‘ఒళ్లంతా మట్టి గంధపు పరిమళం వెదజల్లుతున్నాడంటే అతడు రైతు. కవిత్వమంతా తెలంగాణ భాషా-సాంస్కృతిక పదాల సొగసుతో పొంగిపొర్లుతున్నదంటే అది అన్నవరం దేవేందర్ కవిత్వం’.
ప్రాచీన గ్రీకు సహజ కవి ‘హోమర్’ తన మహాకావ్యం ‘ఇలియడ్’లో యోధుడు ‘అకిలీస్’ కోపం, వీరత్వం, మానవీయ భావోద్వేగాలను ఎంత సహజంగా ఆవిష్కరించాడో, తెలంగాణ సాహిత్యంలో అన్నవరం దేవేందర్ తన ‘ఊరి దస్తూరి’లో పల్లె జీవితాన్ని, తెలంగాణ సంస్కృతిని, ఆ ప్రాంతపు జీవన సౌందర్యాన్ని అంతే సహజంగా చిత్రించారు. అందుకే ‘ఊరి దస్తూరి’ చదివితే తెలంగాణ నేల పరిమళం, పల్లె మనుషుల జీవన ధ్వని పాఠకుడికి సాక్షాత్కరిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది తెలంగాణ సాంస్కృతిక చిత్రపటం.
నిజమైన కవి కాలంతో పాటు తన దృక్పథాన్ని విస్తరించుకుంటూ సాగుతాడు. మారుతున్న సామాజిక పరిస్థితులు, కొత్త అనుభవాలు, కొత్త భావజాలాన్ని తన కవిత్వంలో ప్రతిబింబింపజేస్తాడు. ఈ లక్షణమే అన్నవరం దేవేందర్ కవిత్వానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ప్రతి కవి కొత్త విషయాలను కవిత్వీకరించవచ్చు; కానీ వాటిని చూసే దృష్టికోణం, వ్యక్తీకరించే శైలి, భాషను వినియోగించే విధానం కవిని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఆ ప్రత్యేకతలన్నీ దేవేందర్ కవిత్వంలో స్పష్టంగా, నిరంతర ప్రవాహంగా కనిపిస్తాయి.
చలికాలం ‘బగ్గచలి’తో వణికిస్తే, ఆ చలిలోని సొంపు, ఆ అనుభూతిలోని చెక్కిలిగింతలను కవితా భాషలో ‘అట్లనే’లో ఆవిష్కరిస్తారు. ప్రకృతి మార్పులు, కాలగమన స్పందనలు, పల్లె జీవనానుభవాలు ఆయన కవిత్వంలో సహజంగా మమేకమై ఉంటాయి. దీనికి మరో ఉదాహరణే ‘సందుగ’ కవిత. కుమ్మరి కుండ, మాదిగ డప్పు, సాలెన్ కడాలు, పట్టగొలుసులు, ముక్కుపోగు, ఒడ్డాలం, డాంబర్ గోలీలు, మొలదారంనకు వేలాడే తాళం చేయి, దుగుట దీపం, తనిబ్బి, దూలం, శిలక్కొయ్య, ఎండి చిల్లలు, దొంతి కుండలు, గుబ్బిగడ్డ, మోదుకు ఆకులు, దర్వాజ బండ, పొగాకు కట్టలు. ఈ సందుగలోనే సబండం. ఈ సబండమే తెలంగాణ జీవద్భాష భాండాగారం. ఈ సందుగనే అసలైన తెలంగాణ అస్తిత్వం, ఉనికి కూడా. అందువల్ల అన్నవరం దేవేందర్ కేవలం తెలంగాణ భాషను ఉపయోగించే కవి మాత్రమే కాదు; తెలంగాణ జీవన సంస్కృతి, ప్రజల అనుభవాలు, నేలతనానికి కవిత్వరూపం ఇచ్చిన అరుదైన కవి.
మొదట దళిత బహుజన దృక్పథంతో కవిత్వం రాసినా, తనలో ‘రగులుతున్న అక్షరాలు’, ‘వెన్నెలపై దాడి’, ‘విన్నపం’, ’రహస్య యుద్ధం’ విప్లవ భావాల్ని మోసుకొస్తాయి.‘పుట్టుమచ్చలు’ కవితతో ప్రకృతి విధ్వంసం మీద తిరుగుబాటు చేస్త్తూ ప్రపంచీకరణ ప్రభావాన్ని ఎండగడతాడు.
ఊరి పక్కనే గుట్ట ఉండేది
అయిదు పదేండ్లుగ అమ్మకం సరుకై
కరిగి తరిగి పురాగ మాయమైంది.
కండ్ల సింగారమైన ఆ కొండ గుట్ట
వజనుగ బంగారమై పరదేశం పాలైంది.
అలాగే..
‘గుట్ట కోల్పోయిన ఊరు
కాలి బూడిదైన కాష్టం దృశ్యం’
అంటూ ఆవేదన చెందుతారు. కవిలో ఎంతటి ఆర్ధ్ద్రత, ఎంతటి నిగూఢమైన బాధ దాగి ఉన్నదో తెలిపే సామాజిక దృశ్యం ‘పుట్టుమచ్చలు’. ఇలా ఈ కవిత్వ ప్రవాహం ‘తొవ్వ’తో మొదలై మెల్లగా ‘నడక’ అందుకొని ‘మంకమ్మతోట లేబర్ అడ్డా’, ‘బుడ్డపర్కలు’, బొడ్డు మల్లెచెట్టు, గాంధారి, వరి గొలుసులు, బువ్వ కుండ, పొద్దు పొడుపు మొదలుకొని నిన్నమొన్నటి ‘అట్లనే’ వరకు 14 కవితా సంపుటాలు, నాలుగు వ్యాస సంపుటాలుగా మనముందుకు వచ్చాయి. ఆయన రచనల మీద యూనివర్సిటీ స్థాయిలో సమగ్ర పరిశోధనలు జరుగుతున్నాయి. మూడు గ్రంథాలు ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి. దాశరథి కృష్ణమాచార్య పురస్కారంతో పాటు ముప్పై మూడు పురస్కారాలు ఆయనను
వరించడం విశేషం.
(బహుభాషావేత్త నలిమెల భాస్కర్ తల్లిదండ్రులు కీ.శే.నలిమెల బుచ్చమ్మ – రామచంద్రం స్మారక రాష్ట్ర స్థాయి తొలి పురస్కారాన్ని ఈనెల 28న ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ అందుకోబోతున్న సందర్భంగా..)
– డాక్టర్ జీడి రమేష్ 8328440015