపోయారు.
– దార స్వామి, రైతు, మిరుదొడ్డి, సిద్దిపేట జిల్లా
రుణమాఫీ ఎప్పుడు వస్తదో తెలుస్తలేదు
నారాయణరావుపేట, జూలై 19: పంటరుణమాఫీ జాబితాలో నాపేరు లేక పోవడం చాలా బాధగా ఉంది. లక్షలోపు రుణం ఉన్న ప్రతి ఒక్కరికీ మాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జాబితాలో నాపేరు లేదు. నాపేరు మీద రూ. 50వేలు మాత్రమే పంట రుణం ఉంది. నాకు ఎందుకు పంటరుణమాఫీ కాలేదని అధికారులను అడిగితే రెండో విడత అని చెబుతున్నారు. అది ఎప్పుడు వస్తదో తెలుస్తలేదు.
-పిట్ల కిషన్, రైతు, గుర్రాలగొంది, నారాయణరావుపేట మండలం, సిద్దిపేట జిల్లా
మోసం చేస్తున్న ప్రభుత్వం
రామాయంపేట, జూలై 19: ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది. నాకు వ్యవసాయ భూమి ఉంది కానీ పంటరుణమాఫీ కాలేదు. ఏదేదో కొర్రీలు పెట్టి రుణమాఫీ రాకుండా చేసిండ్రు.లక్షలోపు పంటరుణం మాఫీ చేస్తమని చెప్పి అవి కూడా చేయలేదు. నాకు బ్యాంకులో ఉన్న అప్పు కూడా లక్షలోపే ఉంది. ఒకసారి రేషన్ కార్డు అని మరోసారి ఆధార్ కార్డు అని కొర్రీలు పెట్టడం తప్పా పంటరుణంమాఫీ మాత్రం కాలేదు.
– భిక్షపతి, రైతు, రామాయంపేట, మెదక్ జిల్లా
అప్పు మాత్రం అట్లనే ఉంది
రామాయంపేట, జూలై 19: అధికారులు పంటరుణమాఫీ జాబితాలో నాపేరు లేకుండా చేసిండ్రు. బ్యాంకులో రూ.85వేల అప్పు మాత్రమే ఉంది. నాకు కాకుండా నాకంటే ఎక్కువ అప్పులు ఉన్నవాళ్లకు పంటరుణమాఫీ వచ్చింది. గిదేం ప్రభుత్వం.. అప్పులు మాఫీ చేస్తం అంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటూ తిరిగిండ్రు. కాంగ్రెస్ నాయకులు మంచిగ చేస్తరనుకున్నా నా అప్పు మాత్రం అట్లనే ఉంది.
-గట్టు సుశీల, మహిళా రైతు, రాయిలాపూర్, రామాయంపేట, మెదక్ జిల్లా
ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతున్నది
రామాయంపేట, జూలై 19: కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతున్నది. నాతోపాటు మాగ్రామంలో చాలా మందికి పంటరుణమాఫీ కాలేదు.గిదేం ప్రభుత్వం కొందరికి ఇచ్చి మరికొందరి ఇయ్యకపోవడం మంచిది కాదు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం లక్షలోపు పంటరుణాలు మాఫీచేయాలి. అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. ఏంచేయాలో అర్థంకావడం లేదు.
– సార్గు భాగ్యమ్మ, మహిళా రైతు, రాయిలాపూర్, రామాయంపేట, మెదక్ జిల్లా
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

