సభ్యత అంటే భయమేల రేవంత్?
సంస్కారం లేనివాడనిపించుకోవటంలో దుఃఖించవలసింది, అవమానంగా భావించవలసిందే తప్ప గర్వించదగింది ఏమీ ఉండదు గనుక, మానసిక ఘర్షణకు గురై తన తీరును మార్చుకుంటారనిపిస్తుంది. మామూలు పార్టీ కార్యకర్తలో, కిందిస్థాయి నాయకులో అయితే వేరు.
అసభ్యతకు అలవాటుపడిపోయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సభ్యత అంటేనే భయం కలుగుతున్నట్లు తోస్తున్నది. అసభ్యత, అనాగరికత వల్ల కోల్పోయేది ఏమిటో, ఆ లక్షణాలు లేనపుడు లభించేది ఏమిటే ఆయనకు తెలియదనుకోలేము. కాని, తను పెరిగిన తీరు వల్ల కొంత కావచ్చు, నోటిదురుసుతోనే అధికారానికి రాగలిగాననే నమ్మకం వల్ల కొంత కావచ్చు తను అసభ్య లక్షణాలు వదులుకోలేకపోతున్నారు.
తిరిగి అధికారానికి రావాలన్నా అసభ్యతే ఆధారమని నమ్ముతుండవచ్చు కూడా.రేవంత్‌రెడ్డి ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ, తనకు సంస్కారం లేదంటున్నారని పేర్కొన్నారు. దానిని బట్టి ఆయనకు ఆ విషయం తెలియటమేగాక, ఆ కారణంగా ఎంతో కొంత వత్తిడికి గురవుతుండవచ్చునని కూడా తోస్తున్నది. లేనట్లయితే ఆ విధంగా పైకి చెప్పుకోరు మనుషులు. వత్తిడికి గురై తన బాధను అట్లా పైకి చెప్పుకున్నపుడు మనకు ఏమనిపిస్తుంది?
సంస్కారం లేనివాడనిపించుకోవటంలో దుఃఖించవలసింది, అవమానంగా భావించవలసిందే తప్ప గర్వించదగింది ఏమీ ఉండదు గనుక, మానసిక ఘర్షణకు గురై తన తీరును మార్చుకుంటారనిపిస్తుంది. మామూలు పార్టీ కార్యకర్తలో, కిందిస్థాయి నాయకులో అయితే వేరు. కాని ముఖ్యమంత్రి వంటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని నలుగురూ సభ్యత లేనివాడు, అనాగరికుడు, సంస్కారం లేనివాడు అంటే అది తలకొట్టేసినంత పని. మామూలుగానే మనుషులు అభిమానవంతులై ఉంటారు. ఒకవేళ తమది తప్పు అయినా ఇతరులు అట్లా వ్యాఖ్యానిస్తే పౌరుషం తన్నుకువస్తుంది. ఒక విషయం చాలామంది గమనించి ఉంటారు. మాట అంటే పడని లక్షణం మనుషులకు ఇటీవలి కాలంలో ఒకప్పటి కన్న పెరుగుతున్నది. లోగడ వలె సర్దుకుపోవడం క్రమంగా తగ్గుతున్నది. అటువంటిది, సహించే లక్షణాలు సహజంగానే లేక చిరాకుకు, ఆగ్రహానికి గురయ్యే స్వభావం గల రేవంత్‌రెడ్డి వంటి వారికి, సంస్కారం లేని మనిషి అన్నంత తీవ్రమైన మాట ఎంత అవమానకరం అవుతుందో చెప్పనక్కరలేదు. అది గుర్తించి, ఆ వ్యాఖ్యలను పైకి చెప్పుకొని బాధపడుతూ కూడా తను సంస్కారవంతుడు ఎందుకు కావడం లేదన్నది ప్రశ్న. అంతేకాదు. పరిపాలనా వైఫల్యాల వల్ల ప్రజల నుంచి విమర్శలు పెరిగే కొద్దీ ఒత్తిడి వల్ల సభ్యతా సంస్కారాలను మరింత కోల్పోతున్నారు.
