Kovela Suprasanna Charya | జీవితమంతా సాహిత్య తపస్సు చేసిన కోవెల సుప్రసన్నాచార్య
సర్వ మానవ చైతన్యాన్ని వ్యక్తం చేయటం కోసం, తాత్త్విక, ఆధ్యాత్మిక, మానవత, మౌలిక మూలాల పరిరక్షణ కోసం, ప్రగతిశీల ప్రభావమైన సాహిత్య వికాసం కోసం, దానికి తోడ్పడే భాషాలీలా విలాసాల అవగాహన కోసం, తన జాతి పరంపరాభివృద్ధి కోసం, సమగ్ర ఉజ్వలమైన దీప్తి కోసం అహరహం పరితపించే ఆంతరిక ప్రవృత్తి గల వారు ప్రతి శతాబ్దిలోనూ ఉంటారు.
సర్వ మానవ చైతన్యాన్ని వ్యక్తం చేయటం కోసం, తాత్త్విక, ఆధ్యాత్మిక, మానవత, మౌలిక మూలాల పరిరక్షణ కోసం, ప్రగతిశీల ప్రభావమైన సాహిత్య వికాసం కోసం, దానికి తోడ్పడే భాషాలీలా విలాసాల అవగాహన కోసం, తన జాతి పరంపరాభివృద్ధి కోసం, సమగ్ర ఉజ్వలమైన దీప్తి కోసం అహరహం పరితపించే ఆంతరిక ప్రవృత్తి గల వారు ప్రతి శతాబ్దిలోనూ ఉంటారు. వ్యక్తిగతమైన కష్టనిష్టూరాలను, ఆర్థికపరమైన ఒడుదొడుకులకు, సంసారపరమైన అనేకానేక అవరోధాలకు, సంకుచిత మనస్సు కలిగిన వాళ్ల నుంచి నిరంతరం ఎదురయ్యే తీవ్రమైన వ్యతిరేకతలకు ప్రభావితం కాకుండా, ఆత్మశక్తితో, సత్సంకల్పంతో జీవితమంతా సాహిత్య తపస్సు చేసిన గొప్ప రచయితల్లో ఒకరు కోవెల సుప్రసన్నాచార్య.
పితామహులు కోయిల్ కందాడై రంగాచార్యులు, మాతామహులు ఠంయాల లక్ష్మీనృసింహాచార్యుల శిష్యరికంలో రూపుదిద్దుకొన్న సుప్రసిద్ధ కవి, సాహితీ విమర్శకుడు, వ్యాఖ్యాత, సంపాదకుడు కోవెల సుప్రసన్నాచార్య. సాహిత్య విమర్శపై 18 గ్రంథాలు, 27 కావ్యాలు, అనేక సంకలనాలు ఆయన వెలువరించడం విశేషం. వ్యాకరణ, ఛందో గ్రంథాలను, విమర్శలను, ఖండకావ్యాలను, సాహిత్య చరిత్రను రాసిన ప్రముఖ కవి డాక్టర్ కోవెల సంపత్కుమారాచార్య ఆయనకు చిన్నాన్న కావడం గమనార్హం.
Kovela Suprasanna Charya | కోవెల సుప్రసన్నాచార్యులు తెలంగాణలోని వరంగల్‌లో 1936 మార్చి 17న వెంకట నరసింహాచార్యులు, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు. తొమ్మిదేండ్ల వయసులోనే కందపద్యాలు రాయడం ప్రారంభించారు. 1959లో హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ పూర్తి చేసి, 1962లో ‘రామరాజ భూషణుని కృతులు – పరిశీలన’ అనే అంశంపై జరిపిన పరిశోధనకు అదే వర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. అనంతరం ఉస్మానియా, వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉన్నత విద్యామండలి సభ్యుడిగా కూడా పని చేశారు. 1987 నుంచి ఆలిండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్‌కు జీవితకాల సభ్యుడిగా ఉన్నారు.
తన సుదీర్ఘమైన కెరీర్లో 20 మంది పరిశోధక విద్యార్థులు పీహెచ్‌డీలు, 16 మంది ఎంఫిల్స్ను ఆయన మార్గదర్శనంలో పొందారు. వివిధ విశ్వవిద్యాలయాల అకాడమీలు నిర్వహించిన అనేక సెమినార్లలో పాల్గొని తెలుగు సాహిత్యంలో వివిధ అంశాలపై 2 వేలకు పైగా పరిశోధన పత్రాలను ఆయన సమర్పించారు. తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని సుసంపన్నం చేయడానికి ఆయన చేసిన ఎనలేని కృషిని గుర్తించిన సాహితీ లోకం అనేక అవార్డులతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 1987లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, 1955లో తెలంగాణ అక్షరాస్యత వేదిక వారి ఉత్తమ కవితా పురస్కారం, 1971లో సాహిత్య వివేచన (అక్షరాస్యత విశ్లేషణ) పుస్తకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ విమర్శ పురస్కారం, 1997లో తెలుగు వర్సిటీ నుంచి ఉత్తమ పరిశోధక అవార్డు, 2010లో ‘అంతరంగం’ అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ ఠాగూరు సాహిత్య పురస్కారం, 2013లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి హంస (కళారత్న) పురస్కారం, 2016లో తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం తదితర అవార్డులు ఆయనను వరించాయి.
