ఊట్కూర్, ఫిబ్రవరి 18 : శివ మాలధారణ స్వాముల శివ నామస్మరణ.. శరణు ఘోషతో శివ మహాపూజ కనుల పండువగా జరిగింది. మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన శివ మహాపూజకు వివిధ గ్రామాల నుంచి శివ మాలధారణ స్వాములు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గురుస్వాములు నేరడుగం సిద్ధిరామయ్య, ప్రభులింగం ఆధ్వర్యంలో శివ మాలధారణ స్వాములు, భక్తులు మేళ తాళాలతో స్థానిక వీరభద్రేశ్వర ఆలయం నుంచి శివాజీనగర్, మెయిన్‌బజార్, భవానీమందిర్, బస్టాండ్ మీదుగా కలశ ఊరేగింపు నిర్వహించారు. వీరభద్రేశ్వర స్వామి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా మంటపంలో శివుడికి రుద్రాభిషేకం, లింగాష్టకం, శివాష్టకం, ద్వాదశ జ్యోతిర్లింగ పూజ, మహా మంగళ హారతి నిర్వహించారు. గురుస్వామి రాముగౌడ్ భక్తబృందం సభ్యులు భక్తి గీతాలతో అలరించారు. వివిధ గ్రామాల నుంచి హాజరైన శివస్వాములు, భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, ఎంపీటీసీలు హన్మంతు, కోరం పద్మ పాల్గొన్నారు.
మరికల్, ఫిబ్రవరి 18 : కురుమయాదవులు ఐదేండ్లకు ఒకసారి జరుపుకొని ఎల్లమ్మ, బీరప్ప ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పాత కురమగేరి నుంచి బీరప్పస్వామి ఉత్సవ విగ్రహానికి పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం బండారు ఉత్సవం జరుపుకొని ఒకరిపై ఒకరు పసుపు చల్లుకున్నారు. ఉత్సవాల్లో కరీంనగర్ జిల్లా జిమ్మికుంట నుంచి వచ్చిన డప్పు కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా సోమవారం మండలకేంద్రంలో బీరప్ప బండారు ఉత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మహ్మదాబాద్, ఫిబ్రవరి 18 : మండలంలోని సంగాయిపల్లి తండాల్లో మూడు రోజులుగా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం తండాల్లో నూతనంగా నిర్మించిన ఆలయాల్లో శివలింగం, ఆంజనేయస్వామి, నవగ్రహల ప్రతిష్ఠాపన కార్యక్రమాలను తండా ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విగ్రహాల ప్రతిష్ఠాపన అనంతరం ఉమ్మడి మండల పలువురు నాయకులు ఆలయాల్లో కొలువుదీరిన శివలింగానికి, ఆంజనేయ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు కేఎస్ఆర్ ట్రస్టు వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ, మాజీ ఎంపీపీ శాంతి, వేణుగౌడ్, తండా నాయకులు సుధాకర్, లక్ష్మణ్, శ్రీను, బాబు, చందర్, సక్రు, దేవీబాయితోపాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.