చాలామందికి ఒకటి గుర్తుండి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి కాంగ్రెస్ పార్టీ గెలిచినపుడు, తన ముందు నిలిచిన చానల్ విలేకరులతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి, తన పక్కనా వెనుకా చేరిన కార్యకర్తలను, అనుయాయులను ఉద్దేశించి ఒక మాట అన్నారు. తాను అంత వరకు మాట్లాడిన భాష ఇక ముందు కూడా మాట్లాడగలనని అనుకోవద్దని, అట్లా మాట్లాడలేనని అన్నారాయన. అది విన్న వారికి ఏమనిపించి ఉంటుంది? తనది సంస్కారం, సభ్యత గల భాష కాదని ఆయనకు ఇతరులు ఎత్తిచూపకుండానే తెలుసునని, అది సరైనది కానట్టు గుర్తించాలని, అయినప్పటికీ అట్లా మాట్లాడితేనే ఓట్లు వస్తాయని భావించి ఆ పని చేశారని, ఇప్పుడు ఆ కార్యం తీరిపోయినందున తర్వాత నుంచి సభ్యతగా మాట్లాడుతారని, అదే విషయాన్ని తనకు తాను చెప్పుకోవడంతోపాటు, తన చుట్టూ చేరి, ఆ తరహా భాషకు కేరింతలు కొట్టే అనుచరులకు కూడా ముందు జాగ్రత్తగా సూచిస్తున్నారని అనిపిస్తుంది.
ఓట్ల కోసం రెచ్చగొట్టేందుకైనా సంస్కారాన్ని కోల్పోయి మాట్లాడటం సరైనది కాదు. ఇతర పార్టీలను విమర్శించడం ద్వారా వివేచన కల్పించడం, తమ విధానాల ప్రకటన ద్వారా స్ఫూర్తిని కలిగించడం సరైన పద్ధతి. అట్లా గాక అసభ్యకరమైన భాష, అందుకు సరిపోయే హావభావాలతో రెచ్చగొట్టడం, అందులో భాగంగా అంతులేని అబద్ధాలను జోడించటం సమర్థించలేనిది.
ఎన్నికల ప్రచార కాలమంతా రేవంత్‌రెడ్డి అదే పద్ధతిలో నడిచారు. ఆ పద్ధతిని ఆమోదించే కాంగ్రెస్ కార్యకర్తలు, సదరు నాయకుని వ్యక్తిగత అనుచరులు కొందరు ఉండవచ్చుగాక. సాధారణ ప్రజల్లోనూ ఆ ధోరణితో ఏకీభవించే స్వభావం గలవారు కొందరుంటారు. ఇదంతా అదే కాలంలో బీజేపీ నాయకుడు బండి సంజయ్ విషయంలోనూ కనిపించింది. రేవంత్‌రెడ్డి సంజయ్‌ని మించిపోయారు. అందుకే అప్పుడు జనం వీరిద్దరినీ పోల్చి మాట్లాడుతుండేవారు. ఇక్కడ గమనించవలసింది మరొకటి ఉన్నది. ఆ తీరు తగదని ఆయనను కాంగ్రెస్ ఢిల్లీ నాయకత్వం సైతం వారించలేదు. వాస్తవానికి నెహ్రూ-గాంధీ కుటుంబం ఎంతో సంస్కారవంతమైనది. క్రమంగా బలహీనపడుతున్నది గానీ, ప్రస్తుతపు రాహుల్‌గాంధీ వరకు సంస్కారాన్ని, సభ్యతాయుతమైన భాషను మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. అయినా వారు రేవంత్‌రెడ్డి సంస్కారరాహిత్యాన్ని ఉపేక్షించడం ఎందువల్ల? అందులో అర్థం కానిదేమీ లేదు. వారు ఎంతగా బలహీనపడి, అధికారం కోసం ఎంతగా పరితపిస్తున్నారంటే, అందుకోసం దేనినైనా ఉపేక్షించే స్థితికి చేరుకున్నారు.
స్వయంగా సంస్కారం కోల్పోవడం ప్రత్యక్ష పతనం అయితే, దానిని తమవారు కోల్పోయినా ఉపేక్షించడం పరోక్ష పతనమవుతుంది. ఆ విధంగా చూసినప్పుడు, రేవంత్‌రెడ్డి సందర్భంలో గాంధీ కుటుంబం తన సంస్కారాన్ని పరోక్షంగా కోల్పోయింది. రేవంత్‌రెడ్డి తన సభ్యతా రాహిత్యాన్ని తన నాయకునికి కూడా కొంత పంపిణీ చేశారు. ఇరువురి పరమ లక్ష్యం అధికార సాధన గనుక వారిద్దరు కలిసి ముక్కాలి పరుగు తీశారు. రాష్ట్ర నాయకుని అసభ్యత ఇప్పటికీ కొనసాగుతున్నది, దానిని జాతీయ నాయకుడు నేటికీ సహిస్తున్నారంటే, అధికారమే పరమావధిగా వారి ముక్కాలి పరుగు ఒక మారథాన్ వలె కొనసాగుతూనే ఉన్నదన్నమాట.