కోవెల సుప్రసన్నాచార్య కవితల్లో కొన్నిటిని ఆంగ్లం, హిందీ భాషలలోకి పలువురు సాహితీవేత్తలు అనువదించడంతో అవి ఆయా భాషల్లో ప్రచురితమయ్యాయి. ఆయన రచనలపై విమర్శకులు, రిసెర్చ్ స్కాలర్స్, సాహితీవేత్తలు అనేక పుస్తకాలు ప్రచురించారు. ఉదాహరణకు ‘ప్రసన్న శారద’ (60వ జన్మదిన సంపుటి), ‘సుప్రసన్న సాహితీ వైజయంతి’ పుస్తకాలు ఆ కోవలోనివే. ఆయన 80వ జన్మదినం సందర్భంగా ‘సన్నుతి’ పేరిట ప్రత్యేక సంచికను ఆయన శిష్యులు, అభిమానులు వెలువరించారు. ఇప్పటికీ ఆయన రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో ఎంఫిల్స్, పీహెచ్‌డీల కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి.
వ్యక్తిత్వం వికసించే దశలో ఉండగానే ఆర్యసమాజ్ ఉద్యమాలతో ఆయన ప్రభావితుడయ్యారు. ఏ ఉద్యమంలోనూ ఆయన ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కానీ, దేశంలోని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ధోరణులను గమనించడం ద్వారా తన జీవిత దృక్పథాన్ని లోతుగా మలుచుకున్నారు. శ్రీరామకృష్ణులు, స్వామి వివేకానంద, శ్రీఅరవిందులు, గాంధీజీ తదితర ప్రముఖుల రచనలు ఆయనలో చైతన్యాన్ని రగిలించి, ప్రభావితం చేసి.. జాతి నిర్మాణంలో నిబద్ధతతో కూడిన దార్శనిక కవి, విమర్శకుడిగా, రచయితగా ఎదగడానికి దోహదపడ్డాయి. ఒకానొక దశలో మార్క్సిస్టు భావజాలం, వామపక్ష ఉద్యమాల ప్రభావానికి ఆయన లోనయ్యారు. కానీ, అరవిందులు, విశ్వనాథ సత్యనారాయణల స్ఫూర్తి, రచనలు ఆయనలోని చైతన్యాన్ని చుట్టుముట్టి దార్శనికత కలిగిన గొప్ప రచయితగా మార్చాయి. ‘శతాంకురలో నా కవితలు నూతన యుగానికి ఆధార భూమికలు’ అని ఆయన పేర్కొన్నారు. తన కవిత్వం సమకాలీన కాలం నుంచి ప్రేరణ పొంది శాశ్వత విలువలను ప్రచారం చేసి భవిష్యత్తును చూస్తుందని దాని భావం.
జాతీయత, ప్రజాస్వామ్యం, సంప్రదాయ విలువలు, ఆధ్యాత్మిక స్ఫూర్తిని ఆయన ప్రచారం చేశారు. ఆయన దృష్టిలో మతం అంతిమ విషయం కాదు, మానవ పురోగతి సాధనలో అది ఒక మైలురాయి మాత్రమే. అంతిమ సత్యాన్ని సాధించడానికి మానవుడు మతతత్వాలకు పరిమితం కాకూడదు. మత సిద్ధాంతాల తాత్త్విక కట్టుబాట్లు, సిద్ధాంతాల అడ్డంకులను నాశనం చేయడం ద్వారా మనిషి ఎదగాలి. మానవాళి, ప్రకృతి, జంతువులు, విశ్వం పట్ల తన ప్రేమను మానవుడు విస్తరించాలని ఆయన స్పష్టంగా సూచిస్తారు.
ఈ ప్రక్రియలో తన పరిమితులను, స్వార్థాన్ని, బలహీనతలను జయించిన మానవుడు అంతిమంగా సమాజాన్ని, ప్రకృతిని, విశ్వాన్ని ఆలింగనం చేసుకుని అందరితో ఏకమవుతాడు. సుప్రసన్న కవితా రచనలన్నిటికీ జీవితం కేవలం భౌతిక అస్తిత్వం కాదు. అదొక సమగ్ర జీవనం. జీవితం ఒక నిత్య గ్రంథం అని శతాంకురలో ఆయన చెప్పారు.
రచనలన్నింటిలోనూ తనదైన భావ వ్యక్తీకరణ పద్ధతిని ఆయన పెంపొందించుకున్నారు. ప్రతి కవితా రచనలో భాష, శైలి, ఛందస్సు వంటి పద్ధతులను అవలంబించారు. ఆయన కవిత్వం ద్వారా పాఠకుడు గొప్పదనాన్ని, లోతైన అనుభవాన్ని, ఊహాశక్తిని అనుభూతి చెందగలడు. సుప్రసన్న కవిత్వానికి మానవ జీవితం సామాన్య సమీకరణం కాదు. ఇది ప్రతి వ్యక్తి తన సొంత మార్గంలో చేయవలసిన సంక్లిష్టమైన శాశ్వత ప్రయాణం. అందుకే ఆయనకు ‘జీవితమే నా జెండా’. మనిషి జీవితాన్ని పట్టుదలతో పూర్తిగా అనుభవించి, ఎలాంటి అవాంతరాలు లేకుండా పట్టుదలతో ఉండాలి. ఈ గొప్ప సత్యమే ఆయన మొత్తం సాహిత్య రచనలకు మూలం. అందుకే ఆయన కవితలలో జీవితం వెల్లివిరుస్తుంది. ఆయన కవిత్వం జీవిత పరిపూర్ణతను, ప్రకాశవంతమైన ఆత్మకు సంబంధించిన లోతైన భావాల అన్వేషణ, వేడుక. ఆయన కవిత్వం ఇంద్రియానుభూతికి అతీతంగా కొత్త పరిధులను తెరుస్తుంది.
– సాయి లోహిత పులపా
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

