తెలుగు సాహిత్యంలో వచన కవితా ఉద్యమం ఒక సువర్ణ అధ్యాయం. ఒకప్పుడు ఛందస్సు, ప్రాస, అలంకారాల బందిఖానాలో ఉన్న తెలుగు కవిత్వాన్ని వీధుల్లోకి తెచ్చి, సామాన్యుడి గొంతును వినిపించిన అద్భుత ప్రక్రియ వచన కవిత. అయితే, దశాబ్దాలు గడిచేకొద్దీ ఈ ప్రక్రియ పట్ల భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు విమర్శకులు వచన కవితా ప్రవాహం పాతబడిందని, అందులో పస తగ్గిందని వాదిస్తుంటే, మరికొందరు అది కొత్త పుంతలు తొక్కుతూ మరింత లోతైన, సూక్ష్మమైన భావ వ్యక్తీకరణకు వేదిక అవుతున్నదని బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో వచన కవితా వికాసాన్ని ఒకసారి విశ్లేషించుకుంటే, అది పాతబడటం కాదని, కేవలం తన రూపాన్ని మార్చుకుంటూ పరిణామం చెందుతున్నదని స్పష్టమవుతున్నది.
ఒకప్పుడు వచన కవిత అంటే ఉద్వేగం, నిరసన, సామాజిక మార్పు కోసం పిలుపునిచ్చే ఒక శక్తివంతమైన ఆయుధం. విప్లవ కవిత్వ కాలంలో అది సమాజంలోని అన్యాయాలను ఎండగట్టే నిప్పుకణికలా పనిచేసింది. అప్పటి కవిత్వంలో వాడిన భాష, పదాలు, వస్తువు అన్నీ ఒక ప్రత్యేక ఆవేశాన్ని కలిగి ఉండేవి. ఆ కవితలు పాఠకుడిని ఆలోచింపజేయటమే కాకుండా కదిలించేవి. కాలక్రమేణా ఆ ఉద్వేగం తగ్గింది. దీనినే కొందరు పాతబడటం అని భావిస్తున్నారు. కానీ, కవిత్వం అంటే కేవలం నినాదాలు మాత్రమే కాదు కదా! సమాజంలో మార్పు వచ్చినప్పుడు, వ్యక్తుల ఆలోచనా దృక్పథం మారినప్పుడు కవిత్వం కూడా తన శైలిని మార్చుకోవటం సహజం. నేడు వచన కవిత తన ఆవేశాన్ని తగ్గించి, అంతర్మథనాన్ని పెంచుకున్నది. బయట ప్రపంచంలోని యుద్ధాల కంటే, మనిషి లోపల జరుగుతున్న యుద్ధాలను, ఒంటరితనాన్ని, ఉనికిని వెతుక్కొనే ప్రయత్నాన్ని నేటి కవిత్వం ప్రతిబింబిస్తున్నది.
కొత్త పుంతల విషయానికి వస్తే..నేటి వచన కవితలో ‘నిశితమైన పరిశీలన’ పెరిగింది. ఒకప్పుడు పెద్ద పెద్ద కవితా సంపుటాలు రాస్తేనే అది కవిత్వంగా చెలామణి అయ్యేది. ఇప్పుడు ‘మినీ కవితల’ కాలం నడుస్తున్నది. రెండు లేదా మూడు లైన్లలోనే ఒక పెద్ద జీవిత సత్యాన్ని ఆవిష్కరించటం నేటి కవులకు అలవాటైంది. ఇది మనిషికి సమయం లేని, ఆత్రుతగా పరుగెత్తే ఈ డిజిటల్ కాలానికి సరిగ్గా సరిపోతుంది. కవిత్వం ఇప్పుడు సుదీర్ఘమైన వర్ణనల నుంచి ‘సందేశాత్మకమైన సంక్షిప్తత’ వైపు ప్రయాణిస్తున్నది. భాషాపరంగా చూస్తే, అచ్చమైన తెలుగు పదాలతో పాటు, ఆధునికతను ప్రతిబింబించే కొత్త పదబంధాలను కవులు సృష్టిస్తున్నారు.