ఇందులో రేవంత్‌రెడ్డి, ఆయన ఢిల్లీ నాయకుడు అర్థం చేసుకోనిది ఒకటున్నది. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది రేవంత్‌రెడ్డి సభ్యతలేని భాష, అడ్డూఅదుపూలేని అబద్ధాల వల్ల కాదు. వాటి ప్రభావాలు అసలు లేవనడం లేదు. వాటితో ప్రభావాలు అసలు లేవనడం లేదు. వాటితో ప్రభావితులయ్యేవారు కొందరు ఎప్పుడూ ఉంటారు. అంతకన్నా అనేక రెట్లు ఎక్కువగా ఆరు గ్యారంటీలు, ఇతర అలవికాని హామీలు ప్రభావం చూపాయి. అట్లా చూపగలవని హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలో అర్థమైనందువల్లనే తెలంగాణలోనూ అటువంటి హామీలతో ముందుకు వచ్చారు. ఎందుకైతేనేమి తగినంత మంది వాటిని నమ్మారు. ఈ మాట రేవంత్‌రెడ్డి అర్థం చేసుకోలేనిది కాదు. ఆ దశ గడిచిపోయింది. అందుకే ఎన్నికల ఫలితాల రోజున ఆయన చానల్ కెమెరాల ఎదుట తన మనుషులతో ఆ మాట అన్నట్టు భావించాలి. ఆ తర్వాత కూడా, గత మూడేండ్లుగా, నేటికీ, అదే సంస్కారహీన ధోరణిని ఎందుకు కొనసాగిస్తున్నట్టు? తనకు సంస్కారం లేదంటున్నారని ఇటీవల తానే బాధతో చెప్పుకొంటూ కూడా ఆ పద్ధతిని ఎందుకు వదలుకోలేకపోతున్నట్టు? ముఖ్యమైనది ఒకటి తోస్తున్నది. లేదా అదే అసలైన విషయం కావచ్చు. తమవి అన్నీ ఓట్ల కోసం ఇచ్చిన దొంగ హామీలని ప్రజలకు అర్థం కావటం కొన్ని నెలలు గడిచే సరికి మొదలయ్యాయి.
హామీలు నెరవేర్చలేని, సమాధానాలు చెప్పలేని అడకత్తెరలో ముఖ్యమంత్రి ఇరుక్కుపోయారు. ఒత్తిడి పెరిగిపోసాగింది. అదంతా చాలదన్నట్టు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తన బాధ్యతగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం మొదలుపెట్టింది. మొదట కొంతకాలాన్ని హనీమూన్ పీరియడ్‌గా వదలివేసి, ఆ తర్వాత ప్రజలే తమ విమర్శలు మొదలు పెట్టడంతో తాను కూడా అందుకు గొంతు కలిపింది.
రేవంత్‌రెడ్డికి ఒకవైపు తన ప్రభుత్వ వైఫల్యాలు, మరొకవైపు అన్ని వైపుల నుంచి విమర్శల ఒత్తిడి మధ్య ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురవసాగింది. హామీలు నెరవేర్చగల, తగు అభివృద్ధి చేయగల శక్తి లేకుండా పోయింది. దానితో సభ్యతా సంస్కారయుతమైన భాషగానీ, వ్యవహరణగానీ ఆదుకోగలవన్న ఆశలు కలుగలేదు. ఆ విధంగా, తనకు మొదటి నుంచీ అబ్బిన, తన వ్యక్తిత్వంలో స్వభావంలో భాగంగా మారిపోయిన అసభ్యత, సంస్కారరాహిత్యం అప్రయత్నంగానే అడుగడుగునా పైకి తన్నుకువస్తున్నాయి. ఆయన తనకు తానే సృష్టించుకున్న ఒక దిక్కుమాలిన స్థితిలో చిక్కుకుపోయారు. ఆ విధంగా అసభ్యతతో తప్ప బతకలేని దశకు పతనమయ్యారు.
టంకశాల అశోక్
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