సాంకేతికత, అంతరిక్షం, పర్యావరణం, మానవ సంబంధాల సంక్లిష్టత వంటి అంశాలు నేటి కవిత్వంలో ప్రధాన వస్తువులుగా మారాయి. అంటే, వస్తువు మారుతున్నది, శిల్పం మారుతున్నది, కానీ కవిత్వపు ఆత్మ మాత్రం సజీవంగానే ఉన్నది.
డిజిటల్ మాధ్యమాల ప్రభావం వచన కవితపై విపరీతంగా ఉన్నది. బ్లాగులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి వేదికలు కవిత్వాన్ని సామాన్యుడికి మరింత చేరువ చేశాయి. ఎక్కడో మూలన కూర్చున్న ఒక యువ కవి రాసిన కవిత, క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలమందికి చేరుతున్నది. ఇది కవిత్వానికి కొత్త ప్రాణం పోసింది. అయితే, ఈ వేగంలో కవిత్వ నాణ్యత పడిపోతున్నదనే విమర్శ కూడా ఉన్నది. ఏది కవిత్వమో, ఏది కేవలం భావోద్వేగాల సంపుటియో తేల్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు పాఠకుడిపై, విమర్శకులపై పెరిగింది. ఈ పోటీలో నిలబడాలంటే కవి మరింత సృజనాత్మకంగా ఆలోచించాల్సి వస్తున్నది. అందుకే, నేడు వచన కవిత పాతబడటం లేదు, అది ఒక పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటున్నది. ఈ పరీక్షలో గెలిచిన కవిత్వం మాత్రమే చిరస్థాయిగా నిలుస్తుంది.
వచన కవితా వికాసం గురించి మాట్లాడుకునేటప్పుడు, మనం మర్చిపోకూడని విషయం ఒకటి ఉన్నది. అది మనిషి మనుగడకు సంబంధించినది. సమాజంలో అన్యాయాలు, వివక్ష ఉన్నంతకాలం కవిత్వానికి నిరసన అవసరం.
మానవ సంబంధాల్లోని ఆర్ద్రత, ప్రకృతి పట్ల ప్రేమ, మరణం పట్ల భయం, జీవితం పట్ల ఆశ ఉన్నంతకాలం కవిత్వానికి వ్యక్తీకరణ అవసరం. ఇవన్నీ ఉన్నంతకాలం వచన కవితా రూపం, శైలి ఎంత మారినా, అది నిత్యనూతనంగానే ఉంటుంది. వచన కవిత కేవలం రాయటం మాత్రమే కాదు, అది చూసే దృక్పథం. మనం లోకాన్ని చూసే కండ్లు మారినప్పుడు, మనం రాసే కవిత కూడా మారుతుంది. పాతాళంలో ఉన్న విషయాన్ని భూమి మీదకు తెచ్చిన కవిత్వం ఇప్పుడు అంతరిక్షంలోకి కూడా అడుగుపెడుతున్నది.
వచన కవిత పాతబడిందా? లేక కొత్త పుంతలు తొక్కుతున్నదా? అనే ప్రశ్నకు సమాధానం పాఠకుడి ఆసక్తిలోనే ఉన్నది. వచన కవితా ప్రక్రియ ఒక నది వంటిది. అది ఎప్పుడూ ఒకేలా ఉండదు. మలుపులు తిరుగుతుంది, లోతు పెరుగుతుంది, ప్రవాహం మారుతుంది. కానీ నది ప్రవాహం ఆగిపోదు. మానవ భావాలు, ఆలోచనలు ఉన్నంతవరకు కవిత్వం రూపం మారుతూ, కొత్త కొత్త అర్థాలను పులుముకుంటూ పరిఢవిల్లుతూనే ఉంటుంది. నిన్నటి కవిత్వం మనకు పునాదిని ఇస్తే, నేటి కవిత్వం మనకు భవిష్యత్తును చూపిస్తుంది. కనుక వచన కవిత మరణించలేదు, అది తనను తాను ఆధునీకరించుకుంటూ నిరంతర చైతన్యంతో పయనిస్తున్నది. కొత్తతరం కవులు తమ సృజనాత్మకతతో కవిత్వానికి మరింత మెరుగులు దిద్దుతున్నంత కాలం, ఈ వచన కవితా యానం సాగుతూనే ఉంటుంది.
– కాళేశ్వరం కృష్ణమూర్తి 9705196097